Rewind 2021:  విశ్వవేదికపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు

author img

By

Published : Dec 30, 2021, 2:48 PM IST

Updated : Dec 30, 2021, 3:07 PM IST

Best women players performance in 2021

Best women players performance in 2021: చరిత్ర సృష్టించినవారు ఒకరు.. ఒకే పారాలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన వారు మరొకరు.. పతకం గెలవకపోయినా ముద్దుబిడ్డ అయినవారు ఇంకొకరు.. ఇవి ఈ ఏడాది మన భారత మహిళా ప్లేయర్లు సాధించిన ఘనతలు. ఈ సంవత్సరం చివరికి వచ్చిన సందర్భంగా వారి సాధించిన అద్భత క్షణాలను ఓసారి మననం చేసుకుందాం..

Best women players performance in 2021: క్రీడారంగంలో పురషులకు పోటీగా మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తున్నారు. అలా ఈ ఏడాది ఒలింపిక్స్​ సహా ఇతర పోటీల్లో పాల్గొని భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడేలా చేశారు. ఈ సంవత్సరం వారు సాధించిన ఘనతలను ఓ సారి నెమరువేసుకుందాం..

21ఏళ్ల తర్వాత

Meerabai olympics: మణిపుర్‌ మణిపూస మీరాబాయి చాను.. ప్రతిష్ఠాత్మకమైన అత్యున్నత క్రీడా పోటీలు టోక్యో ఒలింపిక్స్​లో రజతం సాధించి భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది. దాదాపుగా 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేంది.

meerabai
మీరాబాయి

ఒకే పారాలింపిక్స్​లో రెండు పతకాలు

Avani lekhara paralympics: పారా షూటర్‌ అవనీ లేఖరా.. ఈ ఏడాది అద్భుతం చేసింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించి 19 ఏళ్లకే దిగ్గజంగా మారింది. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో కాంస్య పతకం గెలవగా.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో రికార్డు స్కోరుతో స్వర్ణ పతకాన్ని అందుకుంది. ​

avani lekhara
అవని లేఖరా

ఇదే తొలి పతకం

టోక్యో పారాలింపిక్స్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసింది భవీనాబెన్​. టేబుల్‌ టెన్నిస్‌లో రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌, చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలవ్వడం వల్ల ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

bhavani ben
భవీనాబెన్

లవ్లీనా బోర్గోహెయిన్​ 'కంచు' పంచ్​

లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. 69కిలోల విభాగంలో తలపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.

lovlena
లవ్లీనా

తొలిసారి సెమీస్​కు.. చరిత్ర సృష్టించారు

teamindia hockye team semifinal: రాణి రాంపాల్​ సారథ్యంలోని భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్​ సెమీఫైనల్​కు చేరుకున్న భారత తొలి మహిళా హాకీ జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్​లో అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఇక బ్రిటన్‌తో జరిగిన కాంస్య పోరులోనూ 3-4 తేడాతో ఓడింది. ఈ రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయినప్పటికీ దేశం గర్వించే స్థాయిలో ప్రదర్శన చేసింది.

teamindia
టీమ్​ఇండియా హాకీ టీమ్​

రెండో పతకం​

టోక్యో ఒలింపిక్స్​ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ ఏడాది ఇండోనేషియా మాస్టర్స్​, ఫ్రెంచ్​ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్​లో ఆడిన సింధు కనీసం సెమీస్​ కూడా దాటలేకపోయింది. అయితే బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్​ ఫైనల్స్​కు చేరినప్పటికీ ఓడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది టైటిల్​ గెలవకుండానే ముగించింది.

sindhu
సింధు

పతకం రాకుంటేనే ముద్దుబిడ్డ అయింది

Golfer Aditi ashok: టోక్యో ఒలింపిక్స్​లో ఎవరూ ఉహించని స్థాయిలో అద్భుతం చేసింది గోల్ఫర్​ అదితి అశోక్​. వరల్డ్‌ నంబర్‌ వన్‌తో పాటు టాప్‌-10 క్రీడాకారిణులకు ముచ్చెమటలు పట్టించింది. ఎలాంటి అంచనాలు లేని దశ నుంచి ఏకంగా పతకంపై ఆశలు కల్పించింది. అయితే ఫైనల్‌ రౌండ్లలో ఆమెను దురదృష్టం వెక్కిరించడం వల్ల త్రుటిలో పతకం కోల్పోయింది. నాలుగో స్థానంలో నిలిచి భారమైన హృదయంతో మైదానాన్ని వీడింది. అయితేనేం ప్రపంచ క్రీడల్లో ఆమె చూపిన తెగువను చూసి యావత్‌ భారతదేశం ఆమెను ప్రశంసించింది.

నేత్రా కుమారన్​(సెయిలర్​), భవానీ దేవీ(ఫెన్సింగ్​), మనికా బాత్రా(టేబుల్​ టెన్నిస్​) భారత మహిళా ఫుట్​బాల్​ జట్టు, కూడా ఒలింపిక్స్​లో మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్నారు.

డ్రాగా ముగించారు

మహిళల క్రికెట్​ జట్టు: ఈ ఏడాది భారీ టోర్నీలు ఆడనప్పటికీ.. టెస్ట్​ల్లో మంచి ప్రదర్శన చేసింది. ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్ట్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​ను డ్రాగా ముగించడంలో కీలకంగా వ్యవహరించింది. ఆస్ట్రేలియాతో డే అండ్​ నైట్​ టెస్ట్​ను డ్రాగా ముగించారు. మొత్తంగా మంచి ప్రదర్శన చేశారు.

మొత్తంగా ఈ క్రీడాకారిణిలు అంతా గెలుపోటములను పక్కనపెడితే ఒలింపిక్స్​ సహా ఆడిన పలు ట్రోర్నీల్లో మంచి ప్రదర్శనే చేశారు.

teamindia
టీమ్​ఇండియా మహిళా జట్టు

ఇదీ చూడండి: Team India Shedule 2022: వచ్చే ఏడాది టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే!

Last Updated :Dec 30, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.