ETV Bharat / sports

దడ పుట్టించిన స్టోక్స్.. 39ఏళ్ల రికార్డు బద్దలు​.. ఇంగ్లాండ్ చేతిలో పాక్​ క్లీన్ ​స్వీప్​

author img

By

Published : Dec 20, 2022, 1:22 PM IST

ఆఖరి టెస్టులోనూ గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్​. పాకిస్థాన్​ను క్లీన్ స్వీప్​ చేసింది. ఆ మ్యాచ్ సంగతులు..

England Pakisthan match
ఇంగ్లాండ్ చేతిలో పాక్​ క్లీన్ ​స్వీప్​

17ఏళ్ల తర్వాత పాకిస్థాన్​ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ చారిత్రక విజయాన్ని అందుకుంది. తాజాగా జరిగిన మూడో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది.. మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంతో ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలన్న పాక్​ జట్టుకు సొంత గడ్డపైనే ఘరో పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బెన్‌ డకెట్‌ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్‌), బెన్‌ స్టోక్స్‌(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్‌) ఇంగ్లాండ్​ను విజయతీరాలకు చేర్చారు.

కాగా, పాకిస్థాన్​ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్​కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ బ్యాటర్లు తడబడడం వల్ల 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్​ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జాక్‌ క్రాలీ(41), రెహాన్‌ అహ్మద్‌(10) పరుగులు చేసి ఔట​వ్వగా.. బెన్‌ డకెట్‌, స్టోక్స్‌లు మరో వికెట్​ పడకుండా ఇంగ్లాండ్​ను గెలిపించారు.

39ఏళ్ల రికార్డు బద్దలు​.. ఇక ఈ సిరీస్​లో హ్యారీ బ్రూక్‌ రూపంలో ఇంగ్లాండ్​కు ఓ సూపర్​ బ్యాటర్‌ దొరికాడు. అతడు మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసి.. మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే హ్యారీ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాకిస్థాన్​పై ఇంగ్లాండ్​ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు 1983-84లో ఇంగ్లాండ్​ బ్యాటర్‌ డేవిడ్‌ గోవర్‌ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు మరో ఇంగ్లాండ్​ మాజీ ఆటగాడైన మార్కస్‌ ట్రెస్కోథిక్‌ రికార్డును కూడా బద్దలు కొట్టాడు హ్యారీ. ట్రెస్కోథిక్‌.. పాక్‌ గడ్డపై 12 ఇన్నింగ్స్‌లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను అధిగమించిన హ్యారీ బ్రూక్‌.. పాక్‌ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లాండ్​ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

దడ పుట్టించిన స్టోక్స్​.. ఇక ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ లెగ్‌ అంపైర్‌ను భయపెట్టించేశాడు. కాస్త అటు ఇటు అయ్యుంటే అంపైర్‌ తలకు గాయం కచ్చితంగా అయ్యేదే. రెహాన్‌ అహ్మద్‌ ఔటయ్యాకా స్టోక్స్‌ క్రీజులో అడుగుపెట్టాడు. అప్పటికే ఇంగ్లాండ్​ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో నుమాన్‌ అలీ వేసిన ఐదో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్‌ చేతిలో గ్రిప్‌ జారిన బ్యాట్‌ స్క్వేర్‌లెగ్‌లో నిలబడిన లెగ్‌ అంపైర్ పక్కనబడింది. ఈ చర్యతో అంపైర్‌ హసన్‌ రాజా భయపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి: ధోనీ పేరుతో మోసం..! భారీ మొత్తంలో డబ్బులు కాజేసిన కేటుగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.