ETV Bharat / state

గోదావరి ఉగ్రరూపం...జలదిగ్బంధంలో పలు గ్రామాలు

author img

By

Published : Aug 17, 2020, 2:19 PM IST

heavy flood in godavari
గోదావరి ఉగ్రరూపం

ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని లంకభూములు, తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. అదే విధంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

గోదావరి వరద పోటెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయోధ్య లంక, పుచ్చ లంక, రావి లంక ,పెదమల్లం లంక, పల్లిపాలెం లంక గ్రామాల్లో వరద నీరు చేరింది. ఏటి గట్టు దిగువనున్న లంక భూములు, ప్రసిద్ధ మసేనమ్మ ఆలయం, తీరం వెంబడి ఉన్న పుష్కర ఘాట్ లు సైతం నీటమునిగాయి. లంక భూముల్లోని పంట పొలాలు కూడా ముంపు బారిన పడ్డాయి.

  • మునిగిన పొలాలు...రైతుల ఆవేదన

భారీగా వరద నీరు చేరడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు జరగడంతో రైతులకు కన్నీరుమున్నీరవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంతో గౌతమి వశిష్ఠ గోదావరి చెంతనే ఉన్న తోటలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆత్రేయపురం, రావులపాలెం మండలాలు వశిష్ట గౌతమి నదుల మధ్య ఉండడంతో వేలాది ఎకరాల్లో అరటి కంద, మునగ తోటలు నీటమునిగాయి. కొత్తపేట, ఆలమూరు కపిలేశ్వరం మండలాల్లో కూరగాయల తోటలు పూర్తిగా మునిగిపోయాయి. రైతులు తోటల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నాలుగైదు రోజులు నీరు ఈ విధంగానే నిలబడి ఉంటే పంటలు పూర్తిగా కుళ్ళిపోతే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని తామంతా అప్పుల ఊబిలో కూరికి పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • భద్రాచలం వద్ద పెరిగిన నీటిమట్టం

ఎగువన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నడూ లేనంతగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో దిగువన ఉన్న గోదావరి ప్రాంత ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో భద్రాచలం వద్ద గరిష్ట వరదనీటి మట్టాలను పరిశీలిస్తే 2014 సెప్టెంబర్ ఎనిమిదో తేదీన 56.1 అడుగులు, 2015 జూన్ 22వ తేదీన 51 అడుగులు, 2016 జూలై 12న 52.4 అడుగులు, 2018 ఆగస్టు 22న 50 అడుగులు, 2019 ఆగస్టు 9న 51.2 అడుగులు నమోదు కాగా... తాజాగా 55 అడుగులు నీటి మట్టం నమోదవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఇవీ చదవండి: జోరుగా వర్షాలు.. నిండుకుండల్లా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.