ETV Bharat / sitara

'సినిమాకు ఏదైనా తిరిగి ఇవ్వాలనేది నా కల!'

author img

By

Published : May 22, 2021, 5:32 AM IST

రాబోయే తరాలకు సినీ పరిశ్రమ అంటే తెలిసే విధంగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు కథానాయకుడు అక్కినేని నాగార్జున కృషి చేస్తున్నారు. తెలుగు సినిమాకు తాను ఇవ్వాలనుకున్నది ఇదేనని.. మ్యూజియం ఏర్పాటు చేయడం తన కల భావిస్తున్నట్లు తెలిపారు.

Nagarjuna dream to build a cinema museum
'సినిమాకు ఏదైనా తిరిగి ఇవ్వాలనేది నా కల!'

లాక్‌డౌన్ సమ‌యంలో కొంద‌రు న‌టులు త‌దుప‌రి చిత్రాల గురించి ఆలోచిస్తుంటే నాగార్జున భ‌విష్య‌త్తు త‌రాల‌కు తెలుగు సినిమా ఖ్యాతిని తెలియ‌జేసే ప్ర‌యత్నంలో ఉన్నారు. దాని కోసం ఓ మ్యూజియం నెల‌కొల్ప‌నున్నారు. ఆ వివ‌రాలు ఓ ఆంగ్ల మీడియాతో ఇలా పంచుకున్నారు.

"2019లో అన్న‌పూర్ణ స్టూడియోలో చ‌ల‌న చిత్ర సంర‌క్ష‌ణ‌, పున‌రుద్ధ‌ర‌ణ అనే వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించాం. మా స్టూడియోలో (అన్న‌పూర్ణ‌) ఉన్న సాంకేతికత‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ క్ష‌ణమే ఆణిముత్యాల్లాంటి మ‌న తెలుగు సినిమాల కోసం ఓ మ్యూజియం ఎందుకు నిర్మించ‌కూడ‌దు? అనే ప్ర‌శ్న మ‌దిలో మెదిలింది. వెంట‌నే సంబంధిత వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డాను. దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఆర్కివిస్ట్‌ల‌ను సంప్ర‌దించాను. కొవిడ్ సంక్షోభం వ‌ల్ల ఈ ప్రాజెక్టు ఆల‌స్య‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం మ్యూజియంకు కావాల్సిన వ‌స్తువుల్ని సేక‌రించే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. సినిమా ఓ క‌ళ‌. ఇత‌ర క‌ళ‌ల‌కు సంబంధించి గ్రంథాల‌యాలు, మ్యూజియం ఉన్న‌ట్టుగానే సినిమానూ కాపాడుకునేందుకు ఉండాలి. మా నాన్న గారు (అక్కినేని నాగేశ్వ‌ర‌రావు) మూకీ చిత్రాల కాలంలో న‌టుడిగా మారారు. సినిమా.. మాట‌లు లేని స్థాయి నుంచి ఇప్పుడు ఎంతో అభివృద్ది చెందింది. ఈ రోజు మ‌నకు కావాల్సిన‌న్ని వ‌న‌రులు అందుబాటులో ఉన్నాయి. మ‌నం సినిమాకు ఏదైనా తిరిగి ఇవ్వాలి. మ్యూజియం ఏర్పాటు చేయ‌డ‌మే తెలుగు సినిమాకు మ‌నం ఇవ్వ‌గ‌లిగింది. అదే నా క‌ల‌".

- నాగార్జున, అగ్రకథానాయకుడు

సినిమా విష‌యంలోనూ అంతే..

"యువ తరానికి (యంగ‌ర్ జన‌రేష‌న్) తెలుగు క్లాసిక్స్ గురించి పెద్ద‌గా తెలీదు. అలాంటి వారికి తెలుగు సినిమా ఎలా ప‌రిణామం చెందిందో సాంకేతిక‌త ద్వారానే తెలియ‌జేయడం సుల‌భం. ఎందుకంటే దేని గురించి అయినా వివ‌రాలు కావాలంటే ఎవ‌రూ పుస్త‌కాల్లో వెత‌కట్లేదు. ఏ స‌మాచారం కావాల‌న్నా ఆన్‌లైన్‌లో వీడియోలు చూసి తెలుసుకుంటున్నారు. సినిమా విష‌యంలోనూ అదే ప‌రిస్థితి ఉంది. మాకు సినిమాలు తీయ‌డం మాత్ర‌మే తెలుసు. వాటిని సేవ్ చేయాల‌ని ఎప్పుడైనా అనుకున్నా రోజువారీ పనుల‌తో మ‌ర్చిపోతుంటాం. మా నాన్న సుమారు 300 సినిమాల్లో న‌టించారు. వాట‌న్నింటినీ దాయ‌లేదు. టెక్నాల‌జీ సాయంతో వాటిల్లో కొన్ని క్లాసిక్ చిత్రాల్ని సేవ్ చేయ‌గ‌లిగాం" అని నాగ్​ చెప్పారు.

ఇదీ చూడండి.. 'మా కుటుంబానికి ఆపద్బాంధవుడు చిరంజీవి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.