ETV Bharat / sports

టెస్టుల్లో భారత్‌కు సమస్యలు..ఆ 'మూడు' సంగతేంటి?

author img

By

Published : Jul 25, 2023, 3:55 PM IST

Team India Test : విండీస్‌పై టెస్టు సిరీస్‌ను గెలిచినప్పటికీ.. టీమ్‌ఇండియాలో ఏదో తెలియని వెలితి. క్లీన్‌స్వీప్‌ చేయలేదనే నిరాశతోపాటు మరో మూడు సమస్యలు వెంటాడుతున్నాయి. అవేంటంటే..

team india test
team india test

WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్‌లో భాగంగా విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్​ఇండియా తలపడింది. ఓ వైపు బ్యాటర్లు, మరోవైపు బౌలర్లు సమష్ఠిగా రాణించడం వల్ల టీమ్ఇండియా 1-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా వర్షం కారణంగా రెండో టెస్టు రద్దైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ వరుణుడి ప్రతాపం వల్ల మ్యాచ్​ రద్దైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ మూడు సమస్యలు భారత్‌ ఎదుర్కోవడం గమనార్హం. అవేంటంటే..

ఆ స్థానంలో కుదురుకోవాలి..
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో సీనియర్‌ ఆటగాడు ఛెతేశ్వర్‌ పుజారా పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు. అంతకు ముందు కౌంటీల్లో వరుసగా సెంచరీలు బాదడం వల్ల అతడిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ కీలకమైన పోరులో పుజారా చేతులెత్తేయడం వల్ల అతన్ని పక్కన పెట్టేశారు. అంతే కాకుండా విండీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో ఇషాన్ కిషన్‌, యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. ఇక ఓపెనర్‌గా దిగిన యశస్వి.. తొలి టెస్టులోనే భారీ శతకంతో ఎంట్రీ అదరగొట్టాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ కూడా రెండో టెస్టులో ముందుకొచ్చి మరీ వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.

అయితే, ఏ జట్టుకైనా వన్‌డౌన్‌ చాలా కీలకం. ఇలాంటి స్థానంలో ఎవరు ఆడతారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అయితే సీనియర్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తాడు. అందుకే శుభ్‌మన్‌ గిల్ స్వయంగా ముందుకొచ్చి.. తాను ఆడాలని భావిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అందరూ ఈ నిర్ణయాన్ని అద్భుతమని కొనియాడారు. ఎందుకంటే ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడు క్రీజ్‌లో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంటుంది.

అయితే, ఓపెనర్లు అదరగొట్టిన రెండు టెస్టుల్లోనూ గిల్ మాత్రం కాస్త నిరాశపరిచాడు. ఇక్కడ ఉండే ఒత్తిడిని అతను తట్టుకోవడంలో విఫలమయ్యాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి టెస్టులో 6 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టెస్టులో 10, 29* పరుగులు సాధించాడు. అయితే రెండో టెస్టు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కాస్త దూకుడు ప్రదర్శించాడు. కానీ ఇలాంటి కీలక స్థానంలో ఉత్తమ ప్రదర్శన చేయాలంటే మరింత అనుభవం అవసరం ఉంటుంది. దీంతో మరికొన్ని మ్యాచ్‌ల్లో గిల్‌కు అవకాశం ఇవ్వాలనే సూచనలు కూడా వచ్చాయి.

వైస్‌ కెప్టెన్‌కు ఏమైంది?
విండీస్‌ పర్యటనకు ముందు అజింక్య రహానె పరిస్థితి ఒకలా ఉండేది. ఐపీఎల్‌లో సూపర్ ప్రదర్శన.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నిలకడైన ఆటతీరు ఇది అతని స్టాటస్టిక్స్​. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ అతను బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇతర బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధించిన పిచ్‌లపై రహానే తేలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అయితే, మొత్తం 11 పరుగులు (3, 8) అతను చేయడం గమనార్హం. అయితే డిసెంబర్‌ వరకు టెస్టు మ్యాచ్‌లు లేవు. మళ్లీ దక్షిణాఫ్రికాతోనే సిరీస్‌ ఆడాల్సి ఉంటుంది. ఆలోగా దేశవాళీ క్రికెట్‌లో అజింక్య రాణిస్తేనే జట్టులో చోటు దక్కుతుంది.

ఇలాగైతే కష్టమే
చాలా రోజుల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన జయ్‌దేవ్‌ ఉనద్కత్ ప్రదర్శన మరీ తేలిపోయేలా ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత బౌలర్లు 230 ఓవర్లు వేశారు. అందులో జయ్‌దేవ్‌ వేసిన ఓవర్లు కేవలం 28 మాత్రమే అంటే మీరు నమ్ముతారా..? ఈ సిరీస్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన ముకేశ్‌ కుమార్‌ కూడా రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు వేసిన ముకేశ్‌ నాలుగు మెయిడిన్లు చేయడం విశేషం. ఈ క్రమంలో జయ్‌దేవ్‌ ఇలాగే కొనసాగితే జట్టులో చోటు సంపాదించడం కష్టమే అవుతుంది. ఈ క్రమంలో జయదేవ్​.. యువ క్రికెటర్ల నుంచి విపరీతమైన పోటీ ఎదుర్కోక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.