ETV Bharat / opinion

Women Reservation Bill : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు పార్లమెంట్​ పచ్చ జెండా.. నెక్స్ట్​ ఏంటి?.. అభ్యర్థులను ఖరారు చేసేయడమేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 10:16 PM IST

Updated : Sep 21, 2023, 10:22 PM IST

Women Reservation Bill : చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి రానుంది? ఎన్నికలకు మహిళా అభ్యర్థులను ఖరారు చేయడమే ఆలస్యమా? కేంద్రం ఏం చెబుతోంది?

Women Reservation Bil
Women Reservation Bil

Women Reservation Bill : చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దేశ మహిళలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బిల్లుకు పార్లమెంట్​ పచ్చ జెండా ఊపేసింది. తాజాగా రాజ్యసభలోనూ ఈ ఆమోదం పొందడం వల్ల మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరో అడుగు దూరంలోనే ఉంది. అయితే కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపిన ఈ బిల్లుకు.. రెండు రోజుల్లోనే ఉభయ సభలు ఆమోద ముద్ర వేయడం విశేషం.

నియోజకవర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే..
Women Reservation Bill In Parliament : అయితే నియోజకవర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఈ బిల్లులో కేంద్రం పొందుపరిచింది. 2027 కల్లా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు సాకారం అవుతాయని ప్రధాని మోదీ కూడా ఇటీవలే వెల్లడించారు. దాని ప్రకారం చూసుకుంటే 2027 నుంచి జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేసే వీలు ఉంటుంది.

2026 తర్వాత చేపట్టే తొలి జనగణన ఆధారంగానే..
2002లో ఆర్టికల్‌ 82కు చేసిన సవరణ ప్రకారం.. 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన ఆధారంగానే డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అలా అయితే 2031లోనే జనగణన ఉంటుంది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణను కొవిడ్‌ కారణంగా కేంద్రం వాయిదా వేసింది. ఇది ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా తెలియదు. 2026 తర్వాతే దీన్ని చేపట్టి నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

15 ఏళ్లు మాత్రమే..
2011లో ఫిబ్రవరి-మార్చిలో జనగణన చేపట్టిన కేంద్రం.. అదే ఏడాది మార్చి 31న ఆ గణాంకాలను విడుదల చేసింది. 2027లో ఆ ప్రక్రియ చేపడితే నెలల వ్యవధిలోనే అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్లు మాత్రమే అమల్లో ఉంటాయి. అవసరం అనుకుంటే ఆ తర్వాత కూడా వీటిని పొడిగించే అవకాశం పార్లమెంట్‌కు ఉంటుంది.
ఇప్పటిది కాదు..

Womens Reservation Bill History : అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో జేడీఎస్​ అధినేత హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్​లోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడం వల్ల అక్కడ బిల్లు మురిగిపోయింది. ఇప్పుడు 2023లో మోదీ సర్కార్.. ఈ బిల్లును ఉభయసభలు ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.

Last Updated :Sep 21, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.