ETV Bharat / state

ACB Raids: ఏసీబీ దాడులు.. అనంత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టుబడ్డ నగదు

author img

By

Published : Apr 26, 2023, 10:52 PM IST

Etv Bharat
Etv Bharat

ACB Raids In AP : ఆంధ్రప్రదేశ్​లో పలు సబ్‌ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అలాగే కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా తాము దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. పలు సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

Anti Corruption Bureau: రాష్ట్రవ్యాప్తంగా ఎసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లాల వారీగా తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు రికార్డులు పరిశీలించారు. అధికారుల సోదాల్లో లెక్కకు రాని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులలో భాగంగా విశాఖ వన్ టౌన్ టర్నర్ చౌల్ట్రిలో గల జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు ఎస్పీలు షకీలా భాను, శ్రావణిల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేశామని తెలిపారు. ఈ తనిఖీలలో అదనపు ఆదాయం, అనధికార వ్యక్తుల గుర్తింపు ఏమీ లేదని అన్నారు. అలాగే తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.

Raids In Tirupati : తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 14400 నెంబర్ కు ఫిర్యాదు రావడంతో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనధికారిక నగదుపై ఆరా తీస్తున్నామని.. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ దేవ ప్రసాద్ పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు

Anantapur District : ప్రతి రిజిస్ట్రేషన్ పైన లంచం ఉండాల్సిందే.. ప్రతి డాక్యుమెంట్ కు చెయ్యి తడపాల్సిందే.. ఇది అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న తంతు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారులు ఉన్నఫలంగా కార్యాలయానికి వెళ్లి రికార్డులు మొత్తం పరిశీలించారు. అయితే ఏసీబీ అధికారులు వచ్చే సమయానికి సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ అలీ కార్యాలయంలో కనిపించకుండా పోయారు.

అయితే అతని డ్రైవర్ ఇస్మాయిల్ వద్ద భారీగా డబ్బు కనిపించింది. దీంతో ఏసీబీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మొత్తం అతని వద్ద ఉన్న రెండు లక్షల 27 వేల రూపాయలు అనధికారికంగా నగదు ఉన్నట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ప్రతి డాక్యుమెంట్​కు డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. అందుకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. మొత్తం ఈ సంఘటన వెనుక సబ్ రిజిస్టార్ ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు.

విశాఖ, తిరుపతి, అనంతపురం, సహా శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు, కాకినాడ జిల్లాలోని తుని, ఏలూరు జిల్లాలోని నర్సాపురం తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు రికార్డులు పరిశీలించారు. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు , వైఎస్‌ఆర్ జిల్లాలోని బద్వేల్ , నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు.


ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.