ETV Bharat / sports

జూనియర్​ ప్రపంచకప్‌.. పసిడితో మెరిసిన తెలుగు తేజాలు

author img

By

Published : May 14, 2022, 7:30 AM IST

Juniour worldcup Shooting: జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో యువ తెలుగు షూటర్లు ఉమామహేష్‌, ఇషా సింగ్‌ అదరగొట్టారు. పురుషుల టీమ్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మహేష్‌, మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఇషా స్వర్ణం సాధించారు.

Juniour worldcup Shooting
ప్రపంచకప్‌ షూటింగ్‌

Juniour worldcup Shooting: జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో యువ తెలుగు షూటర్లు ఉమామహేష్‌, ఇషా సింగ్‌ పసిడితో మెరిశారు. పురుషుల టీమ్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మహేష్‌, మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఇషా స్వర్ణం సాధించారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో తీర్థ్‌ మకీజా, రుద్రాంక్ష్ బాలా సాహెబ్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం ఫైనల్లో మహేష్‌ బృందం 16-8తో స్పెయిన్‌ (అడ్రియన్‌, ఒవిడో, జార్జ్‌)పై విజయం సాధించింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల మహేష్‌.. ఇటీవల ప్రపంచకప్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో 628 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. ట్రయిల్‌-2 టోర్నీలో జూనియర్‌, యూత్‌ విభాగాల్లో అతడు స్వర్ణాలతో మెరిశాడు. చిన్నప్పుడు కరాటె, క్రికెట్‌ అంటే మక్కువ చూపిన మహేష్‌.. ఆ తర్వాత షూటింగ్‌లోకి వచ్చాడు. 2018లో ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌లో చేరి ఈ క్రీడలో పట్టు సాధించాడు. భోపాల్‌లో జరిగిన జాతీయ షూటింగ్‌లో 15 ఏళ్ల వయసులో పోటీపడిన మహేష్‌.. 17 ఏళ్లకు భారత సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇషాకు మరో స్వర్ణం: తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ ప్రపంచకప్‌లో మరోసారి మెరిసింది. మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో మను బాకర్‌, పాలక్‌తో కలిసి ఈ హైదరాబాదీ టీనేజర్‌ స్వర్ణం గెలిచింది. తుది సమరంలో భారత్‌ 16-8తో జార్జియా (సలోమ్‌, మరియాం, ప్రొడియాష్‌విలి)పై నెగ్గింది. ఈ కప్‌లో ఇషాకు ఇది రెండో స్వర్ణం. ఇంతకుముందు మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సౌరభ్‌ చౌదరితో కలిసి ఇషా పసిడి గెలిచింది. మహిళల ఎయిర్‌ రైఫిల్‌, పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగాల్లోనూ భారత్‌ పసిడి సొంతం చేసుకుంది. ఆర్య, జీనా, రమితలతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 17-9తో కొరియా (యెన్‌, వాన్‌, జాంగ్‌)పై నెగ్గింది. శరభ్‌జ్యోత్‌, శివ నర్వాల్‌, సౌరభ్‌ చౌదరిలతో కూడిన పురుషుల జట్టు ఆఖరి పోరులో 17-9తో ఉజ్బెకిస్థాన్‌ (కమలోవ్‌, నికితిన్‌, ఉమెద్‌బెక్‌)పై గెలిచింది.

ఇదీ చూడండి: ఇంకొక్క అడుగు వేస్తే.. స్వర్ణం మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.