ETV Bharat / sitara

Bigg boss 5: బిగ్​బాస్-5 విజేతగా సన్నీ

author img

By

Published : Dec 19, 2021, 10:52 PM IST

13 వారాలపాటు సాగిన బిగ్​బాస్-5 సీజన్ విజయవంతంగా పూర్తయింది. ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించిన వీజే సన్నీ విజేతగా నిలిచాడు.

vj sunny big boss winner
వీజే సన్నీ

బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg boss telugu 5) విజేతగా నటుడు వీజే సన్నీ(VJ sunny) నిలిచాడు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌ (300sqr) సొంతం చేసుకున్నాడు.

సినీతారల సందడితో బిగ్‌బాస్‌-5 గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. టాప్‌-5లో సన్నీతో పాటు షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, సిరి నిలవగా.. ఓటింగ్‌లో వాళ్లను వెనక్కి నెట్టి ఈ సీజన్‌ విజేతగా సన్నీ అవతరించాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు.

vj sunny big boss winner
వీజే సన్నీ బిగ్​బాస్ విన్నర్

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్‌ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ(VJ Sunny) విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు.

కొత్త శ్రీరామ్‌ను చూస్తారు!

ఎలిమినేషన్‌ అనంతరం శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. "హౌస్‌లో ఉండగా, నాగార్జున ఇచ్చిన మోటివేషన్‌ బాగుంది. ఎవరో ఒక్కరు గెలుస్తారు. ఇక్కడకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకున్నా. కచ్చితంగా దగ్గరయి ఉంటా. బిగ్‌బాస్‌ జర్నీ ఒక పాఠం. రేపటి నుంచి కొత్త శ్రీరామచంద్రను చూసుకుంటా. హౌస్‌మేట్స్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ 5 ముందున్న శ్రీరామ చంద్రకూ రేపటి నుంచి మీరు చూసే శ్రీరామ చంద్రకు చాలా తేడా ఉంటుంది. నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు" అని అన్నాడు.

ఇంకా ఓపిక కావాలి: మానస్‌

"జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నా. మనకు ఎంత ఓపికున్నా తక్కువేనని ఇక్కడ నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ సీజన్‌-5 టైటిల్‌ గెలుచుకోవాలన్న ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుని ఉంటాడు. ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రయత్నించారు. ఎవరు టైటిల్‌ గెలిచినా మేమంతా ఏదో ఒకటి సాధించాం. ఇంత దూరం వచ్చామంటే మాలో ఏదో ఒక పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చే ఉంటుంది. ఎవరు ఎక్కువ నచ్చితే వాడే విన్నర్‌" అని మానస్‌ చెప్పుకొచ్చాడు.

సిరి మాట్లాడుతూ.. "19మంది కంటెస్టెంట్‌లలో ఒకరిగా వచ్చిన నేను టాప్‌-5లో నిలవడం సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ జర్నీ చాలా బాగుంది. చాలాసార్లు ఎమోషనల్‌ అయ్యా. ఏదైనా హౌస్‌లో నాకు నచ్చినట్టు నేను ఉన్నా. నా దృష్టిలో సీజన్‌-5 విన్నర్‌ (షణ్ముఖ్) ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15 వారాలు నన్ను భరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు లేనిదే నేను లేను" అని భావోద్వేగానికి గురైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.