ETV Bharat / sports

Tokyo Olympics: ప్రపంచం ఏకమై ఆటే లోకమై..

author img

By

Published : Jul 23, 2021, 7:00 AM IST

ప్రపంచ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్ ఆరంభ సంబరం​ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కొవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడ్డ విశ్వ క్రీడలు.. మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు.. ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంగ్రామాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టేస్తున్నారు. ఇక వచ్చే రెండు వారాల్లోనూ అడ్డంకులు తప్పకపోవచ్చు. వాటిని అధిగమించి ఒలింపిక్స్‌ స్ఫూర్తి పతాకాన్ని ఎగురవేయాలని.. టోక్యో విశ్వక్రీడలు చరిత్రలో నిలిచిపోవాలని ప్రతి క్రీడాభిమాని ఆకాంక్ష.

tokyo olympics
టోక్యో ఒలింపిక్స్

ఓ క్రీడాకారుడు.. ఆడితే అక్కడే ఆడాలి..!

ఓ క్రీడాభిమాని.. చూస్తే వాటినే చూడాలి..!

ప్రపంచ క్రీడాకారులంతా ఒక చోటికి చేరే వేదిక అది! ప్రపంచమంతా కళ్లప్పగించి చూసే సంబరమది!

200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది.. అంతా కలిసి ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రీడా సంబరాన్ని ఒక యజ్ఞంలా జరిపిస్తుంటే.. ప్రపంచం నలుమూలల నుంచి వందల కోట్ల మంది వాటిని వీక్షిస్తూ.. క్షణ క్షణం ఉత్కంఠకు గురవుతూ.. భావోద్వేగాల్లో మునిగి తేలే అరుదైన సందర్భమిది.

ఓ అథ్లెట్‌ ఆట కోసం జీవితాన్నే అంకితం చేసి.. ఎన్నో త్యాగాలు చేసి.. కొన్నేళ్ల సమయాన్ని వెచ్చించి.. ఒళ్లు హూనం చేసుకుని.. రేయింబవళ్లు శ్రమించేది ఈ విశ్వ క్రీడల్లో పోటీ పడాలని, పతకాన్ని ముద్దాడాలనే.

ఇదే లక్ష్యంతో బరిలోకి దిగే మేటి క్రీడాకారుల మధ్య ప్రతి పోరూ ఒక యుద్ధమే. ఏళ్ల శ్రమకు కొన్ని క్షణాల్లో ఫలితం దక్కొచ్చు. ఆ కొన్ని క్షణాల్లోనే కష్టమంతా నేలపాలు కావచ్చు. ఏం జరిగినా.. అంతులేని ఉద్వేగమే!

ఓవైపు మనకు ఉద్వేగాన్ని కలిగించే సొంత క్రీడాకారుల పోటీలు.. మరోవైపు మనలో ఉత్సాహాన్ని నింపే ప్రపంచ మేటి అథ్లెట్ల పోరాటాలు.. ఏవి చూసినా మజానే!

కొత్త ఆటలు.. సరికొత్త విన్యాసాలు.. కొంగొత్త ఛాంపియన్లు.. రికార్డులు.. సంచలనాలు.. మరపురాని విజయాలు.. బాధపెట్టే ఓటములు.. నవ్వులు.. కన్నీళ్లు.. వివాదాలు.. విచిత్రాలు.. అన్నింటి మేలు కలయిక.. ఒలింపిక్స్‌!

కరోనా దెబ్బకు ఒక ఏడాది వాయిదా పడ్డా.. మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు.. ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టేస్తున్నారు. ఇక వచ్చే రెండు వారాల్లోనూ అడ్డంకులు తప్పకపోవచ్చు. వాటిని అధిగమించి ఒలింపిక్స్‌ స్ఫూర్తి పతాకాన్ని ఎగురవేయాలని.. టోక్యో విశ్వక్రీడలు చరిత్రలో నిలిచిపోవాలని ప్రతి క్రీడాభిమాని ఆకాంక్ష.

ఇదీ చదవండి: ఒలింపిక్​​ 'గోల్డ్​ మెడల్'​లో బంగారం ఎంతో తెలుసా?

ఈసారి ఎన్ని..

ఒలింపిక్స్‌ ఆరంభం కాబోతుండగా భారత క్రీడాభిమానులను తొలిచే ప్రశ్న.. ఈసారి మనకెన్ని పతకాలు వస్తాయి? ఒకప్పుడు ఒలింపిక్స్‌కో పతకం అన్నట్లుగా గెలుస్తూ వచ్చిన భారత్‌.. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మూడు పతకాలతో మురిపించింది. అందులో ఓ స్వర్ణం కూడా ఉండటం విశేషం. తర్వాతి ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య రెట్టింపైంది. రియోలో పతకాలు ఇంకా పెరుగుతాయని, రెండంకెల సంఖ్యలో వచ్చేస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ రెండే పతకాలకు పరిమితమై అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది భారత బృందం. ఈసారి అరడజను, అంతకుమించి పతకాలు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే 16 మందితో కూడిన షూటింగ్‌ బృందంలో ప్రతి ఒక్కరికీ పతకం గెలిచే అవకాశముంది. యువ షూటర్లు మను బాకర్‌, సౌరభ్‌ చౌదరి సహా బృందంలోని అందరూ జోరు మీదున్నారు. దీంతో ఎంత తక్కువ అనుకున్నా మూణ్నాలుగు పతకాలు ఖాయం అన్న అంచనాలున్నాయి.

2008 నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకం దక్కిన ఏకైక క్రీడ రెజ్లింగే. భజ్‌రంగ్‌, వినేశ్‌ లాంటి మేటి కుస్తీ యోధులు మంచి ఫామ్‌తో టోక్యోలో అడుగు పెడుతుండటం వల్ల రెజ్లింగ్‌ నుంచి రెండు పతకాలు పక్కా అన్న ఆశలున్నాయి. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ మరో ఒలింపిక్‌ పతకంతో తన కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటోంది. అమిత్‌ ఫంగాల్‌, లవ్లీనా, వికాస్‌ కృషన్‌ లాంటి ప్రపంచ స్థాయి బాక్సర్లు పతకం కోసం పట్టుబట్టి ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో గత పర్యాయం రజతం గెలిచిన సింధు.. ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, ఆర్చరీలో దీపికా కుమారి, జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా కూడా పతకాశలు రేపుతున్నారు. హాకీ జట్టు కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఒక ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యధిక పతకాల రికార్డును ఈ బృందం అధిగమించొచ్చన్నది వాస్తవికమైన ఆశ!

ఇదీ చదవండి: Olympics: పతకాన్ని ఎందుకు కొరుకుతారో తెలుసా?

స్వర్ణానికి రూ.75 లక్షలు

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలతో తిరిగొచ్చే అథ్లెట్లకు ఇచ్చే నగదు పురస్కారాలను భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గురువారం ప్రకటించింది. పసిడి విజేతకు రూ.75 లక్షలు, రజతం గెలిస్తే రూ.40 లక్షలు, కాంస్యం నెగ్గిన అథ్లెట్లకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ఐఓఏ వెల్లడించింది. మరోవైపు అథ్లెట్లు టోక్యోలో గడిపే సమయంలో ఒక్కో రోజుకు భత్యం కింద దాదాపు రూ.3,723 (50 డాలర్లు) ఇవ్వాలని ఐఓఏ సలహా కమిటీ సూచించింది.

బంగారు కొండ ఎవరో?

ఒలింపిక్స్‌ వ్యక్తిగత స్వర్ణం గెలిచిన ఏకైక భారత అథ్లెట్‌ అభినవ్‌ బింద్రా. హాకీ జట్టు ఒలింపిక్స్‌లో ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సాధించింది కానీ.. వ్యక్తిగత విభాగంలో పసిడి 2008 వరకు కలే. ఆ ఏడాది బీజింగ్‌ క్రీడల్లో షూటర్‌ బింద్రా ఆ కలను నెరవేర్చాడు. తర్వాతి రెండు ఒలింపిక్స్‌లో చాలామంది క్రీడాకారులపై పసిడి ఆశలు పెట్టుకోగా.. ఎవ్వరూ అంచనాలను అందుకోలేదు. ఈసారి స్వర్ణం గెలుస్తారన్న అంచనాలున్న అథ్లెట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. రియోలో రజతం గెలిచిన సింధు.. ఈసారి ఇంకో మెట్టు ఎక్కేస్తానంటోంది. షూటింగ్‌లో మను బాకర్‌, సౌరభ్‌ చౌదరి సహా స్వర్ణానికి పోటీదారులు చాలామందే ఉన్నారు. సింగిల్స్‌, పెయిర్‌, టీమ్‌.. మూడు ఈవెంట్లలోనూ భారత షూటర్లు బంగారు పతకాలు గెలవడానికి మంచి అవకాశాలున్నాయి. ఇక రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌ పునియా పసిడి ఆశ తీరుస్తాడనే నమ్మకం బలంగా ఉంది. బాక్సర్లపై పతక ఆశలున్నాయి కానీ.. మేరీకోమ్‌, అమిత్‌ పంఘాల్‌ లాంటి వాళ్లు అంచనాల్ని మించి పోయి పసిడి గెలిచినా ఆశ్చర్యం లేదు. మరి ఈసారి మన బంగారు కొండ ఎవరవుతారో చూడాలి.

వేడుక 4.30 నుంచి

భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం ప్రారంభం కానుంది. కరోనా కారణంగా కేవలం వెయ్యి మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు కూడా తక్కువ సంఖ్యలోనే పాల్గొననున్నారు. అథ్లెట్ల కవాతులో భారత్‌ నుంచి 20 మంది అథ్లెట్లు, ఆరుగురు ప్రతినిధులు మాత్రమే పాల్గొంటున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌, పురుషుల హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ త్రివర్ణ పతకాలు చేతబూని భారత బృందాన్ని నడిపించనున్నారు.

ఇదీ చదవండి: ఒలింపిక్​ క్రీడలను ఎప్పుడు, ఎలా చూడొచ్చు!

పతకాలు రేపటి నుంచే

ఒలింపిక్స్‌లో తొలి పతకం దక్కేది రేపే. శుక్రవారం వివిధ క్రీడాంశాల్లో పోటీలు జరిగినప్పటికీ పతక పోరుకు శనివారమే తెరలేవనుంది. తొలి రోజు ఆర్చరీ, ఈక్వెస్ట్రియన్‌, రోయింగ్‌, షూటింగ్‌లో అథ్లెట్లు తలపడనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటల నుంచి పోటీలు ఆరంభమవుతాయి. ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకతో పాటు ఈ పోటీలనూ సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

తొలిరోజే మనవాళ్లు

టోక్యో ఒలింపిక్స్‌ తొలిరోజే భారత అథ్లెట్లు పతక వేటకు తెరలేవనుంది. నలుగురు ఆర్చర్లు తమ ప్రయాణాన్ని శుక్రవారమే మొదలెట్టనున్నారు. ఆర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్‌ దీపిక కుమారి, పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్లో అతాను దాస్‌, తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌ పోటీపడనున్నారు. మహిళల పోటీలు ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకూ, పురుషుల పోటీలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకూ సాగుతాయి.

అమ్మో.. వేడి

మేటి ప్రత్యర్థులను ఎదుర్కోవడమే కాదు.. ఒలింపిక్స్‌ సందర్భంగా జపాన్‌లో వేడి వాతావరణాన్ని తట్టుకోవడం కూడా అథ్లెట్లకు సవాలే. క్రీడల సందర్భంగా ఎక్కువ రోజులు 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా. వడదెబ్బ తగిలే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒలింపిక్‌ వేదికలో ఎలుగుబంటి

టోక్యో ఒలింపిక్స్‌లో బేస్‌బాల్‌ స్టేడియంలో పోటీలు జరుగుతుండగా ఎలుగుబంటి కనిపించడం కలకలం రేపింది. ఆస్ట్రేలియా-జపాన్‌ మహిళల జట్ల మధ్య సాఫ్ట్‌బాల్‌ మ్యాచ్‌ నడుస్తుండగా ఒక ఆసియా నల్ల ఎలుగు అటుగా వచ్చినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌ నుంచి గినియా జట్టు ఆరోగ్య కారణాల రీత్యా తప్పుకుంది.

  • ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌లో భారత్‌ ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. ఫెన్సర్‌ భవానీ దేవి పోటీల్లో నిలిచింది. మరోవైపు నేత్ర కుమానన్‌ ఒలింపిక్స్‌లో మహిళల సెయిలింగ్‌లో బరిలో దిగనున్న తొలి భారత సెయిలర్‌గా చరిత్ర సృష్టించింది.
  • జపాన్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. 1964లో ఆసియాలోనే తొలిసారిగా టోక్యోలో విశ్వ క్రీడలు జరిగాయి.
  • ఆధునిక శకంలో జరుగనున్న 32 ఒలింపిక్స్‌ ఇవి. 1896లో ఏథెన్స్‌లో తొలిసారి విశ్వ క్రీడలను నిర్వహించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా 1916, 1940, 1944 ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. చరిత్రలో క్రీడలు వాయిదా పడడం మాత్రం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: Olympics 2021: విశ్వక్రీడలకు వేళాయెరా- విశేషాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.