ETV Bharat / sports

అలా జరగడం టీమ్​ఇండియాకు మంచిది కాదు.. కానీ: దాదా

author img

By

Published : Jul 9, 2022, 6:51 AM IST

Teamindia Ganguly: టీమ్‌ఇండియాలో కొద్దినెలలుగా ఏడుగురు కెప్టెన్లు మారడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అంత మంది ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాల్సివచ్చిందని అన్నాడు. ఇలా జరగడం అంత మంచిదేమీ కాదని పేర్కొన్నాడు.

ganguly teamindia captaincy
గంగూలీ టీమ్​ఇండియా కెప్టెన్సీ

Teamindia Ganguly: టీమ్‌ఇండియాకు ఏడు సిరీస్‌ల్లో ఏడుగురు ఆటగాళ్లు కెప్టెన్లు వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే అంత మంది ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాల్సివచ్చిందని చెప్పాడు. "ఇంత తక్కువ సమయంలో జట్టుకు అంత మంది కెప్టెన్లుగా పని చేయడం ఆదర్శప్రాయం కాదని అంగీకరిస్తా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగింది. దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్‌ నాయకత్వం వహించాల్సింది. కానీ దాని కన్నా ముందే అతడు గాయపడ్డాడు. దాంతో అక్కడ వన్డేల్లో రాహుల్‌ నాయకత్వం వహించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై సిరీస్‌ ఆరంభానికి ఒక రోజు ముందు రాహుల్‌ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో సన్నాహక మ్యాచ్‌ ఆడుతుండగా రోహిత్‌కు కరోనా సోకింది. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పు పట్టలేం. తీరికలేని క్యాలెండర్‌లో ఆటగ్లాకు విరామమివ్వక తప్పదు. గాయాలు కూడా అయ్యాయి. ఆటగాళ్లపై పనిభారం పెరగకుండా కూడా చూడాలి. ప్రతి సిరీస్‌కు ప్రధాన కోచ్‌ (ద్రవిడ్‌) పరిస్థితి చూస్తే బాధనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్లతో ఆడాల్సివచ్చింది" అని గంగూలీ అన్నాడు. ఇటీవల కాలంలో కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, పంత్‌, హార్దిక్‌, బుమ్రా, ధావన్‌ వివిధ ఫార్మాట్లలో భారత జట్లను నడిపించారు.

భారత టీ20 లీగ్‌లో ఇప్పుడు పది జట్లు ఉన్నాయి. భవిష్యత్‌లో బీసీసీఐ ఆదాయం రూ.60 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆటగాళ్ల సంఖ్య కూడా పెరిగేకొద్దీ ప్రతిభావంతులైన క్రికెటర్లు విషయంలో రాజీ పడవచ్చని మీరు భయపడుతున్నారా?
గంగూలీ: అలా ఏం ఉండదు. సమయం గడిచేకొద్దీ భారత్‌లో ప్రతిభావంతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. మన దేశంలో ఎంత మంది ప్రతిభావంతులు ఉన్నారో ఈ టీ20 లీగ్‌ నిరూపిస్తోంది. ఇప్పుడున్న టీమ్‌ఇండియాను చూడండి. అటు టెస్టు క్రికెట్‌లో ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారో చూడండి.

ప్రశ్న: బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇక్కడ ఎలా ఉంది? ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పండి.
గంగూలీ: 2019లో బీసీసీఐ సభ్యుల మద్దతుతో నేను ఈ పదవిలోకి వచ్చాను. ఇదో అద్భుత ప్రయాణం. భారత క్రికెట్‌ రూపురేఖలు మార్చే గొప్ప అవకాశం ఇది. గడిచిన రెండేళ్లలో కొవిడ్‌-19 కాలం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఆ సమయంలో భారత టీ20 లీగ్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌నూ నిర్వహించాం. నేను ఈ పదవిలోకి రాకముందే పాలనా విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉంది. క్యాబ్‌ జాయింట్‌ సెక్రటరీగా, అధ్యక్షుడిగా మంచి అవగాహన ఉంది.

కాగా, ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన టీమ్​ఇండియా రెండో టీ20 ఆడేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం ఇది ప్రారంభంకానుంది. యువ ఆటగాళ్ల దూకుడుతో జట్టులో ప్రతి స్థానానికీ పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడటం కోహ్లికి ఎంతో కీలకం.

ఇదీ చూడండి: మలేసియా మాస్టర్స్​ సెమీస్​లోకి ప్రణయ్.. నిరాశపరిచిన సింధు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.