ETV Bharat / state

రంకెలేసిన కోడెల పౌరుషం.. సన్నగిల్లిన యువత సాహసం

author img

By

Published : Jan 20, 2021, 5:22 PM IST

people enjoys cattle festival at chittor district
రంకెలేసిన కోడెల పౌరుషం.. సన్నగిల్లిన యువత సాహసం

సంక్రాంతి పండగ ముగిసినా.. చిత్తూరు జిల్లాలో ఇంకా ఆ కోలాహలం సాగుతూనే ఉంది. సంక్రాంతికి నిర్వహించే పశువుల పండగను పోలీసులు విధించిన ఆంక్షలతో.. జిల్లాలో నిర్వహించలేదు. అయితే ఇది తమకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని.. పండగ ముగిసిన తర్వాత గ్రామస్థులు.. పశువుల పండగను నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

రంకెలు వేస్తూ ఉరకలెత్తిన పశువుల పౌరుషం ముందు యువత సాహసం చిన్నబోయింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పశువుల పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సాధారణంగా ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ పండగ.. వెదురుకుప్పం మండలం కొండకిందపల్లిలో పోలీసుల ఆంక్షలతో వాయిదా వేశారు. పశువుల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమని గ్రామస్తులు పండుగ ముగిసిన తర్వాత జల్లికట్టును నిర్వహించారు.

కొండకిందపల్లిలో పశువుల పండగ విషయమై.. ముందస్తుగా జరిగిన ప్రచారంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. సమీప ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు దీటుగా ఇతర ప్రాంతాల నుంచి పశువుల పండగలో పాల్గొనేందుకు పశువులను తరలించారు. పట్టెడలతో గ్రామస్తులు ముస్తాబు చేసిన కోడె గిత్తలను, ఎద్దులను విడతలవారీగా జన సమూహంలోకి వదిలిపెట్టారు.

రంకెలేసిన కోడెల పౌరుషం.. సన్నగిల్లిన యువత సాహసం

డప్పు చప్పులు, యువత కేరింతల మధ్య పరుగులు తీసిన వృషభ రాజులు.. రాజసం ఒలకబోస్తూ జన సమూహాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగాయి. వేగంగా పరుగులు తీస్తున్న పశువులను నిలువరించే క్రమంలో కొంతమంది యువతకు తేలికపాటి గాయాలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి: పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.