Maa elections 2021: చిరంజీవి నన్ను తప్పుకోమని చెప్పారు: విష్ణు

author img

By

Published : Oct 11, 2021, 9:16 PM IST

Updated : Oct 11, 2021, 9:57 PM IST

manchu vishnu on MAA elections 2021

'మా' ఎన్నికల తుది ఫలితాల తర్వాత విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోమని కోరినట్లు చెప్పారు.

మూడు నెలల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణానిక శంకుస్థాపన చేయనున్నట్లు ఆ అసోసియేషన్​కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచతప్పకుండా అమలు చేస్తానని తెలిపారు. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవితోపాటు కీలక పోస్టులన్ని తన ప్యానల్ సభ్యులనే గెలిపించుకున్న మంచు విష్ణు.. 'మా' సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్​ల రాజీనామాలను ఆమోదించబోనని స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో తనను తప్పుకోమని మెగాస్టార్ చిరంజీవే స్వయంగా ఫోన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 2021-23 సంవత్సరానికి ఈ అసోసియేషన్​కు పనిచేసే నూతన కార్యవర్గం ఖరారైంది. అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​పై మంచు విష్ణు ఘన విజయం సాధించగా.. తన ప్యానల్ సభ్యులు కూడా కీలక పదవులను కైవసం చేసుకున్నారు. మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యుల్లో మంచు విష్ణు ప్యానల్ 10 ఈసీ సభ్యులతోపాటు జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ పదవులను దక్కించుకున్నారు. ప్రకాశ్​రాజ్ ప్యానల్ నుంచి 8 మంది ఈసీ సభ్యులు గెలువగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్​గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, మరో వైస్ ప్రెసిడెంట్​గా బెనర్జీ గెలిచారు. మా ఎన్నికల్లో అత్యధికంగా అధ్యక్షుడిగా మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా.. వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన మాదాల రవి 376 ఓట్లు సాధించి తర్వాత స్థానంలో నిలిచారు. వీరందరితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న మంచు విష్ణు.. త్వరలోనే ప్రమాణస్వీకారం చేసి మూడు నెలల్లో మా అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్, నాగబాబులపై స్పందించిన మంచు విష్ణు.. వారి రాజీనామాలను ఆమోదించబోనని స్పష్టం చేశారు. తమ కుటుంబసభ్యుల్లో ఒకరైన నాగబాబు.. మనసుకు కష్టం వల్లనో లేక ఆవేశం వల్లనో తీసుకున్న నిర్ణయమని, త్వరలోనా వారిద్దరిని కలిసి ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు.

మా ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుపట్టడంతో పోటీలో నిల్చొని గెలిచానని విష్ణు స్పష్టం చేశారు. అలాగే తన మిత్రుడు రామ్ చరణ్ తనకు ఓటు వేయలేదని తెలిపారు. తన తండ్రి చిరంజీవి మాటకు కట్టుబడి ప్రకాశ్ రాజ్ కే ఓటు వేశారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మా అసోసియేషన్ ప్రపంచంగా నమ్ముకున్న వాళ్ల కోసం సేవ చేయడానికి వచ్చినట్లు స్పష్టం చేసిన మంచు విష్ణు.. ఈ అసోసియేషన్ కోసం అభివృద్ధి ఆట మొదలైందని చమత్కరించారు. తాను సినీ పరిశ్రమ వైపే ఉంటానన్న విష్ణు.. ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి సినీ పరిశ్రమను ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 11, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.