ETV Bharat / state

ప్రభుత్వ విప్ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు: కాల్వ శ్రీనివాసులు

author img

By

Published : Dec 31, 2022, 10:24 PM IST

TDP Leader Kalva Srinivas: అక్రమ ఆయుధాలు, దొంగ నోట్లు, మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వందల కోట్లు గడిస్తున్నారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కాపు దౌర్జన్యాలు, అక్రమాలకు పోలీసులు మద్దతు తెలుపుతూ.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాల్వ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leader Kalva Srinivas
కాల్వ శ్రీనివాసులు

YSRCP Leader Kapu Ramachandra Reddy: రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై.. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అక్రమ ఆయుధాలు, దొంగ నోట్లు, మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తూ వందల కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉందా? అంటూ కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తప్పుడు పనులు చేస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు బకాయిలు ఎగవేస్తూ నేరాలు చేయడమే అలవాటుగా మార్చుకున్న కాపు రామచంద్రారెడ్డి .. తనపై ఆరోపణలు చేయడం.. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

దొంగ నోట్లు, అక్రమాయుధాల కేసులో పట్టుబడిన వసంత వైసీపీ కార్యకర్త కాదు, నాకు నకిలీ నోట్లు అక్రమాయుధాలతో సంబంధం లేదని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేయకపోవడం శోచనీయమన్నారు. కాపు దౌర్జన్యాలు, అక్రమాలకు పోలీసులు మద్దతు తెలుపుతూ.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో శ్రీ గణేష్ క్రషర్ యజమాని లక్ష్మి, ఆమె సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు. లోక్​సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబుపై రాయదుర్గం పట్టణంలో పట్టపగలు దాడి చేస్తే నేటికీ ఎమ్మెల్యే అనుచరుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

2019లో ఒక ఛానల్ విలేకరిపై దాడి చేస్తే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల కొందరు పాత్రికేయులపై దాడులు చేస్తానని ప్రభుత్వ విప్ కాపు ప్రెస్ మీట్​లో ప్రకటించినా పోలీసులు నేటికీ ఎమ్మెల్యేను విచారించకపోవడం దారుణం అన్నారు. రాయదుర్గంలో టీడీపీ కార్యకర్త మద్యం తెస్తూ పట్టుపడితే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని.. రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు కర్ణాటకకు చెందిన 55 మద్యం బాక్సులతో పట్టుబడినా.. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని కాల్వ ప్రశ్నించారు. కాపు కనుసన్నలోనే రాయదుర్గం నియోజకవర్గంలో అక్రమ మద్యం సరఫరా జరుగుతోందని.. ఇప్పుడు కాపు లిక్కర్ డాన్​గా పేరు పొందాడని ఆరోపించారు. నాలుగేళ్లలో రాయదుర్గం అభివృద్ధి సర్వనాశనమైందన్నారు. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.