ETV Bharat / sitara

Seetimaarr Review: గోపీచంద్ 'సీటీమార్' ఎలా ఉందంటే?

author img

By

Published : Sep 10, 2021, 3:50 PM IST

కబడ్డీ నేపథ్య కథతో తీసిన 'సీటీమార్'.. థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? మాస్​కు మెచ్చే అంశాలు ఏమేం ఉన్నాయో తెలియాలంటే ఈ చిత్రం సమీక్ష చదవాల్సిందే.

seetimaarr telugu movie review
సీటీమార్ మూవీ రివ్యూ

చిత్రం: సీటీమార్‌; న‌టీన‌టులు: గోపీచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశీ తదితరులు; సంగీతం: మ‌ణిశర్మ; నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌ నంది; స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్; బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్; విడుద‌ల‌: 10-09-2021

seetimaarr telugu movie
సీటీమార్ మూవీ రివ్యూ

వినాయ‌క చ‌వితి పండ‌గ‌కg తెలుగు ప్రేక్షకులకు బోలెడంత వినోదం. థియేట‌ర్‌లోనూ... ఓటీటీ వేదిక‌ల్లోనూ కొత్త సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. థియేట‌ర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో గోపీచంద్ 'సీటీమార్‌' ఒక‌టి. సంప‌త్ నంది ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఆరంభం నుంచే ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆక‌ర్షిస్తోంది. ప్రచార చిత్రాల త‌ర్వాత మ‌రిన్ని అంచనాలు పెరిగాయి. గోపీచంద్ - త‌మ‌న్నా జోడీ, క‌బ‌డ్డీ నేప‌థ్యం 'సీటీమార్'ను మ‌రింత ప్రత్యేకంగా మార్చాయి. మ‌రి సినిమా కథేంటి? కబడ్డీ కోచ్‌గా గోపీచంద్‌ ఎలా నటించారు?

క‌థేంటంటే: కార్తీక్ (గోపీచంద్‌) ఆంధ్రా మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. క‌డియంలో త‌న తండ్రి స్థాపించిన రామ‌కృష్ణ మెమోరియ‌ల్ స్కూల్ మూత‌ప‌డే ప‌రిస్థితి త‌లెత్తుతుంది. దాంతో ఎలాగైనా తాను తీర్చిదిద్దిన కబ‌డ్డీ జ‌ట్టును జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, ఆ జ‌ట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ స‌మస్య వెలుగులోకి తీసుకురావాల‌ని నిర్ణయిస్తాడు. ఆ ప్రయ‌త్నంలో ఉన్న కార్తీక్‌కు ఊళ్లోనే ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? దిల్లీలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాను న‌డిపిస్తున్న మాకన్‌సింగ్ (త‌రుణ్ అరోరా)తో కార్తీక్‌కు ఎలా వైరం ఏర్పడింది? త‌న జ‌ట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేత‌గా నిలిచిందా? కార్తీక్ ఆశ‌యం నెర‌వేరిందా? తెలంగాణ క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్ జ్వాలారెడ్డి (త‌మ‌న్నా) కార్తీక్‌కు ఎలా అండ‌గా నిలిచిందనేది మిగ‌తాక‌థ‌.

ఎలా ఉందంటే: వాణిజ్యాంశాల‌తో కూడిన ప‌క్కా ఫార్ములా క‌థ‌కు క‌బ‌డ్డీ నేప‌థ్యాన్ని జోడించి తెర‌కెక్కించిన చిత్రమిది. కొత్తద‌నం... లాజిక్ సంగ‌తుల్ని పక్కన‌పెడితే పైసా వ‌సూల్ మాస్ మ‌సాలా అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రథమార్ధమంతా గోదావ‌రి గ‌ట్లు, ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలతోపాటు ఊళ్లో అమ్మాయిల్ని ఆట‌ల‌వైపు పంపించే విష‌యంలో త‌ల్లిదండ్రుల్లో ఉండే అపోహ‌లు, ప‌ల్లెటూరి రాజ‌కీయాలు కీల‌కం. ద్వితీయార్ధం పూర్తిగా దిల్లీ, క‌బ‌డ్డీ, మాక‌న్ సింగ్ మాఫియా నేప‌థ్యంలో సాగుతుంది. తొలి స‌గ‌భాగంలో కడియం బ్రదర్‌పాత్రలో రావు ర‌మేశ్ చేసే రాజ‌కీయం ఆక‌ట్టుకుంటుంది. గోదావ‌రి యాస మాట్లాడుతూ ఆయ‌న చేసే సంద‌డి న‌వ్విస్తుంది. అత‌ని ఇంటికే వెళ్లి కూతురు (దిగంగ‌న సూర్యవంశీ)కి వ‌చ్చిన పెళ్లి సంబందాన్ని అన్నపూర్ణమ్మ అండ్ గ్యాంగ్ చెడ‌గొట్టే ఎపిసోడ్ కూడా కిత‌కిత‌లు పెడుతుంది.

seetimaarr telugu movie
గోపీచంద్ 'సీటీమార్' మూవీ

అమ్మాయిల త‌ల్లిదండ్రుల్ని ఒప్పించి జాతీయ స్థాయి పోటీల కోసం దిల్లీ వెళ్లిన కార్తీక్ జ‌ట్టుకు ఎదుర‌య్యే స‌వాళ్లు ద్వితీయార్ధానికి ప్రధాన బ‌లం. అయితే జాతీయ స్థాయి పోటీల‌కి వెళ్లిన ఓ రాష్ట్ర జ‌ట్టు కిడ్నాప్‌కు గుర‌యితే, అది బ‌య‌టికి పొక్కకుండా ఉండ‌టం, ఆ జ‌ట్టు కోసం కోచ్ ఒక్కడే పోరాడ‌టం అనేది లాజిక్‌కి దూరంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. మాక‌న్ సింగ్‌, కార్తీక్‌కు మ‌ధ్య న‌డిచే ఆ ఎపిసోడ్ ఉత్కంఠ‌గా రేకెత్తించేలా తెర‌కెక్కించాల్సి ఉన్నప్పటికీ ఆ స‌న్నివేశాల‌న్నీ చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తాయి. మ‌ధ్యలో ప్రత్యేక గీతం కూడా జోడించారు. ప‌తాక స‌న్నివేశాలు గోపీచంద్ మార్క్ యాక్షన్‌ ఘ‌ట్టాల‌తోనూ, మ‌రోప‌క్క ఫైన‌ల్ క‌బ‌డ్డీ ఆట‌తోనూ సాగ‌డం మాస్ ప్రేక్షకుల‌తో సీటీ కొట్టేంచేలా చేస్తాయి. ఈ మాస్ మ‌సాలా క‌థ‌కు క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యం ప్రధాన బ‌లాన్నిచ్చించింది.

ఎవ‌రెలా చేశారంటే: గోపీచంద్‌కు అల‌వాటైన పాత్రే. కోచ్‌గా ఆయ‌న మ‌రింత హుషారుగా... మేన్లీగా క‌నిపిస్తారు. యాక్షన్ ఘ‌ట్టాల్లో ఎప్పట్లాగే ఆక‌ట్టుకున్నారు. జ్వాలారెడ్డిగా త‌మ‌న్నా తెలంగాణ యాస మాట్లాడుతూ న‌వ్వించింది. ఆమె అందంతోనూ ఆక‌ట్టుకుంది. జ్వాలారెడ్డి పాట సినిమాకు ప్రధాన ఆకర్షణ‌గా నిలిచింది. రావు ర‌మేశ్ ఊరి ప్రెసిడెంట్‌గా క‌నిపిస్తాడు. బీపీ, కొలెస్ట్రాల్ అంటూ ఆయ‌న చెప్పే సంభాష‌ణ‌లు న‌వ్విస్తాయి. త‌రుణ్ అరోరా భ‌యంక‌ర‌క‌మైన విల‌న్‌గా క‌నిపించినా ఆ పాత్ర క‌థ‌పై పెద్దగా ప్రభావం చూపించ‌దు. దిగంగ‌న సూర్యవంశీ, భూమిక, రెహ్మాన్, పోసాని కృష్ణముర‌ళి త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేరకు న‌టించారు. సాంక‌తికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సౌంద‌ర్ రాజ‌న్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి హైలైట్‌. మ‌ణిశ‌ర్మ పాట‌ల్లో సీటీమార్‌, జ్వాలారెడ్డి అల‌రిస్తాయి. వాటి చిత్రీకరణ కూడా ఆక‌ట్టుకుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ద‌ర్శకుడు సంప‌త్ నంది మాస్ కొల‌త‌ల‌తో ప‌క్కాగా చిత్రాన్ని తీర్చిదిద్దాడు. క‌థ‌నంపై మ‌రింత‌గా దృష్టిపెట్టాల్సింది. మాట‌లు ఆక‌ట్టుకుంటాయి.

seetimaarr telugu movie
'సీటీమార్' మూవీ

బలాలు

+ క‌బ‌డ్డీ నేప‌థ్యం

+ గోపీచంద్ - త‌మ‌న్నా

+ ప్రథమార్ధం, మాస్ అంశాలు

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌నం

- ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టు సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా: సీటీమా(ర్‌)స్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.