ETV Bharat / state

AP Capital Expenditure: ఇదేందయ్యా ఇది.. మూలధన వ్యయం ఇంత తక్కువా!.. మరి ఆ డబ్బంతా ఏమైంది?

author img

By

Published : Jun 28, 2023, 10:50 AM IST

AP Capital Expenditure: ఆస్తుల కల్పనకు, ఆదాయార్జనకు ఆలంబనగా నిలిచే మూలధన వ్యయం విషయంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువగా ఖర్చు చేస్తూ భవిష్యత్‌పై ఆందోళన రేకెత్తిస్తోంది. కేటాయించిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం కేవలం 6వేల 916 కోట్లే ఉంది. ఇలా అయితే.. పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా అనే ప్రశ్నలు.. తలెత్తుతున్నాయి. మూలధన వ్యయం ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అధ్వానంగా ఉంది.

AP Capital Expenditure
AP Capital Expenditure

AP Capital Expenditure: గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బడ్జెట్‌ అంచనా 2 లక్షల38 వేల 940 కోట్ల రూపాయలు. అందులో ఖర్చు పెట్టింది 2 లక్షల 7 వేల 994.73 కోట్లు. ఇందులో.. ఆస్తుల కల్పనకు, పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని ఆకర్షించేందుకు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించేందుకు.. దోహదపడే మూలధన వ్యయం 6 వేల 916.83 కోట్లు మాత్రమే! మరి మిగిలిన 2 లక్షల వెయ్యి 77.9 కోట్లు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి? దేనికి ఖర్చు పెట్టారు? గతేడాది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన బడ్జెట్, బడ్జెటేతర అప్పులు.. సుమారు 90 వేల కోట్లు! అంత డబ్బు ఏమైనట్టు? మూలధన వ్యయం అంత తక్కువ చేయడమేంటి?.

రాష్ట్ర విభజనతో.. ఆస్తులు కోల్పోయి, అప్పులు మిగిలి, మౌలిక వసతులు, పరిశ్రమలులేని, పెట్టుబడిదారులు ఇటువైపే చూడని రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా తక్షణం చేయాల్సిందేంటి? మూలధన వ్యయాన్ని పెంచి.. ఆస్తులు కల్పించాలి కదా? మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసి... పెట్టుబడుల్ని ఆకర్షించాలి కదా? యువత వలస వెళ్లకుండా.. ఇక్కడే ఉపాధి లభించేలా చూడాల్సింది పోయి, దేశంలోనే మూలధన వ్యయంలో.. చిట్టచివరన ఉండటమేంటి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రాష్ట్రం ఇంత దిగజారి ఉందన్న కటిక చేదు నిజం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నిజంగా షాక్‌.

వాటితో పోల్చితే బాగా వెనుకంజ: ఏ రంగంలోనూ మనం కలలో కూడా పోల్చుకోని.. అసోం మూలధన వ్యయం 15 వేల 942 కోట్లు ఉంటే, ఉత్తరాఖండ్‌ 8 వేల194 కోట్లు, నాగాలాండ్‌ 7 వేల 936 కోట్లు, జార్ఖండ్‌ 14 వేల4కోట్లు, ఛత్తీస్‌గఢ్‌ 13 వేల 596 కోట్లు మూలధన వ్యయం చేస్తున్నాయి. వాటి కన్నా ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో.. బాగా వెనుకబడి ఉంది.

అభివృద్ధికి ఎంతో దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల కన్నా, మయన్మార్‌ సరిహద్దులోని.. నాగాలాండ్‌ కన్నా, మావోయిస్టుల సమస్య తీవ్రంగా ఉండే, గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్‌ వంటి.. రాష్ట్రాల కన్నా మూలధన వ్యయంలో.. ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడింది. బడ్జెట్‌ అంచనాలు చాలా తక్కువగా ఉండే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు ఆస్తులకల్పనపై ఏపీ కన్నా రెట్టింపు వెచ్చిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డబ్బంతా ఏం చేస్తోందన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఇటీవల వెలువడుతున్న వివిధ గణాంకాలన్నీ.. ఆంధ్రప్రదేశ్‌ క్రమంగా వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుందన్న చేదు నిజాన్ని.. కళ్లకు కడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏపీ సర్కార్‌ మూలధన వ్యయాన్ని.. రానురాను కుదించడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. దీర్ఘకాలంలో ఆదాయాన్ని సమకూర్చేందుకు ఉపయోగపడే.. రహదారులు, ప్రాజెక్టులు వంటి ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధిపైనా, ఆస్తుల కల్పనపైనా, ఉత్పాదక రంగాలపైనా పెట్టే ఖర్చునే మూలధన వ్యయం అంటారు. విద్యుత్, నీటిసరఫరా, మెరుగైన రహదారులు, రవాణవసతులు వంటివి లేనప్పుడు..రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావు. యువతకు ఉపాధి లభించదు.

యువతరం ఉపాధిని వెతుక్కుంటూ.. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడటం వల్ల.. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో జననాల సంఖ్య, చిన్న పిల్లల సంఖ్య.. గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్ర గణాంక శాఖ కొన్ని నెలల క్రితం విడుదల చేసిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌-SRS నివేదిక-2020 ప్రకారం 4 ఏళ్ల లోపు చిన్నారుల సంఖ్య.. దేశంలో సగటున 7.5 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 5.3 శాతం మాత్రమే ఉంది. 14 ఏళ్ల లోపు బాలలు.. దేశంలో సగటున 24.8 శాతం ఉంటే.. ఏపీలో 19 శాతమే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మంది జనాభాలో నాలుగేళ్లు, ఆ లోపు వయసు పిల్లల సంఖ్య 53 మాత్రమే ఉండగా.. బిహార్‌లో 110, ఉత్తరాఖండ్‌లో 101 చొప్పున ఉంది. మన రాష్ట్రంలో14 ఏళ్లు, ఆలోపు వయసున్న బాలల సంఖ్య... ప్రతి వెయ్యి మంది జనాభాలో 190 మాత్రమే. అదే బిహార్‌లో 330, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో 285 మంది చొప్పున ఉన్నారు. దేశంలో జననాల రేటు.. సగటున 19.5 శాతం ఉండగా..ఏపీలో అది 15.7 శాతం మాత్రమే ఉంది. మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, ఉపాధి కల్పించే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు లేకపోవడంతో.. యువత మెరుగైన ఉపాధి కోసం వలసపోతున్నారు. అందుకే ఏపీలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో.. ఆర్థిక క్రమశిక్షణ అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. దొరికినకాడికి ఎడా పెడా అప్పులు చేస్తూ.. అదే బ్రహ్మాండమైన పరిపాలన అంటూ.. జగన్‌ ప్రభుత్వం ఊదరగొడుతోంది. చివరకు ప్రభుత్వ ఆస్తుల్నీ, మద్యంపై వచ్చే ఆదాయాన్నీ తాకట్టు పెట్టి మరీ రూ.వేల కోట్లు అప్పులు తెచ్చింది. ఇంకా తెస్తూనే ఉంది. ఉత్తరప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రం 2022-23 మార్చి నాటికి.. 4.74 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, దానిలో మూలధన వ్యయం 93 వేల 555.76 కోట్లుగా ఉంది. కర్ణాటక మొత్తం 2.62 లక్షల కోట్లు ఖర్చుపెడితే దానిలో మూలధన వ్యయం 56 వేల 907.06 కోట్లు. మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, అప్పులకు, మూలధన వ్యయానికీ ఎక్కడైనా పొంతనుందా?.

నిజానికి రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల కారణంగా.. దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే మూలధన వ్యయం.. ఎక్కువగా జరగాలి. రాజధాని నిర్మించుకోవాలి. ఆఫీసులు, క్వార్టర్లు కట్టుకోవాలి. ప్రాజెక్టులు.. నిర్మించుకోవాలి. ఇలా చేయాల్సివి చాలా ఉన్నాయి. మూలధన వ్యయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తేనే.. రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది. మూలధన వ్యయం ఎక్కువ చేస్తేనే.. ప్రైవేటు పెట్టుడులూ వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నలుగురికి ఉద్యోగాలు వచ్చి, కొనుగోలు శక్తి పెరిగితేనే.. సేవారంగం అభివృద్ధి చెందుతుంది.

దాంతో ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయమూ పెరుగుతుంది. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడిన అంశాలు. వనరులు తక్కువగా ఉన్నప్పుడు.. వాటిని సమర్థంగా నిర్వహించేదే అసలైన నాయకత్వం. ఉన్నదంతా అనుత్పాదక రంగాలకు ఖర్చుపెట్టేసి, తాగించేసి, ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి, అప్పులు చేసేసి, ఉత్పత్తి రంగంలోకి పెట్టుబడులు రాకుండా చేసేది.. సమర్థ నాయకత్వం కాదు. ప్రభుత్వం ఎన్ని అప్పులు చేస్తోంది? వాటిని తీర్చే మార్గాలేంటి? అనేది.. ప్రజా ప్రతినిధులకు, మంత్రివర్గానికి, అసెంబ్లీకి కూడా తెలియని పరిస్థితి.. నెలకొంది. ఇది చాలా దురదృష్టకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.