ETV Bharat / state

Bhairavani Tippa Project 60రోజుల్లో అన్నారు.. 600 రోజులు దాటాయ్! కృష్ణా జలాలు రాలేదని.. రైతుల ఆవేదన..!

author img

By

Published : Jun 5, 2023, 12:40 PM IST

Bhairavani Tippa Project
భైరవానితిప్ప ప్రాజెక్ట్

Bhairavani Tippa Project : జగనేమో తాను మాట తప్పను మడమ తిప్పనని ఢంకా బజాయిస్తారు.! వైసీపీ నాయకులేమో అన్న చెప్పాడంటే.. చేస్తాడంతే అని ఊదరగొడతారు. కానీ, విషయం గ్రహించిన జనం మాత్రం జగనన్న మాటలకు అర్థాలే వేరులే.. అని నిట్టూరుస్తున్నారు. 60 రోజుల్లో భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కాల్వలకు భూసేకరణ పూర్తి చేస్తామని గొప్పగా ప్రకటించిన జగన్.. 600 రోజులైనా కొలిక్కి తేలేకపోయారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనుల్నీ ఎక్కడికక్కడే నిలిపివేసి.. రైతుల ప్రయోజనాలకు గండికొట్టారు.

Rayadhuragam Bhairavanitippa Project : 2021 జులై 8న రాయదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో.. "భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం యుద్ధప్రాతిపాదికన జరుగుతోందని అప్పుడు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన దానిలో సుమారు 500 ఎకరాల భూసేకరణ జరిగిందని తెలిపారు. మిగిలిన భూసేకరణ కోసం జిల్లా యంత్రాంగాన్ని ముమ్మరం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టును విస్తరించి కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు నీరందిస్తామని వివరించారు." సీఎం ఇచ్చిన హామీ ఇది. 6 వారాల్లో భూసేకరణ పూర్తిచేస్తామన్నారు. 60 వారాలు దాటిపోయింది. మరి మాట తప్పని, మడమ తిప్పనని చెప్పుకునే జగన్‌.. బీటీ ప్రాజెక్టు హామీ ఏ మేర నెరవేర్చారో పరిశీలిద్దాం.

భైరవానితిప్ప ప్రాజెక్టు ఇప్పటిది కాదు. దాదాపు 50 ఏళ్ల క్రితం కల్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలాల మధ్య భైరవానితిప్ప జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి గుమ్మగట్ట మీదుగా ప్రవహించే వేదవతి నదిపై రెండు టీఎంసీల సామర్ధ్యంతో దీన్ని కట్టారు. ఐతే బీటీ ప్రాజెక్టు ఎగువన కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మించటంతో రెండు దశాబ్దాలుగా జలాశయంలోకి నీటి చేరిక లేదు. ఫలితంగా ఇది మృత ప్రాజెక్టుల జాబితాలో చేరిపోయింది.

2019లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు చంద్రబాబును ఒప్పించి కృష్ణా జలాలను బీటీ ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలు ఆమోదింపచేసుకున్నారు. 968 కోట్ల రూపాయల నిధులూ మంజూరయ్యాయి. ఓవైపు కాలువ తవ్వకానికి భూసేకరణ చేస్తూనే కాలువ నిర్మాణ పనులూ పట్టాలెక్కించారు. కానీ... 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. బీటీ ప్రాజెక్టుకు మళ్లీ గ్రహణం పట్టింది. అప్పుడు తవ్విన కాల్వల్లో పిచ్చిమొక్కలు తప్ప ప్రవాహమే చూడలేదని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"జీడిపల్లి నుంచి దీనికి కొన్ని నీళ్లు వస్తే.. కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. దానికి గత ప్రభుత్వ చేసి.. ఆ తర్వాత ప్రభుత్వ వెళ్లిపోయింది. రెండు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి రాయదుర్గం వచ్చారు. డ్యాంకు మూడు నెలల్లో నీరందిస్తానని అన్నారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు." - రైతు

జీడిపల్లి జలాశయం నుంచి 61 కిలోమీటర్ల కాలువ తవ్వి.. ఏడు చోట్ల నీటిని ఎత్తిపోసి బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు 18 కిలోమీటర్ల మేర కాలువలు టీడీపీ హయాంలోనే తవ్వారు. 102 ఎకరాల మేర భూ సేకరణ చేసి, రైతులకు కోటిన్నరపైగా పరిహారం చెల్లించారు. ఎన్నికల ముందు ప్రస్తుత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈ పనులకు 900 కోట్లు ఎందుకని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వస్తే 150 కోట్లతోనే పనులు పూర్తి చేస్తానని నమ్మబలికారు. 2021 లో సీఎంను తీసుకొచ్చి భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తానంటూ.. వేదికపై గొప్పగా ప్రకటింపజేశారు. సీఎం స్వయంగా చెప్పడంతో.. పనులు పరుగులు పెడతాయని రైతులంతా అనుకున్నారు. కానీ రైతుల కళ్లలో కన్నీరు తప్ప.. నేటికీ కాల్వల్లో నీరు పారింది లేదు.

"టీడీపీ హయంలో 18 కిలోమీటర్ల దూరం కాలువ కూడా తవ్వారు. కానీ ఇప్పుడు వీళ్లు చేసింది ఏమీ లేదు. తట్టేడు మట్టి కూడా ఎక్కడ తీసినా పాపన పోలేదు. ఎన్నికల రాంచంద్రారెడ్డి వచ్చి.. 960 కోట్ల రూపాయల అవసరమేంటని అన్నారు. వాళ్లు తింటున్నారు, వీళ్లు తింటున్నారు అని చెప్పి 150 కోట్లకే నీళ్లు తీసుకువస్తానని అన్నారు."

కర్ణాటకలో గతేడాది కురిసిన వర్షాలకు ఎగువనున్న అక్రమ ప్రాజెక్టులన్నీ.. వేదవతి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అక్కడ నీటి నిల్వ చేసే అవకాశంలేక భైరవానితిప్పకు ప్రవాహం చేసింది. ఐతే ఆయకట్టు కాల్వల పనులు ఎక్కడివక్కడే ఆపేయడంతో రైతులకు నీరు ఇవ్వలేని నిస్సహాయత. తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు యధావిధిగా కొనసాగించి ఉంటే.. ఈ సమయానికి భైరవానితిప్ప ప్రాజెక్టు కల సాకారం అయ్యేదని.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అంటున్నారు.

ఇదే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి ఎన్నికల సమయంలో నాకు ఓ సవాల్​ చేశాడు. కాలవ శ్రీనివాసులు అవినీతి చేయటానికి 960 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాడని అన్నాడు. నేను ఎమ్మల్యే అయితే 150 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తానని అన్నారు."" -కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

భైరవానితిప్ప ప్రాజెక్టుపై నీటిమూటలైన జగన్ మాటలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.