ETV Bharat / sports

నడిపించింది వాళ్లిద్దరే : సూర్య కుమార్‌ యాదవ్‌

author img

By

Published : Dec 27, 2022, 8:04 AM IST

సూర్యకుమార్ యాదవ్.. తన 360 డిగ్రీల ఆటతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.అతడు బ్యాటింగ్​ చేస్తుంటే ఆ బంతి ఏ మూల తేలుతుందో అని వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంతటి అద్భుత ఆటతీరు ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్​ ప్రణాళికలు తదితర విషయాలపై మాట్లాడాడు అవి ఏంటంటే..

world number one batter Surya about upcoming world cup plans and other things
సూర్య కుమార్‌ యాదవ్‌

సూర్యకుమార్‌ యాదవ్‌.. అతను బరిలో ఉంటే బంతి ఏ మూల తేలుతుందో తెలియదు.. ఇలా కూడా ఆడొచ్చా, బ్యాటింగ్‌ ఇంత సులభమా అని అభిమానులే కాదు ప్రత్యర్థి బౌలర్లూ అబ్బురపడే 360 డిగ్రీల ఆట అతడిది. టీ20ల్లో అతను ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌. ఈ ఘనత సాధించడం కలలా అనిపిస్తోంది అంటున్నాడు సూర్య. తన ధనాధన్‌ ఆట, టెస్టుల్లో అరంగేట్రం, వచ్చే వన్డే ప్రపంచకప్‌ ప్రణాళికలు తదితర విషయాలపై 'స్కై' ఇంకా ఏమంటున్నాడంటే..

అదొక కల
టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌.. ఈ ట్యాగ్‌ను నమ్మలేకపోతున్నా. ఏడాది క్రితం ఇదో కల. టీ20ల్లో ఆడడం మొదలుపెట్టినప్పుడు అత్యుత్తమంగా రాణించాలని అనుకున్నా. అందుకోసం కఠోరంగా శ్రమించా. ఇప్పుడు ప్రతిఫలం వస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌పై కూడా దృష్టి పెడుతున్నా. ఇందుకోసం గేమ్‌లో మార్పులేమి చేసుకోను. ఏ ఫార్మాట్‌ ఆడినా ఒకటే ఆట. బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా అంతే. బరిలో దిగితే అలరించడమే నా పని. ఆట స్వరూపాన్ని మార్చేవాడిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటా. 40-50 బంతుల్లోనే చేయాల్సింది చేయమని జట్టు కోరుకుంటున్నప్పుడు 100 బంతులు ఆడడం ఎందుకు?

పదేళ్లు దేశవాళీలో..
టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కెరీర్‌ ఆరంభం నుంచి ఆడింది ఎర్ర బంతితోనే. రోజుకో మలుపు తిరుగుతూ సవాల్‌ను విసిరే అయిదు రోజుల ఆట అంటే చాలా ఇష్టం. ఆస్ట్రేలియాతో రాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో జట్టు కోరుకుంటే సేవలందించడానికి సిద్ధం. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేయడానికి ముందు పదేళ్లు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడా. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బెరుకు లేకుండా బ్యాటింగ్‌ చేయడానికి కారణం ఇదే. దేశవాళీలో ఎంతగా రాణించినా సెలక్టర్ల నుంచి పిలుపు రాకపోవడం నిరాశ కలిగించింది. కానీ కష్టపడితే ఏదో ఒకరోజు జట్టులోకి రావడం ఖాయమని అనుకున్నా.

360.. అలా మొదలైంది
360 డిగ్రీల్లో షాట్లు ఆడడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పాఠశాల, కళాశాల రోజుల్లో క్రికెట్‌ అంతా ఎక్కువగా రబ్బరు బంతితోనే. వర్షంలోనే ఎన్నో మ్యాచ్‌లు ఆడేవాళ్లం. ఇలాంటప్పుడు బంతి ఇష్టం వచ్చినట్లు దూసుకొచ్చేంది. బౌన్స్‌ అవుతూ ఎక్కువ ఎత్తులో వెళ్లేది. అందులోనూ లెగ్‌సైడ్‌ బౌండరీ దూరంగా ఉండేది. అదే ఆఫ్‌సైడ్‌ దగ్గరగా ఉండేది. ఆఫ్‌సైడ్‌ ఫోర్లు కొట్టకుండా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బంతులు వేసేవాళ్లు. ఈ సమయంలోనే భిన్నమైన టెక్నిక్‌లు నేర్చుకున్నా. క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ.. శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతూ స్విచ్‌ షాట్లు, రివర్స్‌ స్వీప్‌లు, అప్పర్‌ కట్‌లతో బౌండరీలు కొట్టేవాడిని. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే ఆట ఉపయోగపడింది. నెట్స్‌లో మాత్రం ఇలా ఆడను. సంప్రదాయబద్ధంగా పద్ధతిగా సాధన చేస్తా. బంతి బ్యాట్‌లో స్వీట్‌ స్పాట్‌కు తాకిందా లేదా అనే చూసుకుంటా.

నడిపించింది వాళ్లిద్దరే..
విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవడం నా అదృష్టం. క్రికెట్లో విజయవంతం కావడంలో ఈ స్టార్లు చోదక శక్తులుగా వ్యవహరించారు. విరాట్‌ భాయ్‌తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. ఇక రోహిత్‌ పెద్ద అన్న లాంటోడు. ఏ అనుమానం ఉన్నా వెంటనే అడిగేస్తా. ఐపీఎల్‌లో (2018) ముంబయి ఇండియన్స్‌లో చేరిన దగ్గర నుంచి అతడు మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి ముంబయికి వచ్చిన తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా రావాలన్న కోరిక ఉండేది. నా మీద భరోసా ఉంచి ముంబయి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆ బాధ్యతను అప్పగించింది. కెరీర్‌లో ఇదే పెద్ద మలుపు. ఇక 2016లో దేవీషాను వివాహం చేసుకున్న తర్వాత అంతా కలిసొచ్చింది. ప్రతి ప్రణాళికల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ. అందుకే ఎక్కడికి వెళ్లినా నా భార్యను వెంట తీసుకెళ్లేవాడిని. ప్రయాణం కుదరదు అన్నా కూడా లాక్కెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దేవిషా తెచ్చిన సమతూకం అలాంటిది. విఫలమైనప్పుడు ఆమె సహచర్యమే పెద్ద ఆదరణ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.