ETV Bharat / state

YSR Bheema in AP: "మాటలు కట్టిపెట్టి చేతల్లో సాయం చేయండి ముఖ్యమంత్రి గారూ"

author img

By

Published : Jul 16, 2023, 7:09 AM IST

Updated : Jul 17, 2023, 11:37 AM IST

No Support to Farmers in AP: లక్షల కోట్లు బటన్లు నొక్కుతున్నామంటూ డప్పులేస్తారు! మాది రైతు ప్రభుత్వం అని ఊదరగొడతారు! కానీ ఇదంతా గోరంత సాయానికి కొండత ప్రచారమని.. తేలిపోయింది. ఔను.. సాగుబడిలో ఓడి ఆత్మహత్య చేసుకున్న రైతు కటుంబాలకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో.. 47 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చి అదే గొప్పన్నట్లు ప్రచారం చేసుకుంటోంది. అదే నాలుగేళ్లలో.. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.4 వేల 650 కోట్ల పరిహారం అందించి.. అండగా నిలిచింది. తెలంగాణలో.. రైతు ఏకారణంతో చనిపోయినా 5లక్షల రూపాయల బీమా అందిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం రకరకాల కొర్రీలతో... నిరాకరిస్తోంది. అన్నం పెట్టే రైతులకు ఇచ్చే భరోసా ఇదేనా..? అని.. జగన్​ను రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి..

BHEEMA
BHEEMA

No Support to Farmers in AP: 2019 జులై 8న జమ్మలమడుగులో ముఖ్యమంత్రి జగన్‌ రైతులకు తమ ప్రభుత్వం సాయం చేస్తుందంటూ గొప్పలు చెప్పుకున్నారు. రైతు దినోత్సవం అంటూ.. ఏటా అన్నదాతలకు ఇలాంటి మాటలే చెప్తున్న జగన్‌.. సాయం దగ్గరకు వచ్చేసరికి ఉత్త చేతులే.. చూపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే విషయంలో పొరుగునున్న.. తెలంగాణ ప్రభుత్వం కొండంత సాయం చేస్తుంటే.. వైఎస్సార్​సీపీ సర్కార్‌ గోరంత సాయం చేస్తూ.. కొండంత ప్రచారం చేసుకుంటోంది.

తెలంగాణలో అంతమందికి ఇస్తే.. ఏపీలో..!: 2018 ఆగస్టు నుంచి..తెలంగాణ ప్రభుత్వం ఏ కారణంతోనైనా ఆత్మహత్య చేసుకున్న.. 93 వేల 170 మంది రైతు కుటుంబాలకు 4వేల 658 కోట్లు బీమాగా అందించింది. ఇందుకోసం LICకి ప్రీమియంగా చెల్లించిన మొత్తమే.. 5వేల 384 కోట్ల రూపాయలు. కానీ.. సీఎం జగన్‌ నాలుగు సంవత్సరాల పాలనలో.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చిన సాయం.. కేవలం 47 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా కేవలం 672 కుటుంబాలకే ఇచ్చి.. అధికారులు చేతులు దులుపుకున్నారు.

తెలంగాణలో రైతు కుటుంబాలకు అందించిన సాయంతో పోలిస్తే.. ఏపీలో అందించిన సాయం ఒక్కటంటే ఒక్కశాతం మాత్రమే. తెలంగాణలో.. మొత్తం 65 లక్షల మంది రైతులుండగా.. అందులో 50 లక్షల మందికి బీమా వర్తింపజేస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో 85లక్షల మంది రైతులుంటే.. వారికి ప్రత్యేక బీమా పథకమే లేదు. YSRబీమా అమలు చేసినా.. దాని రూపంలోనూ రైతులకు అందేది నామమాత్రమే.

పొరుగు రాష్ట్రంలో.. రైతు ఏ కారణంతో చనిపోయినా మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా బీమా ఇస్తుంటే.. ఏపీలో రైతు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటేనే పరిహారం ఇస్తున్నారు. దానికీ.. రకరకాల కొర్రీలు వేస్తున్నారు. రాష్ట్రంలో.. రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్నాయని చూపించుకునేందుకు.. రైతుల బలవన్మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణమంటూ పరిహారం అమలు చేయడంలేదు. అలా 70శాతం కుటుంబాలకు..ఆర్థిక సాయం తిరస్కరించారని.. రైతు స్వరాజ్య వేదిక పరిశీలనలో గుర్తించింది.

తెలంగాణలో ఆ ఒక్క సర్టిఫికేట్​ చాలు.. కానీ మన దగ్గర: తెలంగాణ ప్రభుత్వం రైతు మరణ ధ్రువీకరణపత్రం సమర్పిస్తే.. బీమా పరిహారం అందిస్తోంది. కానీ ఏపీలో మండల, డివిజన్‌ స్థాయి త్రిసభ్య కమిటీల నివేదిక, శవ పంచనామా, పోస్టుమార్టం రిపోర్టు, FIR కాపీ,.. అప్పులున్నాయని ధ్రువీకరించే పత్రాలు, ప్రామిసరీ నోట్లు.. ఇలాంటివన్నీ సమర్పిస్తేనే.. పరిహారం ఇస్తున్నారు. ఇచ్చే పరిహారం కూడా తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చేలా చూస్తుంటే.. ఏపీలో ఆత్మహత్యలపై నివేదికలకే వారాలు, నెలలు.. పడుతోంది. రైతు ఆత్మహత్య కేసుల్లో.. ఆయా కుటుంబాలకు సాయం అందించేందుకు కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌ స్థాయి అధికారిని.. ఇన్‌ఛార్జిగా నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఆ అధికారి ఎవరో, ఫోన్‌ నంబరు ఏమిటో జిల్లాలోని తహశీల్దార్లకే తెలియదు. ఇక రైతులకు ఏం తెలుస్తుందన్నది ఇక్కడ ప్రశ్న?.

తెలంగాణలో.. 2018 ఆగస్టు 14 నుంచి LIC ద్వారా.. రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. చిన్న, సన్నకారు, పెద్ద రైతు తేడా అనేది లేకుండా.. రైతులందరికీ.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు బంధు సమితుల ద్వారా అక్కడి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకానికి.. ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా లభించింది. తెలంగాణలో రైతు బీమాలో నమోదై ఉండడమే పరిహారానికి అర్హతకాగా.. ఏపీలో సొంత పొలంగానీ, కౌలు కార్డుగానీ.. ఉండాలని షరతు పెట్టారు. కానీ కౌలురైతుల్లో 8.8% మందికే రుణ అర్హత కార్డులు అందిస్తున్నారు. కార్డు లేకపోతే.. రైతు ఆత్మహత్య చేసుకున్నా అసలు అతను రైతే కాదని అధికారులు తిరస్కరిస్తున్నారు.

పంటల సాగులో నష్టాలు, తలపై సంవత్సరం సంవత్సరానికి పెరిగే అప్పుల కుంపటితో అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో.. రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అతనిపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులు.. దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. అలాంటప్పుడే రైతు చేయిపట్టుకు నడిపిస్తూ,..తోడు నిలిచే నాయకుడు కావాలి. మేమున్నామనే భరోసా ఇవ్వాలి.! తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి భరోసా రైతుకు లభిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిజంగా ఒరిగేదేమీ లేదు. రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసినంతగా.. మరెవరూ చేయడం లేదంటూ తనకుతాను వీపుచరుచుకునే జగన్‌.. మాటలు కట్టిపెట్టి చేతల్లో సాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Last Updated :Jul 17, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.