T20 world cup: ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్​.. బరిలోకి హిట్​మ్యాన్​

author img

By

Published : Oct 20, 2021, 6:44 AM IST

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్​ 2021 ()

టీ20 ప్రపంచకప్​లో మరో వార్మప్​ మ్యాచ్​కు (T20 world cup 2021) టీమ్​ఇండియా సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో బుధవారం ఢీకొంటుంది. వార్మప్​ మ్యాచ్​ల్లోనే తన బ్యాటింగ్​ ఆర్డర్​ను ఖరారు చేసుకోనుంది టీమ్ఇం​డియా. రాహుల్‌, రోహిత్‌, మూడో స్థానంలో కెప్టెన్‌తో టాప్‌-3 స్థానాలు ఇప్పటికే ఖాయమయ్యాయి.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్‌ (T20 world cup 2021) సన్నాహాన్ని ఘనంగా ఆరంభించిన టీమ్‌ ఇండియా మరో ప్రాక్టీస్‌ సమరానికి సిద్ధమైపోయింది. బుధవారం తన రెండో, చివరి సన్నాహక పోరులో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. అసలు టోర్నీకి ముందు తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఖరారు చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఇంగ్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు ముందు కోహ్లి చెప్పినట్లు.. రాహుల్‌, రోహిత్‌, మూడో స్థానంలో కెప్టెన్‌తో భారత్‌ టాప్‌-3 స్థానాలు ఇప్పటికే ఖాయమయ్యాయి. ఇంగ్లాండ్‌పై ధనాధన్‌ బ్యాటింగ్‌తో 70 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ ప్రపంచకప్‌ తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఇంగ్లాండ్‌పై రిషబ్‌ పంత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ కన్నా ముందొచ్చాడు. ఆస్ట్రేలియాపై ఏ స్థానంలో ఆడతాడో చూడాలి. ఇంగ్లాండ్‌పై బ్యాటింగ్‌ చేయని రోహిత్‌.. ఆస్ట్రేలియాపై ఆడే అవకాశముంది.

ప్రధానంగా చర్చ జరుగుతున్నది మాత్రం ఆల్‌రౌండ్‌ హార్దిక్‌ పాండ్య గురించే. ఇంగ్లాండ్‌పై అతడు అంత సౌకర్యంగా కనపడలేదు. బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న అతణ్ని.. టోర్నీలో కేవలం బ్యాట్స్‌మన్‌గా ఆడిస్తారా లేదా అన్నది ఆసక్తికరం. అతడు బౌలింగ్‌ చేయకపోతే భారత్‌కు ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం ఉండదు. సోమవారం ఇంగ్లాండ్‌పై భువనేశ్వర్‌ కుమార్‌ రాణించాడు. అత్యుత్తమ బౌలింగ్‌ చేసింది మాత్రం బుమ్రానే. షమి మూడు వికెట్లు పడగొట్టినా.. ఎక్కువ పరుగులిచ్చాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయారు. బుధవారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆడనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ప్రపంచకప్‌ సన్నాహాన్ని విజయంతో ఆరంభించింది. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆ మ్యాచ్‌ ఆసీస్‌కు మిశ్రమ అనుభూతిని మిగిల్చింది. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డేవిడ్‌ వార్నర్‌ రనౌటయ్యాడు. అడమ్‌ జంపా (2/17), కేన్‌ రిచర్డ్‌సన్‌ (3/24) బంతితో ఆకట్టుకోగా.. మిడిల్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆ మ్యాచ్‌లో కష్టంగా గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌పైనైనా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టాలనుకుంటోంది.

ఇదీ చదవండి: హార్దిక్​ బౌలింగ్​ చేయకపోయినా పర్వాలేదు: కపిల్ దేవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.