ETV Bharat / sports

IND Vs WI 1st T20 : విండీస్‌తో టీ20 సిరీస్‌ నేటి నుంచే.. మన కుర్రాళ్లకు పెద్ద సవాలే!

author img

By

Published : Aug 3, 2023, 6:39 AM IST

IND Vs WI 1st T20 2023 : టెస్టులు, వన్డే సిరీస్​లో విజయం సాధించిన టీమ్​ఇండియా.. ఇప్పుడు వెస్టిండీస్​తో టీ20 సిరీస్​కు రంగం సిద్ధమైంది. అయితే ఈ ఫార్మాట్లో విండీస్​ ఆటగాళ్లు సిద్ధహస్తులే. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్​ల్లో మెరుపులు మెరిపించే వెస్టిండీస్​ వీరులు.. టీమ్​ఇండియా కుర్రాళ్లకు సవాల్​ విసరడ ఖాయం. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలు తెలుసుకుందాం.

IND Vs WI 1st T20
IND Vs WI 1st T20

IND Vs WI 1st T20 2023 : టెస్టు, వన్డే సిరీస్‌ తర్వాత భారత్, వెస్టిండీస్‌ మధ్య టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. ఆఖరి వన్డే జరిగిన వేదికపైనే నేడు(గురువారం) తొలి పోరు జరగనుంది. రాబోయే రోజుల్లో వరల్డ్‌ కప్‌ వరకు పూర్తిగా వన్డేలపైనే భారత్‌ దృష్టి పెట్టనున్న నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో తమ స్థానం పటిష్ఠం చేసుకోవాలనుకునే యువ ఆటగాళ్లకు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కీలకం కానుంది. రోహిత్, కోహ్లీలకు ముందే విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో కూడా హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోనే భారత్‌ బరిలోకి దిగుతోంది. అయితే టీ20ల్లో అత్యధిక మంది ఆల్‌రౌండర్లున్న జట్టు విండీస్​. నిమిషాల్లో మ్యాచ్‌ ఫలితాలు మారిపోయేలా విధ్వంసం సృష్టించడం కరీబియన్‌ క్రికెటర్లకు అలవాటే. కాబట్టి గురువారం తొలి టీ20లో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.

చెలరేగిన పూరన్​..
IND Vs WI 1st T20 West Indies : అమెరికాలో ఇటీవల ముగిసిన మేజర్​ క్రికెట్​ లీగ్​ టోర్నీలో విండీస్​ ప్లేయర్ నికోలస్​ పూరన్​.. చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులతో నాటౌట్​గా నిలిచిన పూరన్​.. ఏకంగా 13 సిక్సులు బాదేశాడు. టీ20ల్లో విండీస్‌ వీరులు ఎంత ప్రమాదకారులో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలా అని పూరన్‌ ఒక్కడే కాదు.. కైల్‌ మేయర్స్‌, రోమన్‌ పావెల్‌, హెట్‌మయర్‌, హోల్డర్‌, రోస్టన్‌ చేజ్‌, ఒడియన్‌ స్మిత్‌, రొమారియో షెఫర్డ్‌.. వీళ్లంతా కూడా ప్రమాదకారులే. వీరిలో హెట్‌మయర్‌ మినహా అందరూ ఆల్‌రౌండర్లే కావడం గమనార్హం.

తిలక్​, యశస్వి అరంగ్రేటం
IND Vs WI 1st T20 Team India : టీ20 సిరీస్​కు గాను.. టీమ్​ఇండియా ఫైనల్​ జట్టు ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. వన్డే సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తొలి రెండు వన్డేల్లో తడబడ్డప్పటికీ.. చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్లు సత్తా చాటారు. హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌లో టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్‌తో కలిసి యశస్వినే ఓపెనింగ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో ఆడొచ్చు. సంజు శాంసన్‌ ఆడటం మళ్లీ అనుమానమే. అతడు ఆడాలంటే ఇషాన్‌ తన స్థానాన్ని త్యాగం చేయాలి. తిలక్‌ నాలుగో స్థానంలో ఆడతాడని అంచనా.

టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, వైస్‌కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. మూడో స్పిన్నర్‌గా చాహల్‌, రవి బిష్ణోయ్‌ల్లో ఒకరిని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. టెస్టుల్లో, వన్డేల్లో అరంగేట్రం చేసి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న ముకేశ్‌ టీ20ల్లో కూడా అవకాశం అందుకోనున్నాడు. పేస్‌ బౌలింగ్‌ దీటుగా ఎదుర్కొనే విధ్వంసక విండీస్‌ బ్యాటర్లను భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.

పరుగుల పిచ్‌
IND Vs WI 1st T20 Pitch Report : బ్రయాన్‌ లారా స్టేడియంలోనే భారత్​ విండీస్​ తొలి టీ20 జరగనుంది. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. భారత్‌, విండీస్‌ చివరి వన్డే జరిగింది ఇక్కడే. టీమ్‌ఇండియా బ్యాటర్లు జట్టుకు 350 పైచిలుకు స్కోరు సాధించిపెట్టారు. బౌలర్లకు కూడా పిచ్‌ నుంచి సహకారం ఉంటుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అవకాశముంటుంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలున్నాయి.

తుది జట్లు (అంచనా)..
భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ (కెప్టెన్‌), సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌, చాహల్‌/రవి బిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌కుమార్‌.

వెస్టిండీస్‌: మేయర్స్‌, కింగ్‌, హోప్‌/చార్లెస్‌, పూరన్‌, హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌ (కెప్టెన్‌), రోస్టన్‌ చేజ్‌, జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌/ఒడియన్‌ స్మిత్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.