ETV Bharat / opinion

భూతాపం... ఉరుముతున్న ఉపద్రవం

author img

By

Published : Apr 22, 2020, 1:01 PM IST

"భూమి మనిషి అవసరాలను తీరుస్తుంది కానీ దురాశలను కాదు" అన్నారు మహాత్మా గాంధీ. సమస్త జీవరాశులకు అనువైన జీవన వాతావరణాన్ని భూమండలం కల్పించింది. భూమి వేడెక్కుతోందన్న మాట అయిదు దశాబ్దాలుగా వింటున్నాం. ఆ క్రమంలో ఎన్నో జీవరాశులూ అంతరించిపోతున్నాయి. కానీ ఎవరూ దీనిపై దృష్టి పెట్టకపోవడమే విషాదం.

save nature and save future today world earth day
ఉరుముతున్న ఉపద్రవం భూతాపం

వాతావరణంలో పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలైన గ్రీన్‌హౌస్‌ వాయువులు కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, నీటి ఆవిరి, మీథేన్‌ తదితరాల వల్లే భూమి వేడెక్కుతోంది. భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ పెరిగితే దాని ప్రభావం వల్ల 22 నుంచి 30 శాతం వరకు వివిధ జీవరాశులు కనుమరుగవుతాయి. ఇదేకాక తాగునీటి కొరత నాలుగు నుంచి తొమ్మిది శాతానికి, ఆహార ఉత్పత్తి తరుగుదల మూడు నుంచి నాలుగు శాతానికి చేరుతుంది.

బహుముఖ సమస్యలు

భూమి వేడెక్కడం ధ్రువాల వద్ద మంచు కరుగుతుండటం తరముకొస్తున్న మరో ముప్పు. కిందటి శతాబ్దిలో దాదాపు 18 సెంటిమీటర్ల మేర సముద్రమట్టం పెరిగింది. అది 2100 సంవత్సరానికి వంద సెంటిమీటర్ల వరకు చేరవచ్చని అంచనా. సముద్రమట్టం పెరగడం వల్ల తుపానులు, వరదలు, వడగాడ్పులు, అడవుల దహనం వంటి అనర్థాలు సంభవిస్తాయి. సముద్ర మట్టాలు పెరిగితే అనేక దీవులు, ముంబయి, చెన్నై, విశాఖ వంటి తీరప్రాంత నగరాలు నీటిముంపు బారినపడి వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఫలితంగా 2150నాటికి వాతావరణ శరణార్థుల సంఖ్య 25కోట్లకు మించుతుందని అంచనా.

తగ్గించుకోవడమే తక్షణ మార్గం

ఆహారం, భూమి తదితర వనరుల కొరత కొత్త ఘర్షణలకు దారి తీయవచ్చు. పునరుత్పాదక ఇంధన వనరులు, సౌర, పవన, బయోమాస్‌, జియోథర్మల్‌ వంటివాటిని విరివిగా ఉపయోగించుకుని శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం) తగ్గించుకోవడమే తక్షణ మార్గం. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ నివేదిక ప్రకారం ఈ తరహా ఇంధన వాడకం 24.7 శాతమే ఉంది. మన దేశంలో ఈ పరిమాణం 17.3 శాతమే. 2050 నాటికి శిలాజ ఇంధన వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని 140 దేశాలు నిర్ణయించాయి. భారత్‌ సైతం 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 40 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకోసం ప్రైవేటురంగ సంస్థలతో స్థాపిత సమయంలో చేసుకునే ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వం గట్టి హామీ ఇవ్వాలి.

వ్యర్థాలు అధికంగా పేరుకుపోవడం వల్ల

సౌర ఫలకాల గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 23 శాతం నుంచి పెంచడానికి పరిశోధనల బాట పట్టాల్సి ఉంది. వ్యర్థాల వినియోగం ద్వారా ప్రపంచ విద్యుత్‌ సామర్థ్యాన్ని పది శాతం మేర పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఇది 0.5 శాతమైనా లేదు. ప్రపంచంలో ఏటా 200 కోట్ల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వ్యర్థాలు పోగవడం వల్ల నీరు, గాలి కలుషితమవుతున్నాయి. 99 శాతం ఘన వ్యర్థాల వినియోగం ద్వారా స్వీడన్‌ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వీటిలో విద్యుత్‌, వంటగ్యాస్‌ అవసరాలు తీర్చుకుంటోంది. పరిశ్రమలు, వ్యవసాయ భూముల నుంచి వెలువడే వ్యర్థాలకూ సరైన నిర్వహణ అవసరం.

అడవులు చాలా ముఖ్యం

అడవులు భూమికి ఊపిరితిత్తులుగా పనిచేస్తాయి. సకల జీవరాశులకు ప్రాణవాయువు అందిస్తాయి. అడవుల తరుగుదల 24 శాతం కర్బన ఉద్గారాలకు కారణమవుతోంది. ఫలితంగా భూమి వేడెక్కుతోంది. పర్యావరణ సమతుల్యానికి ఏ దేశంలోనైనా మూడోవంతు వైశాల్యంలో అడవులు ఉండాలి. ప్రపంచ సరాసరి అడవుల విస్తీర్ణం 30.6 శాతం. భారత్‌లో అది 21.3 శాతమే ఉంది. కనుక విరివిగా చెట్ల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఎంతైనా ఉంది. పెరుగుతున్న జనాభా, పరిశ్రమల స్థాపన, రహదారుల నిర్మాణం కోసం అడవులను నరికివేస్తున్నారు. ఒక చెట్టును నరికితే కొత్త మొక్కలను నాటాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందువల్ల చెట్ల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాల్సిన భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇలాంటి చర్యలు కచ్చితంగా పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

ఉదాసీనత తగదు

భూమికి భారమవుతున్న మరో సమస్య ప్లాసిక్‌ వాడకం. ప్లాస్టిక్‌ వ్యర్థాలు అనేక అనర్థాలకు కారణమవుతున్నాయి. ప్రపంచంలో ఏటా 830 కోట్ల టన్నులు, భారత్‌లో 94.6 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వెలువడుతోంది. ప్రస్తుతం 60 శాతం మేరే ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ జరుగుతోంది. ఇది వంద శాతానికి చేరాలి. వాటిని సమర్థంగా పునర్వినియోగించాలి. మరోవైపు ప్లాస్టిక్‌ వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించగలగాలి. దురదృష్టవశాత్తు ప్లాస్టిక్‌ వాడకం పెరుగుతుందే తప్ప, ఎంతకూ కిందికి దిగిరావడం లేదు. ప్లాస్టిక్‌ వాడకాన్ని దశలవారీగా నిషేధిస్తామని ప్రధాని మోదీ తెలిపినా, ఆ దిశగా అడుగులు వేగంగా వేయాల్సి ఉంది.

మన వంతు పాత్ర పోషించాలి

ఘన, వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వాలతోపాటు ప్రజలూ తమ వంతు పాత్ర పోషించాలి. 30 శాతం వాయుకాలుష్యానికి రవాణా రంగమే కారణమవుతోందన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ప్రభుత్వాలు ప్రజా రవాణాను విరివిగా ప్రోత్సహించడమే దీనికి పరిష్కారం. పర్యావరణహిత విద్యుత్‌ వాహనాలనూ రోడ్లపైకి తీసుకురావాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా భవనాలను నిర్మించుకోవాలి. దీనివల్ల విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా పాటుపడాలి. లేకుంటే ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటాయి.

ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్న కరోనా వైరస్‌ సంక్రమణే అందుకు తిరుగులేని ఉదాహరణ. కరోనాపై తీవ్రంగా పోరాడుతున్న మానవాళి అదే సమయంలో విలువైన పాఠాలనూ గ్రహిస్తోంది. పర్యావరణం విషయంలో ఉదాసీనత వల్ల మరెన్ని ఉపద్రవాలు ముంచుకొస్తాయోనన్న భీతి ప్రపంచ ప్రజల్లో ఏర్పడుతోంది. అందువల్ల రాబోయే రోజుల్లోనైనా ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకోవాలి. జీవవైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కరోనా తరహా ఉత్పాతాలు తలెత్తే ప్రమాదం ఉందన్న భయం వెన్నాడుతూ ఉండాలి.

ప్రకృతి... భావితరాల ఆస్తి

పర్యావరణ పరిరక్షణే నినాదంగా ఏటా ఏప్రిల్‌ 22న దాదాపు 195 దేశాల్లో ధరిత్రీ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని సకల జీవరాశులకు భూమిని నివాసయోగ్యంగా మార్చే సవాలును ‘ఎర్త్‌ డే నెట్వర్క్‌’ అనే సంస్థ స్వీకరించి ఉద్యమపథంలో నడుస్తోంది. ముంచుకొస్తున్న ముప్పును పాలకులకు వివరిస్తూ ప్రత్యేక చట్టాలను తీసుకురావడానికి యథాశక్తి కృషి చేస్తోంది. పర్యావరణ ఉద్యమాల ఫలితంగా 2016 ధరిత్రీ దినోత్సవం రోజున 174 దేశాలు పారిస్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ శతాబ్దాంతానికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరగకుండా కాచుకోవాలని తీర్మానించాయి.

పాలకుల హ్రస్వదృష్టి వల్ల పారిస్‌ ఒప్పందం నీరుకారే పరిస్థితులు దాపురించినా, కరోనా పెను సంక్షోభం వల్ల పాలకులు భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తారన్న నమ్మకమే ఇప్పుడు ఆశారేఖ! పాలకులతోపాటు ప్రజలూ వాతావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలుసుకోవాలి. అప్పుడే పర్యావరణ పరంగా ముంచుకొస్తున్న ముప్పునుంచి కాచుకోగలం. స్వీడన్‌ బాలిక గ్రెటా థన్‌బర్గ్‌ నిరుడు ప్రపంచ దేశాల సమ్మేళనంలో కోరినట్లు కాలుష్య రహిత ధరిత్రిని భావితరాలకు కానుకగా ఇవ్వగలం.

ఇదీ చదవండి: అమెరికాలో చిక్కుకుపోయిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.