ETV Bharat / state

అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఆందోళన

author img

By

Published : Nov 3, 2022, 2:19 PM IST

Updated : Nov 3, 2022, 4:29 PM IST

TDP protests
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన

TDP protests: అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రభుత్వ ఆటవిక పాలనకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అయన్నను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఆందోళన

TDP protests: అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్​ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఏలూరులో తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమం ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై ఆ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు అయ్యన్న అరెస్టు నిదర్శనమన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్ర నిర్వహించారు. అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తున్నారని అయ్యన్నపాత్రుడిపై కక్షగట్టి సీఐడీ ద్వారా అరెస్టు చేయించారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కోటగుమ్మం సెంటర్ వద్ద తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మానవహారం నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయాలని నినాదాలు చేశారు.

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్‌ అరెస్టును పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారి అరెస్టుకు నిరసనగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు. స్థానిక అభివృద్ధి సెంటర్‌ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం, పోలీసులు, వైకాపా తీరును నిరసిస్తూ... పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

విజయవాడ: అయ్యన్న అరెస్టును నిరసిస్తూ గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదా అంటూ దేవినేని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పోలీసులే ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. సీఐడీ చీఫ్ సునీల్ అధికారిగా కాకుండా వైకాపా నాయకుడిలా పని‌ చేస్తున్నారని ఆరోపించారు.

గద్దె రామ్మోహన్‌: అయ్యన్నపాత్రుడి అరెస్టుకు నిరసనగా గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నిరసన చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ నినాదాలు చేశారు. సీఎం కనుసన్నల్లోనే విశాఖలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. వైకాపా అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారనే అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.

బొండా ఉమామహేశ్వరరావు: తెదేపా సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్‌ల అరెస్టును నిరసిస్తూ విజయవాడ గాంధీనగర్ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. కళ్లకు నల్ల రిబ్బన్‌లు ధరించి తెదేపా నేతలు నిరసన చేశారు. తక్షణమే అయ్యన్న పాత్రుడిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కోనసీమ జిల్లా: మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ స్థానిక తెదేపా కార్యాలయం వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందించారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని రావులపాలెంలో నిరసన ర్యాలీ చేశారు.

కాకినాడ జిల్లా: అయ్యన్నపాత్రుడు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నర్సీపట్నం నుంచి అయ్యన్నను తుని మీదుగా తరిలిస్తారని భావించి జాతీయ రహదారిపైకి స్థానిక తెదేపా నేతలు తరలివచ్చారు. ప్రభుత్వ తప్పుడు విధానాలపై మండిపడ్డారు. అర్ధరాత్రుల్లో అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడుకి, ఆయన కుమారుడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని తెదేపా నాయకులు హెచ్చరించారు.

కృష్ణా జిల్లా: అయ్యన్నపాత్రుడు అరెస్టును ఖండిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అయ్యన్నను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం పైశాచిక పాలనకు నిదర్శనమని అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరులో తెదేపా నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా: మందస మండలం హరిపురంలో అయ్యన్న అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. పార్వతీపురంలోనూ నిరసన ర్యాలీ చేపట్టారు

సత్యసాయి జిల్లా: అయ్యన్నపాత్రుడు అరెస్టును నిరసిస్తూ సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశం నాయకులు రాస్తారోకో చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి, సీఐడీ పోలీసులు గోడలుదూకి ఇంట్లోకి ప్రవేశించి సీనియర్ నాయకుడిని అరెస్టు చేయడం ఆటవిక చర్య అని మండిపడ్డారు.

అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో వర్షంలోనే నిరసన చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలు అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతిలో ఎన్టీఆర్​ కూడలిలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. సివిల్‍ కేసుల్లో సీఐడి అరెస్టు చేయడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడి అరెస్టును నిరసిస్తూ కర్నూలులో పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. వెంటనే విడుదల చేయాలని..లేదంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 3, 2022, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.