ETV Bharat / sports

Olympics: వాటిని అధిగమించి 'టోక్యో' గెలిచింది!

author img

By

Published : Jul 28, 2021, 1:24 PM IST

ఒలింపిక్స్​.. 'అస్సలు నిర్వహించవద్దు ఆపేయండి'.. ఇది విశ్వక్రీడల ఆరంభ వేడుకలు జరిగిన రోజు వరకు వినిపించినా మాట. కానీ ఇప్పుడు ఆ డిమాండ్లు వినిపించడం లేదు. కరోనా పరిస్థితుల్లోనూ పట్టుదలతో విశ్వక్రీడలను కొనసాగిస్తున్న నిర్వాహకుల సంకల్పానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభించడం ప్రారంభమైంది. ఇలా జరగడానికి కారణాలేంటి? మెగాక్రీడలు ఎలా సాగుతున్నాయి? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం..

olympics
ఒలింపిక్స్​

ఒలింపిక్స్ రాబోతుంటే ఆతిథ్య దేశంలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రీడా సంబరానికి తమ దేశం ఆతిథ్యమిస్తున్నందుకు జనం మురిసిపోతారు. ఒలింపిక్స్ కొన్ని నెలల ముందు నుంచే సంబరాలు మొదలవుతాయి. క్రీడలు దగ్గరపడే కొద్దీ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. కానీ ఈసారి ఒలింపిక్స్ ముంగిట జపాన్​లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. విశ్వ క్రీడలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక మాకొద్దీ ఒలింపిక్స్ అంటూ మెజారిటీ జనాలు వ్యతిరేక స్వరాలు వినిపించారు. రోడ్డు మీదికొచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఒలింపిక్స్ ఆరంభ దినోత్సవం రోజు కూడా నిరసనలు కొనసాగాయి. ఓవైపు కరోనా మహమ్మారి దేశాన్ని బెంబేలెత్తిస్తుంటే.. ఈ సమయంలో క్రీడలేంటి అన్నది వాళ్ల అభ్యంతరం! ఓవైపు లక్షల కోట్లు ఖర్చు చేసి, విపరీతమైన శ్రమకు ఓర్చి, వైరసకు ఎదురొడ్డి క్రీడల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడుతుంటే.. ఇంకోవైపు సొంత జనం నుంచే ఇంత వ్యతిరేకత వ్యక్తమవడం వల్ల టోక్యో ఒలింపిక్స్ ఏమేర విజయవంతమవుతాయో అన్న సందేహాలు తలెత్తాయి. అయితే క్రీడలు మొదలై ఒకట్రెండు రోజులు గడిచాయో లేదో పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

కరోనా సమయంలోనూ ఆరంభ వేడుకలను అద్భుతంగా నిర్వహించి, జపాన్ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి ఘనంగా చాటడం.. ఆ తర్వాత క్రీడల్లో తమ దేశ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేయడం అక్కడి జనాల్లో ఒలింపిక్స్ పట్ల సానుకూలత తీసుకొచ్చింది. విశ్వక్రీడలు మొదలయ్యాక వాటిని ఆపాలంటూ నిరసనలు కొనసాగించడంలో అర్థం లేదని అక్కడి జనాలు వెనక్కి తగ్గారు. అమెరికా, చైనా లాంటి దేశాలను వెనక్కి నెట్టి జపాన్ క్రీడాకారులు కొన్ని అద్భుత విజయాలు సాధించడం.. పతక పోటీల్లో నాలుగో రోజు ముగిసేసరికి అనూహ్యంగా పట్టికలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం జపనీయులను అమితానందానికి గురి చేసింది. ప్రస్తుతం జపాన్ 10 స్వర్ణాలతో నంబర్​వన్​గా కొనసాగుతుంటే.. తొమ్మిదేసి పసిడి పతకాలతో అమెరికా, చైనా తర్వాతి రెండు స్థానాల్లో ఉండటం విశేషం. క్రీడల పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆతిథ్య టోక్యో నగరంలోనూ వైరస్ ప్రభావం ఎక్కువవుతున్నా.. ఒలింపిక్స్ ఆపేయాలన్న డిమాండ్లు వినిపించడం లేదు. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ పట్టుదలతో విశ్వ క్రీడలను కొనసాగిస్తున్న నిర్వాహకుల సంకల్పానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. అన్నింటికీ మించి సొంత అభిమానుల మనసు గెలిచి, వారిలో క్రీడల పట్ల వ్యతిరేకతను తగ్గించడమే టోక్యో ఒలింపిక్స్ సాధించిన పెద్ద విజయం!

ఇదీ చూడండి: Olympics: మనికా బాత్రా ప్రవర్తనపై ఫెడరేషన్​ సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.