ETV Bharat / opinion

'జీ హుజూర్​' అనకపోతే అంతు చూస్తామంటున్న మాస్కో!

author img

By

Published : Apr 28, 2022, 8:11 AM IST

Ukraine Russia War: రష్యా-ఉక్రెయిన్​ల మధ్య గత 63 రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. యుద్ధం మొదలై ఇన్ని రోజులు గడుస్తున్నా రష్యా.. ఉక్రెయిన్​ను ఆక్రమించుకోలేకపోతుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నారు అధ్యక్షుడు​ పుతిన్​.

ukraine russia war
ukraine russia war

Ukraine Russia War: అన్యరాజ్యాలపై అకారణ సైనిక బలప్రయోగం- ప్రపంచాన్ని శాశ్వత సంక్షోభాల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. ఉక్రెయిన్‌ తమకు లోబడటం లేదన్న అసహనంతో వివేచన కోల్పోయి రెచ్చిపోతున్న పుతిన్‌ యంత్రాంగం, మూడో ప్రపంచ యుద్ధభయాలకు అంటుకడుతోంది.'పోరులో మనం గెలవాలంటే అణ్వాయుధాలకు పనిచెప్పాల్సిందే'నని పేరుగొప్ప రష్యన్‌ విశ్లేషకులు కొందరు కొన్నాళ్లుగా స్థానిక ప్రసారమాధ్యమాల్లో విషంకక్కుతున్నారు. ఉక్రెయిన్‌కు సాయం ఆపకపోతే వినాశకర విశ్వ సమరం వాస్తవరూపం దాల్చవచ్చునంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌ తాజాగా అమెరికా, ఇతర దేశాలను హెచ్చరించారు. ఫిన్లాండ్‌, స్వీడన్‌లు 'నాటో'తో జతకడితే ఊరుకునేది లేదని పుతిన్‌ సన్నిహితులు ఇటీవల హుంకరించారు.

సార్వభౌమ రాజ్యాల స్వయంనిర్ణయాధికారాన్ని తృణీకరించే హక్కు క్రెమ్లిన్‌కు ఎక్కడిది? తమకు 'జీ హుజూర్‌' అనకపోతే అంతుచూస్తామంటున్న మాస్కో తెంపరితనం అందరినీ నిశ్చేష్టపరుస్తోంది. యుద్ధాన్ని కట్టిపెట్టి ఉక్రెయిన్‌ను తక్షణం విడిచిపెట్టాలంటూ రష్యాకు గట్టి సందేశమిచ్చిన ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానానికి గత నెలలో 141 దేశాలు మద్దతిచ్చాయి. తమకు ఎదురాడే వాళ్ల పనిపడతామంటూ గుడ్లురుముతున్న మాస్కో- వాటన్నింటినీ శత్రుపక్షాలుగా భావిస్తుందా? అదెక్కడి అరాచక ధోరణి? ప్రపంచం మరోసారి రణరంగంగా మారడం అభిలషణీయం కాదంటూనే, రష్యాపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ యుద్ధోన్మాదులకు చైనా వంతపాడుతోంది. భూగోళాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాల వినియోగానికీ వెనకాడబోమంటున్న క్రెమ్లిన్‌ వర్గాల వదరుబోతు వ్యాఖ్యలు తీవ్రంగా గర్హనీయం. అమాయకులను అత్యంత పాశవికంగా వధిస్తూ, ఎందరో పసివాళ్లను అనాథలుగా మార్చేస్తూ, మరెందరినో నిరాశ్రయులను చేస్తూ- కొన్ని తరాల పాటు కోలుకోలేనంతగా ఉక్రెయిన్‌ను చావుదెబ్బ తీస్తున్న పుతిన్‌ది అక్షరాలా రక్తదాహం! యుద్ధం మూలంగా ఎగబాకిన ధరలు, చుట్టుముట్టిన ఆహార ఆర్థిక సమస్యలతో పేద, వర్ధమాన దేశాల్లోని 170 కోట్ల మందికిపైగా ఇక్కట్ల పాలవుతున్నారని ఐరాస ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఏ పాపం చేశారని సరిహద్దులకు అతీతంగా సామాన్య ప్రజలకు ఈ శిక్ష? సమకాలీన ప్రపంచంలో కనీవినీ ఎరగని నరహంతక నియంతగా పరిణమించిన పుతిన్‌ కరకు గుండెలకు ఆ అసహాయుల వేదనలు, రోదనలు వినిపిస్తాయా?

పదిహేనేళ్ల క్రితం మ్యూనిక్‌ వార్షిక భద్రతా సమావేశంలో ప్రసంగిస్తూ అంతర్జాతీయ చట్టాల పరిరక్షణపై పుతిన్‌ ఎన్నో సుద్దులు చెప్పారు. తన విధానాలను విదేశాలపై బలవంతంగా రుద్దుతోందంటూ అమెరికాను తూర్పారపట్టారు. విశ్వశాంతికి, ప్రపంచ ఆర్థికాభివృద్ధికి విఘాతకరమైన పెడపోకడలు- జనహనన ఆయుధాల సమీకరణకు తప్ప ఎందుకూ కొరగానివని ప్రవచించారు. మరిప్పుడు పుతిన్‌ చేస్తున్నదేమిటి? అత్యాధునిక 'సర్మత్‌' ఖండాంతర క్షిపణిని వారం క్రితం స్వదేశంలో పరీక్షించి, అది విశ్వంలో సాటిలేనిదంటూ ప్రస్తుతించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు పదమూడు వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయి. వాటిలో కేవలం ఒకశాతం కోరచాస్తే చాలు- భూవాతారణంలో విపరీత మార్పులు సంభవించి, కరవు కాటకాలు తాండవించి రెండొందల కోట్ల మంది ఆకలితో అలమటించిపోతారని అంచనా!

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా జారవిడిచిన అణు బాంబుల ధాటికి రెండు లక్షల మందికిపైగా కడతేరిపోయారు. వాటికి కనీసం అయిదు రెట్ల స్థాయిలో ధ్వంసరచన చేయగలిగిన మారణాయుధాలు నేడు రష్యా, అమెరికాల అమ్ములపొదిలో కొలువుతీరాయి. మాస్కో మూకలు రంకెలు వేస్తున్నట్లు మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే, ఏవో కొన్ని దేశాలు కాదు- వసుధ యావత్తూ పరాజితగా మిగిలిపోతుంది. శాంతిని కోరితే లాభం లేదు.. దాన్ని బలపరచే చర్యలు కొనసాగించాలని భారత ప్రధానిగా నెహ్రూ ఏనాడో ఉద్ఘాటించారు. ఐరాసతో సహా ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా కలిసికట్టుగా వేగంగా స్పందిస్తేనే- ముప్పిరిగొంటున్న పెనుముప్పు తప్పుతుంది!

ఇదీ చదవండి: ఆయుధాలు ఆపకపోతే మూడో ప్రపంచయుద్ధమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.