WPL 2023: దుమ్మురేపిన షెఫాలీ వర్మ.. 10 వికెట్ల తేడాతో దిల్లీ ఘన విజయం

author img

By

Published : Mar 11, 2023, 10:00 PM IST

Updated : Mar 11, 2023, 10:10 PM IST

delhi vs gujarat wpl

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. గుజరాత్‌ను చిత్తుగా ఓడించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మహిళల ప్రీమియర్​ లీగ్​లో దిల్లీ క్యాపిటల్స్​ హ్యాట్రిక్​ విజయాన్ని అందుకుంది. గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్​ వారియర్స్ నిర్దేశించిన 105 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్​ కోల్పోకుండా 7.1 ఓవర్లలోనే దిల్లీ ఛేదించేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్మురేపింది. 76 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిది. 28 బంతుల్లో 10 ఫోర్లు, ఐదు సిక్స్​లు బాదేసింది. గుజరాత్​ బౌలర్లకు ఏ కోణాన అవకాశం ఇవ్వకుండా మైదానంలో వీర విహారం చేసింది. షెఫాలీ వర్మ కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్‌, కెప్టెన్​ మెగ్ లానింగ్ (21*) ఆమెకు చక్కని సహకారం అందించింది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్ జట్టుకు తొలి ఓవర్‌లోనే మారిజేన్‌ షాక్‌ ఇచ్చింది. సబ్బినేని మేఘన (0)ను రెండో బంతికే మారిజేన్‌ కాప్‌ క్లీన్ బౌల్డ్‌ చేసి ఆ ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మారిజేన్‌ తన తర్వాతి ఓవర్‌(ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌)లో రెండో బంతికి వోల్వార్డ్ట్ (1), మూడో బంతికి ఆష్లీ గార్డ్‌నర్‌ (0)ను ఔట్‌ చేసింది. శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్లో హేమలత (5) యాస్తిక భాటియాకు చిక్కింది. తన మూడో ఓవర్‌లో హర్లీన్‌ డియోల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మారిజేన్ కాప్‌.. నాలుగో ఓవర్‌ (ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌)లో సుష్మా వర్మ (2)ను ఔట్‌ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకుంది.

33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను జార్జియా, కిమ్‌ గార్త్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న వేర్‌హామ్‌ను 13 ఓవర్‌లో రాధాయాదవ్‌ క్లీన్‌బౌల్డ్ చేసింది. 19 ఓవర్‌లో తనుజా కన్వార్‌ (13), స్నేహ్‌ రాణా (2)లను శిఖా పాండే ఔట్‌ చేసింది. జొనాసెన్‌ వేసిన చివరి ఓవర్‌లో 9పరుగులు రావడంతో గుజరాత్ స్కోరు 100 దాటింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు లీగ్​ మ్యాచుల్లో దిల్లీ క్యాపిట్లల్స్​ జట్టు మూడు మ్యాచులు గెలిచి పాయంట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కానీ గుజరాత్​ జెయింట్స్ మాత్రం నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే కైవసం చేసుకుంది. మిగతా మూడింట ఓటమిపాలై నాలుగో స్థానాన్ని సరిపెట్టుకుంది.

Last Updated :Mar 11, 2023, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.