ETV Bharat / state

వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు

author img

By

Published : Aug 20, 2020, 5:03 AM IST

వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు
వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు

గోదావరి శాంతించింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నేడో, రేపో మిగిలిన రెండు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశం ఉంది. మన్యంలోని గిరిజన గ్రామాల ప్రజల అవస్థలు తొలగలేదు. లంక గ్రామాలను ఇంకా ముంపు వీడలేదు. పంటలు నీటమునిగి రైతులకు పెద్దఎత్తున నష్టం ఏర్పడింది.

తూర్పుగోదావరి జిల్లాలోని 26 మండలాల పరిధిలో 168 గ్రామాలు వరద బారినపడ్డాయి. 82 గ్రామాల్లోకి నీరు చేరింది. 21 వేల 192 గృహాల్లోకి వరదనీరు చేరింది. వ్యవసాయ పంటలు 1614.30 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 7227 హెక్టార్లలో నీట మునిగాయి. వరద నీటిలో పడి ఒకరు మృతిచెందగా, ఇంకొకరు గల్లంతయ్యారు. 50 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విలీన మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మన్యంలోని దేవీపట్నం మండలంలో స్వల్పంగా వరద నీరు తగ్గింది. కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా... మరికొన్ని కూలిపోతున్నాయి. వరద తగ్గిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆరు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచింది. కొండలపై ఉన్న గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ములకల్లంక గ్రామం వరద గుప్పిట్లోనే ఉంది.

కోనసీమలో 51 లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉన్నవారంతా నిత్యావసరాలకు అవస్థలు పడుతున్నారు. బడుగువాని లంకలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పర్యటించారు. వరద బాధితులకు బియ్యం, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. బాధితులకు అన్నివిధాలు అండగా ఉంటామన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని అమలాపురం ఎంపీ చింతా అనురాధ అన్నారు. లంక గ్రామాల్లో పర్యటించిన ఆమె...బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. సఖినేటిపల్లి మండలం వరద ప్రాంతాలలో తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు పర్యటించి...బాధితులను పరామర్శించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వరద తీవ్రత కొంత తగ్గినా మన్యం, డెల్టా ప్రాంతాల్లోని గ్రామాల్లో ముంపు వీడలేదు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన దాదాపు 10 వేల మంది వరద బాధితులు మరో రెండు, మూడు రోజులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో వండి వడ్డించాల్సి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల బియ్యం, కూరగాయల ఇచ్చి వండుకోమంటున్నారని బాధితులు చెబుతున్నారు. పాలు, బ్రెడ్‌ వంటివి ఇంకా కొన్ని శిబిరాలకు చేరలేదు. ఆచంట మండలంలో 100 కుటుంబాలకు చెందిన ప్రజలు ఇళ్ల పైకప్పులపై ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. లంక గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వరద గోదావరి.. తగ్గుతోంది..

ఇదీ చదవండి: యాంగ్జీ నది ఉగ్రరూపంతో చైనా గజగజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.