వాట్సాప్ కమ్యూనిటీ x వాట్సాప్ గ్రూప్... రెండిటి మధ్య తేడాలు మీకు తెలుసా?

author img

By

Published : Mar 6, 2023, 11:41 AM IST

whatsapp-community-vs-whatsapp-group

వాట్సాప్ గ్రూప్​, వాట్సాప్​ కమ్యూనిటీస్ గురించి మీకు పూర్తిగా తెలుసా? వాటి మధ్య తేడాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? రెండిట్లో ఉండే మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించే సోషల్​ మీడియా యాప్స్​లో.. 'వాట్సాప్'​ టాప్​ ప్లేస్​లో ఉంటుంది. ఈ వాట్సాప్​ ఉండే గ్రూప్​ల గురించి అందరికీ తెలిసిన విషయమే. పొద్దున్న లేచింది మొదలు.. మనకు వాట్సాప్​లో ఉన్న స్కూల్​, కాలేజీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్​, బిజినెస్​ లాంటి గ్రూప్స్​లో ఏ మెసేజ్​లు వచ్చాయో చూస్తూనే ఉంటాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ గురించి అయితే అందరికీ తెలుసు కానీ.. వాట్సాప్ కమ్యూనిటీ గురించి కొందరికి మాత్రమే ఐడియా ఉంటుంది. మరి ఈ రెండు ఒకేలా అనిపించినా వీటి మధ్య చాలా తేడా ఉంది. మరి వాట్సాప్​ గ్రూప్స్, కమ్యూనిటీల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందామా!

వాట్సాప్​ గ్రూప్​, వాట్సాప్ కమ్యునిటీ ఈ రెండూ ఒకే సారి అనేక మంది వ్యక్తులతో అనుసంధానం అవ్వడానికి ఉపయోగపడతాయి. చాలా మంది ఈ రెండూ ఒకేలా పని చేస్తాయి అనుకుంటారు. నిజానికి ఈ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వాట్సాప్​ గ్రూప్​లో అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్​, సహోద్యోగులతో కలిసి ఒక గ్రూప్​గా ఏర్పాటు చేసుకుని వారితో అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే, వాట్సాప్ కమ్యూనిటీస్​లో అయితే ఒకేసారి కొన్ని గ్రూప్స్​ని కలిపి ఓ కమ్యూనిటీగా చేసి వారితో తమ సందేశాలను, అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుసుకుందాం రండి!

వాట్సాప్​ గ్రూప్​:
ఫ్యామిలీ, ఫ్రెండ్స్​, సహోద్యోగులతో కలిసి వారితో అభిప్రాయాలు పంచుకోవడానికి వీలుగా వాట్సాప్​లో గ్రూప్స్ క్రియేట్​ చేసుకోవచ్చు. దీంతో మనం చెప్పాలనుకునే విషయం ఒకేసారి గ్రూప్​లో ఉన్న అందరికీ చేరుతుంది. ప్రస్తుతం ఒక్కో వాట్సాప్​ గ్రూపులో 1,024 మందిని సభ్యులుగా చేర్చుకునే అవకాశం ఉంది.

వాట్సాప్ కమ్యూనిటీస్ ప్రత్యేక ఎంటి?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి వాట్సాప్​లో అనేక గ్రూప్స్ ఉంటున్నాయి. ఆయా గ్రూప్స్​లో ఉన్న అందరికీ ఒకేసారి ఏదైనా సమాచారం పంపించాలి అంటే.. ప్రతి గ్రూప్​ను సెలక్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అన్ని గ్రూప్​లకు ఒకేసారి అనుకున్న మెసేజ్​ను పంపేందుకు వీలుగా వాట్సాప్ కమ్యూనిటీస్​ అనే కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. ఇది గత కొన్ని నెలలుగా వాట్సాప్​ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కమ్యూనిటీస్​లో 50 గ్రూప్​లను యాడ్​ చేయవచ్చు. దీంతో మనం క్రియేట్​ చేసిన వాట్సాప్ కమ్యూనిటీస్​లో ఏదైనా మెసేజ్ షేర్​​ చేస్తే అది అందులో ఉన్న అన్ని గ్రూప్​లకు చేరుతుంది. ఈ కమ్యూనిటీస్​ ఫీచర్​తో ఒకేసారి ఎక్కువ మందికి సమాచారాన్ని సులువుగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీస్​లో ఉన్న ఒక గ్రూప్​లోని సభ్యులు మరొక గ్రూప్ సభ్యులతో మాట్లాడాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీస్ అడ్మిన్​పై ఆధారపడి ఉంటుంది.

గ్రూప్​, కమ్యునిటీస్ మధ్య తేడా ఏంటంటే?
1.సభ్యుల సంఖ్య..
వాట్సాప్ 2022 నవంబర్​లో గ్రూప్​లో గరిష్ఠ సభ్యుల సంఖ్యను 1024కు పెంచింది. దీంతో ఏదైనా ఒక గ్రూప్​లో 1024 మంది సభ్యులు ఉండే ఛాన్సు ఉంటుంది. అదే వాట్సాప్​ కమ్యూనిటీస్​లో అయితే ఒకేసారి 50 గ్రూప్​లను యాడ్​ చేసి వేల మందిని ఒకే గొడుగు కిందకు తీసుకురావచ్చు.

2.కంటెంట్ షేరింగ్​..
కంటెంట్​ షేరింగ్ విషయంలో కమ్యూనిటీస్​, గ్రూప్స్​కు మధ్య చాలా తేడా ఉంటుంది. మెసేజ్​లు, టెక్ట్స్​, వీడియో, ఆడియోలను యూజర్ గ్రూప్​లో పంపించవచ్చు. దీనిపై గ్రూప్​ సభ్యులు వారి స్పందనలు తెలపొచ్చు. ఉమ్మడిగా చర్చలు సైతం జరపవచ్చు. అది అడ్మిన్​ విధించే పరిమితులపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీస్​ను.. ప్రధానంగా సభ్యులందరికి అప్​డేట్​ ఇవ్వడం కోసమే క్రియేట్​ చేశారు. మెసేజ్​లు, ​టెక్ట్స్​, వీడియో, ఆడియోలను పంపించడం వంటివి.. కేవలం అడ్మిన్​ మాత్రమే చేయగలుగుతాడు. దీన్ని సభ్యులు చూడగలుతారు. అడ్మిన్​ ఇచ్చిన మెసేజ్​కు సభ్యులు రిప్లే ఇవ్వలేరు. కానీ పర్సనల్​గా రిప్లే ఇచ్చుకోవచ్చు.

3. ప్రైవసీ..
వాట్సాప్ గ్రూప్​లో అయితే ప్రైవసీ సెట్టింగ్​లను మార్చుకోవచ్చు. వాట్సాప్ కమ్యూనిటీలో ప్రైవసీ సెట్టింగ్​లు మార్చేందుకు వీలుకాదు. గ్రూప్​లో ఎవరెవరున్నారో.. వారి నంబర్​ను చూసే వీలుంటుంది. నంబర్స్​ను సేవ్​ కూడా చేసుకోవచ్చు. కానీ వాట్సాప్​ కమ్యూనిటీస్​లో మాత్రం నంబర్​ చూసేందుకు, వాటిని సేవ్ చేసేందుకు వీలుండదు.

4. ఫీచర్లు..
గ్రూప్​లో అయితే ప్రతి ఒక్కరు ఇతరులతో కనెక్ట్ కావచ్చు. అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, లొకేషన్​, డాక్యుమెంట్లను సభ్యులు షేర్​ చేయోచ్చు. మెసేజ్​లను ఫార్​వర్డ్​ కూడా చేయొచ్చు. వాట్సాప్ కమ్యూనిటీస్​లో మాత్రం ఈ విషయంలో పరిమితులు ఉంటాయి. ఇందులో అడ్మిన్​ మాత్రమే ఏదైనా షేర్​ చేయగలడు. సభ్యులకు సూచనలు, హెచ్చరికలు చేయగలడు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్​, లొకోషన్​లను కేవలం అడ్మిన్​ మాత్రమే పంపే అవకాశం ఉంటుంది.
గ్రూప్​లో ఎంతమందైనా అడ్మిన్​గా వ్యవహరించవచ్చు. కమ్యూనిటీస్​లో మాత్రం 20 మందిని మాత్రమే అడ్మిన్​గా ఉండే అవకాశం ఉంది.

5. కాలింగ్​ ఫీచర్​..
గ్రూప్​లో వాయిస్​ కాల్స్​, వీడియో కాల్స్​ మాట్లాడుకోవచ్చు. గరిష్ఠంగా ఎనిమిది మందితో ఈ సంభాషణ జరపొచ్చు. వాట్సాప్ కాల్‌లో ఉన్నప్పుడు.. యూజర్​ మెసేజ్​లను పంపవచ్చు, వీడియోను పాజ్ కూడా చేయవచ్చు. కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయకుండానే స్క్రీన్‌ను మినిమైజ్​ చేయవచ్చు. మిగతా యాప్‌లకు నావిగేట్ చేయవచ్చు. కమ్యూనిటీస్​లో ఆడియో కాల్​, వీడియో కాల్​ సౌకర్యం ఉండదు. అడ్మిన్ కేవలం తన మెసేజ్​లను మాత్రమే సభ్యులకు షేర్​ చేయగలుగుతాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.