ETV Bharat / state

Farmers against crop insurance  'జగన్ బటన్ నొక్కడానికి రావడం లేదు..రైతులకు పాడే కట్టడానికి వస్తున్నారు'

author img

By

Published : Jul 4, 2023, 3:44 PM IST

Updated : Jul 4, 2023, 3:50 PM IST

Etv Bharat
Etv Bharat

Farmers Agitation on NH 42: నష్టపోయిన అన్ని పంటల బీమాను వర్తింపజేయాలని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమూష్టరులో రైతులు రోడ్డు ఎక్కారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే నష్టపోయిన అన్ని పంటలకు బీమాను వర్తింపజేసి తన చిత్తశుద్ధిని నిరుపించుకోవాలని డిమాండ్ చేశారు. పంట బీమా వర్తింపచేయకపోతే ఈ నెల 8న కళ్యాణ దుర్గం సీఎం సభను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు.

Farmers Agitation on NH 42 : రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవు, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ఉచిత పంటల బీమా పేరుతో నిలువునా ముంచేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పంటలు సాగు చేసిన రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం భారీగా నష్టపోయినా.. బీమా పరిహారంలో మొండిచేయి చూపింది. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత పంటల బీమా కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. ఆచరణలో మడమతిప్పేశారు.

చేతులు దులుపేసుకున్న ప్రభుత్వం : నష్టపోయిన అన్ని పంటల బీమాను వర్తింపజేయాలని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమూష్టరులో రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు అనంతపురం-బళ్లారి 42వ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నినాదించారు. 2022 సంవత్సరంలో అధిక వర్షాలు, విఫరీతమైన ఉష్ణోగ్రత ప్రభావం వల్ల అన్ని పంటలకు నష్టం వాటిల్లిందని, ఏ పంటలను రైతులకు దిగుబడి వచ్చింది లేదన్నారు. ఈ క్రమంలో అన్ని పంటల నష్టాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా మండలానికి ఒకటి, రెండు పంటలకు భీమాను వర్తింపజేసి చేతులు దులుపుకొందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం సభను అడ్డుకుంటాం : సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే నష్టపోయిన అన్ని పంటలకు భీమాను వర్తింపజేసి తన చిత్తశుద్ధిని నిరుపించుకోవాలని డిమాండ్ చేశారు. టమోటా పంటలో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం వస్తే.. ప్రభుత్వం ఎకరాకు 172 రూపాయలు బీమా కల్పించడం సిగ్గు చేటని వారు అన్నారు.మిగతా పంటలకు సంబంధించిన భీమా కూడా అరకొర గానే ఉందన్నారు. అన్ని పంటలకు బీమా వర్తింప చేయాలని, అలా చేయకపోతే ఈ నెల 8న కళ్యాణ దుర్గం సీఎం సభను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు.

'ఉచిత పంటల బీమా ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. రైతులకు మాత్రం శూన్యం మిగిల్చింది. ఈ నెల 8 న సీఎం జగన్ బటన్ నొక్కడానికి వస్తున్నాడంటా కానీ ఆయన బటన్ నొక్కడానికి రావడం లేదు. రైతులకు పాడే కట్టడానికి వస్తున్నారు.'- రైతులు

నిలిచిపోయిన వాహనాలు : దాదాపుగా గంట పాటు కొనసాగిన ధర్నా ఉధృతంగా మారింది. ధర్నా విషయం తెలుసుకున్న ఉరవకొండ పోలీసులు చిన్నమూష్టరు గ్రామానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారిని సముదయించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారిస్తామనడంతో రైతులు ధర్నాను విరమించారు. గంట పాటు వాహన రాకపోకలు నిలచిపోయాయి.


బీమా మంజూరులో రైతులకు అన్యాయం : పంటల బీమా మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని తెదేపా నాయకులు, రైతులు ఆరోపించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల సచివాలయం ముందు రైతులతో కలిసి టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ అధికారులు బయటకు రావాలని నినాదాలు చేశారు. రైతులకు పంటల బీమా విషయంలో చేసిన అన్యాయంపై నిలదీశారు. రైతులు మాట్లాడుతూ చీనీ, టమోటాకు ప్రకటించిన పరిహారం కూలీకి కూడా సరిపోదన్నారు.

రైతుల హెచ్చరిక : చాబాలలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, మిరప సాగు చేసి నష్టపోగా ప్రభుత్వం ప్రకటించిన బీమా ఇప్పటి వరకు జమ కాలేదని రైతులు అన్నారు. ఈ విషయంపై అక్కడే ఉన్న వీఏఏ కల్యాణిని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రీమియం చెల్లిస్తామని గొప్పలకు పోయి.. ప్రస్తుతం భీమా అందకుండా చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పంటలకు బీమా వర్తింపచేయకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు.

అనంతపురం బళ్లారి 42వ జాతీయ రహదారిపై రైతుల ధర్నా
Last Updated :Jul 4, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.