ETV Bharat / science-and-technology

Smartphone Security Tips : స్మార్ట్​ఫోన్​ను వాలెట్​లా వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి​!

author img

By

Published : Aug 16, 2023, 4:54 PM IST

Smartphone Security Tips In Telugu : స్మార్ట్​ఫోన్లు నేడు వాలెట్స్​ మాదిరిగా మారిపోయాయి. మన వ్యక్తిగత వివరాలు, కీలకమైన డాక్యుమెంట్లు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు అన్నీ డిజిటల్ కాపీల రూపంలో ఫోన్లలో సేవ్​ చేసుకుంటున్నాం. కానీ ఇది చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మన స్మార్ట్​ఫోన్​లోని సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. అలాగే మన బ్యాంకు ఖాతాలను కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది. మరి ఈ సైబర్​ దాడుల నుంచి మన స్మార్ట్​ఫోన్లను.. అలాగే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దామా?

Smartphone Security guidelines
Smartphone Security Tips

Smartphone Security Tips : ఈ సాంకేతిక యుగంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్ ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి స్మార్ట్​ఫోన్​​ లేని వ్యక్తులు అరుదు అంటే.. అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ స్మార్ట్​ఫోనుల్లో మన వ్యక్తిగత డేటా చాలా ఉంటుంది. ఇదే సైబర్​ నేరగాళ్లకు వరంగా మారింది.

వాలెట్​లా వాడేస్తున్నారు!
Smartphone Security Risks : నేడు చాలా మంది తమ స్మార్ట్​ఫోన్​లను వాలెట్​లా ఉపయోగిస్తున్నారు. బ్యాంక్​ యూజర్​నేమ్​, పాస్​వర్డ్; క్రెడిట్​ కార్డులు​, డెబిట్​ కార్డులు, మెంబర్​షిప్​ కార్డులు, ఆధార్​, పాన్​ లాంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, ట్రాన్స్​పోర్టేషన్​ టికెట్స్..​ తదితర ముఖ్యమైన పత్రాల డిజిటల్ కాపీలను తమ స్మార్ట్​ఫోన్లలో సేవ్​ చేసి పెట్టుకుంటున్నారు. తమ పర్సులో ఫిజికల్​ ప్లాస్టిక్​ కార్డులు పెట్టడం కన్నా, స్మార్ట్​ఫోన్​లో డిజిటల్​ కాపీలు ఉంచుకోవడం.. సౌకర్యవంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే ఇది చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఆన్​లైన్ మోసగాళ్లు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, NFC హ్యాకింగ్​ నుంచి ఫిషింగ్​ లింక్స్​ పంపడం వరకు వివిధ రకాలైన సైబర్​ దాడులకు పాల్పడుతున్నారు. తమ వలలో చిక్కుకున్న బాధితుల డేటా చోరీ చేస్తున్నారు. అంతే కాకుండా వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఈ విధంగా బాధితులను మానసిక వేదనకు గురిచేస్తున్నారు. అందుకే మన స్మార్ట్​ఫోన్​లో.. కీలకమైన వ్యక్తిగత, ఆర్థిక విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్టోర్​ చేసి ఉంచుకోకూడదు. చూశారుగా.. ఇప్పుడు మనం ఏయే విషయాలను స్మార్ట్​ఫోన్​లో స్టోర్​ చేసుకోకూడదో తెలుసుకుందాం.

1. కీలకమైన పాస్​వర్డ్స్
Smartphone Security Threats : చాలా మంది తమ ఈ-మెయిల్​​, సోషల్ ​మీడియా, బ్యాంకు అకౌంట్స్​కు చెందిన పాస్​వర్డ్స్​ను తమ స్మార్ట్​ఫోన్​లో సేవ్​ చేసుకుని ఉంటారు. ఒక వేళ పొరపాటున ఆ ఫోన్​ను ఎవరైనా దొంగిలించినా, లేదా సైబర్​ దాటికి గురైనా.. ఇక అంతే సంగతులు. మీ డేటా మొత్తం సైబర్​ కేటుగాళ్ల చేతికి చిక్కుతుంది. అలాగే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం గల్లంతు అవుతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త!

వాస్తవానికి స్మార్ట్​ఫోన్​ లాగిన్​ కోసం స్ట్రాంగ్​ పాస్​వర్డ్స్​ను రూపొందించుకోవాలి. అలాగే వాటిని తరచూ మారుస్తూ ఉండాలి. అప్పుడే మీ అకౌంట్స్​ అన్నీ సురక్షితంగా ఉంటాయి. అలా కాకుండా.. వీక్​ కాంబినేషన్​ పాస్​వర్డ్స్​ పెట్టినా, లేక వాటినే కొంచెం అటూఇటూ మార్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక వేళ మీరు తరచుగా పాస్​వర్డ్స్ మరిచిపోతూ ఉన్నట్లయితే.. సెక్యూర్​ పాస్​వర్డ్​ మేనేజర్​ను ఉపయోగించండి. ఇవి మీ పాస్​వర్డ్స్​ను ఎన్​క్రిప్ట్​ చేసి ఉంచుతాయి. మీరు తప్ప మరెవరూ వీటిని యాక్సెస్​ చేయకుండా కాపాడతాయి. మీరు కేవలం ఈ మాస్టర్​ పాస్​వర్డ్​ గుర్తుంచుకుంటే సరిపోతుంది.

2. మీ ఇంటి చిరునామా​
How To Prevent Cyber Crime : మనలో చాలా మంది.. ఇంటి అడ్రస్​ను ఫోన్​లో సేవ్​ చేసుకుని ఉంటాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. కొన్ని సార్లు సైబర్​ నేరగాళ్లు.. మీ అడ్రస్​ బుక్​, బిల్లింగ్​ స్టేట్​మెంట్స్​, యుటిలిటీ బిల్స్​ ఆధారంగా మీ ఇంటి చిరునామాను కనిపెడతారు. ఇది కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. సాధారణంగా ఈ కేటుగాళ్లు మీ ఇంటివాళ్లను బెదిరిస్తూ సందేశాలు పంపిస్తూ ఉంటారు. లేదా మిమ్మల్ని వెంబడించడం లేదా నేరుగా మీ ఇంటికే వచ్చి దాడిచేయడం చేస్తుంటారు. అందుకే ఫోన్​లో మీ ఇంటి చిరునామాను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్​ చేసుకోకపోవడం మంచిది.

3. మీ స్నేహితుల, బంధువుల నంబర్స్​!
How To Protect Contact List From Hackers : సాధారణంగా మనం స్నేహితుల, బంధువుల, ప్రేమికుల నంబర్లను.. ప్రత్యేకమైన లేబుళ్లతో ఫోన్​లో సేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే.. సైబర్​ నేరగాళ్లు 'మీ గుర్తింపు'ను కూడా దొంగిలించే ప్రమాదం ఉంది. ఈ కేటుగాళ్లు మీలానే నటిస్తూ.. మీ బంధువులను, స్నేహితులను, ప్రియమైన వారిని మోసగించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ ఫోన్లలో అమ్మ, నాన్న, మై లవ్​, హబ్బీ, సిస్టర్​ లాంటి పేర్లతో కాంటాక్ట్​ నంబర్లను సేవ్​ చేసుకోకూడదు. వాటికి బదులుగా వారి నిజమైన పేర్లతో మాత్రమే సేవ్​ చేసుకోవడం ఉత్తమం.

4. ప్రభుత్వ గుర్తింపు పత్రాలు
How To Protect Govt IDs : ప్రభుత్వ గుర్తింపు పత్రాలు సాధారణంగా ప్లాస్టిక్ కార్డుల రూపంలో లేదా పత్రాల రూపంలో ఉంటాయి. వీటిని మనతోపాటు తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే మనం వాటి డిజిటల్​ కాపీలను లేదా ఫొటోలను ఫోన్లలో సేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది కూడా చాలా ప్రమాదకరం. మన ఐడెంటిటీ (గుర్తింపు)ను దొంగిలించే సైబర్​ నేరగాళ్లు ఉంటారు. వీరు మన ఐడీ కార్డులతో.. టాక్స్​ రిటర్న్​లను దొంగిలిస్తారు. అలాగే మన పేరుతో అక్రమంగా బ్యాంకు లోన్స్​లు తీసుకుంటారు. లేదా తప్పుడు పనులకు మన గుర్తింపు కార్డులను వాడుకుంటారు. దీని వల్ల మనం ఆర్థిక నష్టానికి గురికావడమే కాకుండా.. చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

5. సోషల్​ మీడియా ఖాతాల నుంచి Logout కాకపోవడం
Mobile Device Security : మనం స్మార్ట్​ఫోన్​లో చాలా సోషల్​ మీడియా యాప్స్ వాడుతూ ఉంటాం. కానీ వాటిని వాడిన తరువాత లాగ్​అవుట్ కావడం మాత్రం మరిచిపోతూ ఉంటాం. లేదా నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటాం. కానీ ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒక వేళ మీ ఫోన్ ఇతరుల చేతికి చిక్కితే.. అందులోని చాలా కీలకమైన డేటా వాళ్లకు చేరిపోతుంది. అలాగే వాళ్లు బ్యాక్ఎండ్​లో ఉండి.. మీ ఆన్​లైన్​ యాక్టివిటీని మొత్తం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. అందుకే మీరు కచ్చితంగా యాప్స్​ వాడిన తరువాత వాటి నుంచి లాగ్​అవుట్​ కావాలి. ఒక వేళ మీరు నిరంతరంగా యాప్స్ వాడాల్సి వస్తే.. ఇతరులు ఎవ్వరూ మీ అకౌంట్​ను యాక్సెస్​ చేయలేని విధంగా.. స్ట్రాంగ్​ పాస్​వర్డ్స్​ పెట్టుకోవాలి. అలాగే కీలకమైన సెట్టింగ్స్​ కూడా మార్చుకోవాలి.

6. బ్యాంక్​ అకౌంట్​ నంబర్స్​ అండ్​ పిన్స్​
How To Protect Bank Account From Hackers : నేడు పెద్దగా ఎవ్వరూ ఇంటిలోని ఇనుప బీరువాలో డబ్బులు దాచుకోవడం లేదు. బ్యాంకు అకౌంట్స్​లోనో, లేదా డీమాట్ ఖాతాల్లోనే డబ్బులు పొదుపు లేదా మదుపు చేసుకుంటున్నారు. అయితే వీటి అకౌంట్​ నంబర్లు, పిన్​, పాస్​వర్డ్స్​ను.. ఫోన్లలో సేవ్​ చేసుకుంటున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. అలాగే బ్యాంకింగ్ యాప్స్​, ఫైనాన్స్ యాప్స్ వాడుతున్నారు. వీటికి వీక్​ పిన్స్​ సెట్​ చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రమాదకరమే. అందుకే వీటిని గుర్తు పెట్టుకోవడం గానీ, లేదా ఒక పుస్తకంలో రాసుకోవడం గానీ మంచిది.

7. ఫింగర్​ప్రింట్​ అండ్​ ఫేసియల్​ రికగ్నిషన్​ స్కాన్స్​
Mobile Device Security Strategy : టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత పాస్​వర్డ్స్​ కన్నా ఫింగర్​ప్రింట్​, ఫేసియల్​ రికగ్నిషన్​ టెక్నాలజీల వాడకం బాగా పెరిగింది. కానీ వీటిని హ్యాకర్స్ చాలా సులభంగా.. ఛేదించే అవకాశం ఉంది. అందుకే వీటికి బదులుగా అక్షరాలు, అంకెలు, స్పెషల్​ క్యారెక్టర్స్​ కాంబినేషన్​తో స్ట్రాంగ్​ పాస్​వర్డ్స్ క్రియేట్​ చేసుకుని, ఉపయోగించడం మంచిది.

8. ప్రైవేట్ ఫొటోస్​, వీడియోస్​
Cyber Security Tips : కొంత మంది .. తమ నగ్న శరీరాలతో ఫొటోలు లేదా వీడియోలు తీసుకొని ఫోన్​లో సేవ్​ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉన్నప్పటి దృశ్యాలను రికార్డ్ చేసుకుని, ఫోన్​లో ఉంచుకుంటారు. ఇది చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. ఒక వేళ ఇవి ఇతరులకు దొరికినట్లయితే.. వాళ్లు మిమ్మల్ని మానసిక వేధింపులకు గురిచేయవచ్చు. లేదా డబ్బులు కోసం మిమ్మల్ని బ్లాక్​మెయిల్​ కూడా చేయవచ్చు. కనుక ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

9. ఈ-మెయిల్స్, మెసేజెస్​
How To Protect Email From Hacking : ముఖ్యమైన ఈ-మెయిళ్లను, మెసేజ్​లను ఫోన్​లో సేవ్​ చేసుకోకూడదు. సైబర్​ క్రిమినల్స్ ప్రధానంగా టెక్స్ట్​ మెసేజ్​లు, ఈ-మెయిల్స్​లోని సమాచారాన్ని చాలా సులువుగా దొంగిలించగలరు. మీ గుర్తింపును కూడా దొంగిలించగలరు. అందుకే అవసరంలేని ఈ-మెయిళ్లను వెంటనే డిలీట్​ చేయాలి. తరచూ అకౌంట్ పాస్​వర్డ్స్​ మారుస్తూ ఉండాలి.

10. ముఖ్యమైన పత్రాలు
How To Protect Digital Documents : మనలో చాలా మంది కీలకమైన బ్యాంకు పత్రాలు, ఆస్తి పత్రాలు, ట్యాక్స్ రిటర్నులు, IRS ఫారమ్​లు, SSS నంబర్లు, తాము పనిచేస్తున్న కంపెనీ వివరాలు, వ్యక్తిగత వివరాలతో కూడిన కీలకమైన డాక్యుమెంట్లను స్మార్ట్​ఫోన్లలో భద్రపరుస్తూ ఉంటారు. కానీ చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. వీటిని సైబర్​ నేరగాళ్లు దొంగిలిస్తే.. మీరు ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

మరేమి చేయాలి?
How To Secure Mobile Devices : స్మార్ట్​ఫోన్లలో మన కీలకమైన డేటా ఏదీ ఉంచుకోకూడదు. అనవసరమైన, పాతబడిపోయిన ఫైళ్లను ఎప్పటికప్పుడు డిలీట్​ చేస్తూ ఉండాలి. ఒక వేళ మీ వ్యక్తిగత, ఆర్థికపరమైన డాక్యుమెంట్స్ ఉంటే, వాటికి మంచి స్ట్రాంగ్ పాస్​వర్డ్స్ పెట్టుకోండి. అలాగే ఆన్​లైన్​లో విచ్చలవిడిగా మీ వ్యక్తిగత సమాచారాన్ని అప్​లోడ్ చేయకూడదు. ఫ్రీ VPNలను వాడకకూడదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.