ETV Bharat / state

వేదవతి ప్రాజెక్టు.. ముందుకు సాగని పనులు.. ఆగని వలసలు

author img

By

Published : Feb 7, 2023, 7:18 AM IST

VEDAVATHI IRRIGATION PROJECT : సాగునీటికి భరోసా ఇచ్చే వనరులు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో.. పంటలకు వర్షాలే దిక్కు. కొన్ని చెరువులున్నా వాటిలో అంతంతమాత్రంగానే నీరు చేరుతుంది. బోర్లు తవ్వుకున్నా ప్రయోజనం ఉండదు. వ్యవసాయం కాకుండా చేసేందుకు ఇతర పనులూ ఉండవు. మధ్య వయస్కులతో పాటు యువకులూ పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం నిత్యకృత్యం. అలాంటి కరవు నేలకు తాగు, సాగు నీరందించేందుకు తెలుగుదేశం హయాంలో చేపట్టిన వేదవతి ఎత్తిపోతల పథకం పనులు.. ఇప్పుడు మూలనపడ్డాయి. ఆయా కరవు పీడిత ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

VEDAVATI IRRIGATION PROJECT
VEDAVATI IRRIGATION PROJECT

VEDAVATHI PROJECT : తాగు, సాగునీటికి అల్లాడుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు వేదవతి ఎత్తిపోతల పథకం వరదాయిని వంటిది. ఈ ప్రాంతం మీదుగానే హంద్రీ, హగరి నదులు ప్రవహిస్తున్నా.. సరిగా ఉపయోగపడటం లేదు. దీంతో.. ఆలూరు, హాలహర్వి, హోలగుండ, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలాల్లోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని, 253 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 10 లక్షల మంది జనాభాకు తాగు నీరు అందించే లక్ష్యంతో.. 2019 జనవరిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

19 వందల 42.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాలనామోదం తెలిపింది. 54 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో వేదవతినీ చేర్చింది. టెండర్లు పిలిచి పనులను అప్పగించింది. ప్రభుత్వం మారాక మూడున్నరేళ్లలో వేదవతి పనులు మందగించాయి. చేసిన పనులకూ ఇంతవరకు బిల్లులు చెల్లించింది లేదు. ఈ ప్రాజెక్టు డ్రాయింగ్‌, డిజైన్లు కేంద్ర ఆకృతుల సంస్థ వద్ద పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతుండటం.. ఆశ్చర్యం కలిగిస్తోంది.

"కాలువ వస్తుందే అంటే రైతులు అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. గత ప్రభుత్వం 8 టీఎంసీలు కేటాయిస్తే.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం దానిని 3 టీఎంసీలకు కుదించింది. ఇది రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు మంచి చేయాలని కోరుకుంటున్నాం"-రామాంజనేయులు, రైతు

హాలహర్వి-ఆలూరు మధ్య 4.25 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఒక జలాశయం, మొలగవల్లి వద్ద మరో 4 టీఎంసీల సామర్ధ్యంతో రెండో జలాశయాన్ని నిర్మించి తాగు, సాగునీరివ్వాలని.. గత ప్రభుత్వం ప్రణాళిక చేసింది. వేదవతిలో నీరు తక్కువగా ఉంటే హంద్రీనీవా ద్వారా తరలించేలా పైపులనూ సిద్ధం చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని సగానికంటే తక్కువకు తగ్గించేస్తూ నిర్ణయం తీసుకుంది.

"వర్షాలు లేకపోవడం వల్ల కాలువ వస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం. మాకు కాలువ వస్తే వలసలు పోయే అవసరం రాదు.. మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది"-శ్రీనివాసులు, రైతు

8.4 టీఎంసీల సామర్ధ్యంలో నిర్మించాలనకున్న వేదవతిని 3 టీఎంసీలకు తగ్గించేశారు. దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంత ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియనూ చేపట్టలేదు. నీళ్లొస్తే తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఎదురు చూస్తున్న రైతులు.. ఇప్పటికీ ప్రాజెక్టు అడుగుముందుకు కదలకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ద్వారా నీళ్లొస్తే వలసలూ ఉండవని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.