ETV Bharat / state

తెదేపా నేత అయ్యన్న అరెస్టుపై నిరసనల వెల్లువ..

author img

By

Published : Nov 3, 2022, 8:39 AM IST

Updated : Nov 3, 2022, 2:12 PM IST

TDP leaders on Ayyanna pathrudu arrest: బీసీ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు సహా నేతలు తీవ్రంగా ఖండించారు. అయ్యన్న భార్యను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అయ్యన్న అరెస్టు, తదుపరి కార్యాచరణ, పరిణామాలపై చర్చించనట్లు తెలిపారు.

TDP
TDP

TDP leaders on Ayyanna pathrudu arrest: జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని.. ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చివేత మొదలు.. అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు.

చింతకాయల విజయ్​పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసుల తీరు మారలేదని విమర్శించారు. పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైకాపా సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని ఆక్షేపించారు. అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేశ్​లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పరామర్శ: అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పార్టీ అన్ని విధాల అదుకుంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్టుకు సంబంధించి న్యాయపరంగా పోరాడుతామని హమీ ఇచ్చారు.

నారా లోకేశ్​: ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడుని చూసి.. ప్యాలెస్ పిల్లి భయపడిందంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వైకాపా నాయకుల దోపిడీ, భూకబ్జాలు, దౌర్జన్యాలకు బయటపెడుతున్నందుకే బీసీ నేత అయ్యన్నపాత్రుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి.. గోడ కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్​ను అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అయ్యన్నను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అచ్చెన్నాయుడు: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న అయ్యన్నపాత్రుడి కుటుంబంపై జగన్​రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది బీసీలపై జరిగిన దాడి అన్న ఆయన.. జగన్ హింసా విధానంపై ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా తెదేపా నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడటం ఘోరంగా,.. ప్రజల హక్కులు పరిరక్షణకు పూనుకోవడం ద్రోహంగా భావించి అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ మార్క్ దురాగతాలు, దురన్యాయాలు పాసిష్టు పాలనకు నిదర్శనమని విమర్శించారు.

యనమల: అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని తెదేపా నేత యనమల ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖకు చెందిన సివిల్ అంశంలో సీఐడీ జోక్యమేంటని ప్రశ్నించారు. కోర్టులో పరిష్కరించుకునే అంశాలపై పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. వైఎస్సార్ బంజారాహిల్స్‌లో చేసిన ఆక్రమణలను కోర్టు ద్వారా పరిష్కరించుకోలేదా? అని అడిగారు. ఫోర్జరీ ధ్రువపత్రాలని సీఐడీ దేని ఆధారంగా నిర్ధరణకు వచ్చిందని ప్రశ్నించారు. ఇది పూర్తిగా సివిల్‌ అంశం అని.. ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు. బీసీ నేతను నాశనం చేయడమే సీఎం లక్ష్యమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

నక్కా ఆనందబాబు: అయ్యన్న పాత్రుడి అరెస్టును నక్కా ఆనందబాబు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి అరెస్టులతో సీఐడీ పోలీసులు దొంగల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జగన్ రెడ్డి కక్ష కట్టారని ధ్వజమెత్తారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నారు.

పయ్యావుల కేశవ్​: బీసీ నేత అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రశ్నించిన తెదేపా నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులే దొంగల్లా తెదేపా నేతల ఇళ్లల్లోకి చొరబడుతున్నారన్నారు. అప్పట్లో జైళ్లన్నీ స్వాతంత్య్ర సమరయోధులతో నిండేవని.. వైకాపా పాలనలో జైళ్లన్నీ తెదేపా నేతలతో నిండిపోతున్నాయని అన్నారు. ప్రజలు తిరగపడితే సీఎం పరిస్థితి ఏంటో ఆలోచించాలని హితవు పలికారు.

ధూళిపాళ్ల నరేంద్ర: అయ్యన్నపాత్రుడు అరెస్టు అనైతిక చర్య అని ధూళిపాళ్ల నరేంద్ర అభిప్రాయపడ్డారు. సీఐడీ వ్యవస్థలో ఉన్నది పోలీసుల? లేక దొంగలా? అని ధ్వజమెత్తారు. పోలీసులైతే గోడలు దూకి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మీ చేతగాని పాలనను ప్రశ్నిస్తున్నాడని అయ్యన్న అరెస్టా? అని నిలదీశారు. మద్యం తాగి వచ్చారంటే వైకాపా గుండాలనే అనుమానం వస్తుందన్నారు. ప్రభుత్వ ఆరోపణలో వాస్తవాలే ఉంటే అర్ధరాత్రి అరెస్టు ఎందుకు? అని ధూళిపాళ్ల మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.