ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

author img

By

Published : Oct 16, 2021, 12:10 PM IST

Updated : Oct 16, 2021, 5:24 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధితోపాటు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన.. అసెంబ్లీ, పార్లమెంట్ తరహాలో జరిగిన ఎన్నికల్లో 10 రోజుల ముందే మంచు విష్ణు గెలుస్తాడని మోహన్ బాబుకు చెప్పినట్లు గుర్తుచేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మంచు విష్ణుతోపాటు అతని కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. మా అసోసియేషన్ లో రాజకీయాలు ఉండకూడదన్న మోహన్ బాబు.. పగలు, ద్వేషాలు పక్కనపెట్టి ఐక్యంగా కృషి చేయాలని కోరారు. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వాలని సూచించారు.

manchu vishnu taking oath as maa president
మంచు విష్ణు

తెలుగు సినీ పరిశ్రమలో గత నాలుగు మాసాలుగా ఉత్కంఠ రేకెత్తిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. 2021-23 సంవత్సరానికిగాను మా అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన విష్ణు ప్యానల్ సభ్యులతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట అధ్యక్షుడిగా మంచు విష్ణుతో ప్రమాణస్వీకారం చేయించగా... ఆ తర్వాత కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జనరల్ సెక్రటరీగా గెలిచిన రఘుబాబు ఆలస్యంగా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈసీ సభ్యుడిగా గెలిచిన సంపూర్ణేశ్ బాబు ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యాడు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీనియర్ నటులు మోహన్ బాబుతోపాటు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, నిర్మాతలు సి.కల్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సహా పలువురు ప్రముఖులు హాజరై మా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

కృషి చేయాలి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకరిస్తామని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరిగాయన్న శ్రీనివాస యాదవ్.... మోహన్ బాబు తన వయస్సు, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా కుమారుడి గెలుపు కోసం కృషి చేశారని కొనియాడారు. మా అంటే పెద్ద వ్యవస్థగా పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని, అందుకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు చేపడుతున్నట్లు తలసాని తెలిపారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలోని కార్మికులంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారందరికి ప్రభుత్వ తరపున సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. విష్ణు మా అధ్యక్షుడిగా మాత్రమే కాదని, యావత్ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు ఆహ్వానించి మా అసోసియేషన్ తోపాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తలసాని ప్రకటించారు.

రాజకీయాలు ఉండకూడదు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళాకారుల వేదికని, ఇక్కడ రాజకీయాలు ఉండకూదని మోహన్ బాబు సూచించారు. ఒకరి దయాదాక్షణ్యాలపై సినీ పరిశ్రమ ఆధారపడి లేదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రతిభ ఉన్నవాళ్లకే ఇక్కడ చోటుందన్న మోహన్ బాబు.. మా ఎన్నికల్లో తన బిడ్డను గెలిపించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. మా అసోసియేషన్ లో పగలు, ద్వేశాలు వద్దని హితవు పలికారు. ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్న వాళ్లు అసోసియేషన్ తో సంబంధం లేదనుకోవద్దని సూచించారు. మా అధ్యక్ష పదవి చిన్న ఉద్యోగం కాదని, ఒక పెద్ద బాధ్యతగా పేర్కొన్న మోహన్ బాబు... ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి గౌరవం ఇవ్వాలని కోరారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కళాకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. SPOT+byte

అన్ని విధాలా శ్రమిస్తాం

మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.... రానున్న రెండేళ్లలో మోహన్ బాబు కుమారుడిగా మా అసోసియేషన్ ఏం చేస్తానో నిరూపిస్తానన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయడం దురదృష్టకరమన్న విష్ణు... మా అసోసియేషన్ ను బలంగా తీర్చిదిద్దేందుకు వాళ్ల సలహాలు కూడా తీసుకుంటానన్నారు. మా అభివృద్ధి కోసం అన్ని విధాల శ్రమిస్తానన్నారు.

ఆఖరి శ్వాస వరకు

మా ఎన్నికల్లో గెలిచిన మంచు కమిటీ మంచి కమిటీగా అభివర్ణించిన మా పూర్వ అధ్యక్షుడు నరేష్.... మా అభివృద్ధి కోసం ఆరేళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను విష్ణు సంపూర్ణంగా అమలు చేస్తాడని నరేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ లో పదవుల కోసం కాకుండా బాధ్యతల కోసం విష్ణు వెంట ఉంటానన్న నరేష్.... విష్ణు మా రిపోర్ట్ కార్డ్ ను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. తన ఆఖరి శ్వాస వరకు మా ఉన్నతి కోసం పాటుపడుతానని తెలిపారు. SPOT+byte

ప్రమాణస్వీకారానికి ముందు మంచు విష్ణు, అతని కార్యవర్గ సభ్యులు ఫిల్మ్ చాంబర్ లోని మా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా పూర్వ అధ్యక్షుడు నరేష్... మంచు విష్ణుకు అధికారికంగా అసోసియేషన్ బాధ్యతలను అప్పగించారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 16, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.