ETV Bharat / state

Illegal Sand Mining: వైసీపీ నేతల అక్రమాలు.. గుత్తేదారు ముసుగులో ఆగని ఇసుక దోపిడి..

author img

By

Published : Jul 30, 2023, 7:35 AM IST

Updated : Jul 30, 2023, 8:14 AM IST

Illegal Sand Mining
ఇసుక అక్రమాలు

YSRCP leaders Illegal Sand Mining: వైసీపీ నేతలు అరాచకాలు రోజురోజుకు మీతిమీరిపోతున్నాయి. అక్రమార్కులు రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. చివరికి ఇసుకను కూడా అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇసుక వ్యాపారం కోసం రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్​లను గుత్తేదారు జేపీ సంస్థ టెండర్లు దక్కించుకోగా.. ఆ సంస్థ జీఎస్టీ చెల్లింపులు లేవని ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ సస్పెండ్​ చేసింది. దీంతో ఆ సంస్థ ముసుగులో వైసీపీ నేతలే ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

జేపీ సంస్థ పేరిట యథేచ్ఛగా వైసీపీ నేతల ఇసుక తవ్వకాలు

YSRCP leaders Illegal Sand Mining In Andhra Pradesh: రాష్ట్రంలోని అన్నీ ఇసుక రిచ్‌లలోనూ అధికారిక గుత్తేదారు జయ్‌ప్రకాశ్ పవర్‌ వెంచర్స్ బరితెగింపు కొనసాగుతోంది. నెలల తరబడి జీఎస్టీ చెల్లించకపోవడంతో.. జేపీ సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను వాణిజ్య పన్నుల శాఖ సస్పెండ్ చేసింది. దీంతో ఇసుక తవ్వకాలు ఆపేయాలని పర్యావరణ శాఖ ఆదేశించింది. అయితే ఆదేశాలను ఖాతరు చేయకుండా జేపీ సంస్థ పేరిట వైసీపీ నేతలు దర్జాగా ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని అధికారిక గుత్తేదారు జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ను ఇప్పటికే పర్యావరణశాఖ ఆదేశించింది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా జేపీ పేరిట వైసీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ఇచీవలే జేపీ సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్​ను వాణిజ్య పన్నుల శాఖ సస్పెండ్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఇసుక వ్యాపార టెండర్​ను దిల్లీకి చెందిన జేపీ సంస్థ దక్కించుకుంది. అయితే అది 2021, మే 13న ఏపీలో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించుకొని గుర్తింపు నంబరు పొందింది.

గుర్తింపు పొందిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో జేపీ సంస్థ ఇసుక వ్యాపారాన్ని ప్రారంభించింది. రీచ్‌లో టన్ను ఇసుక జీఎస్టీతో కలిపి 4 వందల 75 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇసుక రావాణా దారులకు చెల్లించే మొత్తంలో కూడా కొంత జీఎస్టీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొద్ది నెలలుగా జేపీ సంస్థ జీఎస్టీ చెల్లించడం లేదని.. ఆసంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్​ గుర్తింపు నంబర్ను వాణిజ్య పన్నులశాఖ అధికారులు గత నెల 6న సస్పెండ్‌ చేశారు.

నెలల తరబడి జీఎస్టీ చెల్ల్లించని సంస్థలపై చర్యల్లో భాగంగా ఇలా వాటి రిజిస్ట్రేషన్‌ సస్పెండ్‌ చేస్తామని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా జేపీ సంస్థ పేరిట రాష్ట్రమంతటా వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు నిర్విరామంగా సాగుతున్నాయి. గనులశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

వాస్తవానికి జేపీ సంస్థ ప్రధాన గుత్తేదారు కాగా.. చెన్నై మైనింగ్‌ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఉప గుత్తేదారుగా వ్యవహరించింది. గతేడాది ఆగస్టు వరకు ఆ సంస్థ అన్ని వ్యవహారాలూ చూసుకుంది. అయితే గత ఆగస్టులో ఆ సంస్థను ఆకస్మికంగా తప్పించారు. కాకినాడకు చెందిన వైసీపీ నేతకు ఇసుక వ్యాపార బాధ్యతలు అప్పగించారు. అతని ఆధీనంలో అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతున్నారు. అప్పటి నుంచే జీఎస్టీ చెల్లింపులు ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇసుక విక్రయాల లెక్కలు చూపకపోవడం, జీఎస్టీ చెల్లించకపోవడంతో జేపీ సంస్థ పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

కాకినాడకు చెందిన వైసీపీ నేత తరఫున పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో ఎంత తవ్వకాలు, విక్రయాలు జరిగాయి అనేది పరిశీలించడం, జిల్లా సిండికేట్ల నుంచి డబ్బులు వసూలు చేసి హైదరాబాద్‌లో పెద్దలకు చేర్చడం వంటివి ఆయన చూస్తుంటారని తెలిసింది. వీరి కార్యాలయం విజయవాడలో ఉంది. కొద్ది నెలల కింద కేంద్ర జీఎస్టీ అధికారులు ఈ కార్యాలయంపై దాడులు చేసి మూడు రోజులపాటు సోదాలు నిర్వహించారు.

రీచ్‌ల నుంచి డిపోలు, స్టాక్‌ పాయింట్లు, జగనన్న హౌసింగ్‌ కాలనీలు, నాడు-నేడు పనులకు ఇసుక రవాణా చేసిన వారికి చెల్లింపులు చేయగా..వీటికి చెందిన జీఎస్టీ చెల్లించలేదని కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించి దాడులు చేసినట్లు తెలిసింది. దీంతో చివరకు ఆ అధికారులు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం.

రాష్ట్రంలో జేపీ సంస్థ పేరిట ఉన్న 110 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న జేపీ సంస్థను ఆదేశించింది. ఆ రీచ్‌లకు సెమీ మెకనైజ్డ్‌ పేరిట ఇచ్చిన అనుమతులను మరోసారి సమీక్షించి.. నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు తవ్వకాలు చేపట్టొద్దని స్పష్టంగా పేర్కొంది. అయినా సరే రాష్ట్రంలో ఎక్కడా తవ్వకాలు ఆగకుండా నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి.

Last Updated :Jul 30, 2023, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.