ETV Bharat / sports

'ధోనీలాంటోడు ఉండాల్సిందే.. ఆ సత్తా ఇద్దరికే ఉంది'

author img

By

Published : Jan 27, 2022, 7:12 AM IST

Dhoni Ravichandran Ashwin: ప్రతిజట్టులోనూ ధోనీ లాంటి సహజ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు ఆసీస్​ మాజీ కెప్టెన్​ గ్రెగ్​ ఛాపెల్​. టెస్టుల్లో 1000 వికెట్లు తీయగల సత్తా టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌, ఆసీస్‌కు చెందిన నాథన్‌ లియాన్​కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు షేన్​ వార్న్.

dhoni
ధోనీ

Dhoni Chapell: ప్రతి జట్టులోనూ మహేంద్రసింగ్‌ ధోనీ లాంటి సహజ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. సహజ వాతావరణంలో ఆట నేర్చుకునేవాళ్లే ఎక్కువ కాలం నిలబడతారని.. ధోనీ అలాంటి ఆటగాడే అని.. అలాంటి ఆటగాళ్లు తగ్గిపోతుండటం వల్లే వివిధ జట్లు ఇబ్బంది పడుతున్నాయని చాపెల్‌ అభిప్రాయపడ్డాడు.

"అభివృద్ధి చెందిన క్రికెట్‌ దేశాలు క్రమంగా సహజ వాతావరణాన్ని కోల్పోతున్నాయి. యువ క్రికెటర్లు ప్రధానంగా ఎదిగేది ఆ వాతావరణం నుంచే. బాగా ఆడే ఆటగాళ్లను చూస్తూ.. కుటుంబ సభ్యులు, క్రికెటర్లతో సరదాగా గడుపతూ ఆట నేర్చుకుంటారు. భారత ఉపఖండంలో ఇంకా అలాంటి వాతావరణం ఉంది. చిన్న పట్టణాల్లో శిక్షణ సౌకర్యాలు తక్కువ. అక్కడ వీధుల్లో, ఖాళీగా ఉండే పొలాల్లో ఎక్కువగా క్రికెట్‌ ఆడుతుంటారు. సంప్రదాయ కోచింగ్‌ పద్ధతుల్ని వారు పాటించరు. ప్రస్తుత స్టార్లు చాలామంది అలా ఆట నేర్చుకున్న వాళ్లే. ధోనీ ఇందుకు సరైన ఉదాహరణ. తన ప్రతిభ, శైలి తనకు తాను తెచ్చుకున్నవే. భారత జట్టులోకి వచ్చాక సీనియర్ల నుంచి, అలాగే పరిస్థితుల నుంచి నేర్చుకుని తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. నాకు తెలిసిన అత్యంత చురుకైన క్రికెట్‌ బుర్రల్లో అతడిది ఒకటి" అని చాపెల్‌ పేర్కొన్నాడు. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ చిత్తుగా ఓడిపోవడానికి కూడా.. సహజ వాతావరణం క్రికెట్‌ నేర్చుకున్న ఆటగాళ్లు జట్టులో లేకపోవడమే కారణమని గ్రెగ్‌ అభిప్రాయపడ్డాడు.

ఇద్దరికే ఆ సత్తా ఉంది

Ravichandran Ashwin Shanewarne: ఇద్దరు స్పిన్నర్లకు మాత్రమే టెస్టుల్లో 1000 వికెట్లు తీయగల సత్తా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. అందులో ఒకరు టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కాగా.. మరొకరు ఆసీస్‌కు చెందిన నాథన్‌ లియాన్‌ అని వార్న్ పేర్కొన్నాడు.

"స్వదేశంలో అశ్విన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అందుకే కుంబ్లే రికార్డు సహా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్‌ (800) రికార్డు అధిగమించే అవకాశం ఉంది. అంతేకాకుండా టెస్టుల్లో వెయ్యి వికెట్లను పడగొట్టే సత్తా అశ్విన్‌ సొంతం" అని వివరించాడు.

ప్రస్తుతం అశ్విన్‌ 430, లియాన్‌ 415 వికెట్లతో ఉన్నారు. భారత టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌ అశ్వినే. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) మాత్రమే ముందున్నారు.

"అశ్విన్‌, లియాన్‌ ఇద్దరూ నాతోపాటు ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొడతారని ఆశిస్తున్నా. నాణ్యమైన స్పిన్‌ను చూస్తుంటే తప్పకుండా సాధిస్తారనే నమ్మకం ఉంది. ఇది టెస్టు క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఫాస్ట్‌బౌలర్‌-బ్యాటర్‌ ఫైట్‌ కంటే స్పిన్నర్‌తో బ్యాటర్‌ పోరాటం ఎక్కువ మంది చూస్తారని అనుకుంటా. ఒకవేళ అశ్విన్‌, లియాన్ వెయ్యి వికెట్లను పడగొడితే టెస్టు క్రికెట్‌ ఇంకా ఎంతో ఆసక్తిగా మారుతుంది" అని తెలిపాడు.

అశ్విన్‌ బౌలింగ్‌కు తానొక అతిపెద్ద అభిమానిని అని వార్న్‌ పేర్కొన్నాడు. "రవిచంద్రన్ అశ్విన్‌ రోజురోజుకూ మెరుగవుతున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎలాంటి క్రికెటర్‌కైనా అసలైన పరీక్ష విదేశాల్లో ఎలా రాణించారనేది చూస్తారు. సుదీర్ఘకాలం కెరీర్‌లో స్వదేశం సహా విదేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డును కలిగి ఉన్నాడా లేదా అనేదే పరిశీలిస్తారు. నేను అశ్విన్‌కు పెద్ద అభిమానిని. విభిన్నంగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు" అని షేన్‌ వార్న్‌ విశ్లేషించాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

వెస్టిండీస్​ సిరీస్​కు భారత జట్టు.. కుల్దీప్ రీఎంట్రీ, బిష్ణోయ్​కు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.