చైనా బహుముఖ దాడి.. అప్రమత్తతే ఆయుధం

author img

By

Published : Oct 21, 2021, 5:59 AM IST

china

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ కోసం కమాండర్ స్థాయి చర్చల్లో పాల్గొంటూనే.. కుటిల నీతికి అవలంబిస్తోంది చైనా. ప్రపంచదేశాల్లో.. ముఖ్యంగా భారత్​ పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కుట్రలకు తెరలేపుతోంది.

సరిహద్దుల వెంబడి డ్రాగన్‌ దూకుడును ప్రతిఘటించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత సైనికాధికార గణం ధీమాగా చెబుతున్నా- క్షేత్రస్థాయి కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 101 ఇళ్లతో ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా నాలుగున్నర కిలోమీటర్ల మేర మన భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు జనవరి నాటి ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. వివాదాస్పద హిమాలయ పర్వత ప్రాంతాల్లో సుమారు ఆరువందల ఆధునిక గ్రామాలు నిర్మించాలన్న చైనా యోచనను హాంకాంగ్‌ నుంచి వెలువడే 'సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌' లోగడే బహిర్గతం చేసింది. అందుకోసం రూ.38 వేల కోట్ల మేర వ్యయీకరించిందన్న లెక్కలూ వెలుగు చూశాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు సరిహద్దుల ఆవల వందల సంఖ్యలో చైనా గ్రామాల అవతరణ అక్షర సత్యమని ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే తాజా వాఖ్యలు ధ్రువీకరిస్తున్నాయి.

అంతర్గత సమస్యలు, కలహాల నుంచి ప్రజానీకం దృష్టిని మళ్లించడానికి సరిహద్దు అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నారన్న చైనా అధికార మీడియా 'గ్లోబల్‌ టైమ్స్‌' కథనం సర్వం అబద్ధాల అల్లికేనని ఇప్పుడు నిర్ద్వంద్వంగా రుజువైంది. అంతిమ పరిష్కారం లభించేంత వరకు రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను కచ్చితంగా గౌరవించాలన్నది 1993 నాటి ఒప్పంద స్ఫూర్తి. దాన్ని తుంగలో తొక్కి ప్యాంగ్యాంగ్‌ సరస్సు ప్రాంతం, దెమ్‌చోక్‌, గల్వాన్‌ లోయ, దౌలత్‌ బేగ్‌ ఓల్డీలను కబళించాలని తహతహలాడుతున్న చైనా కుత్సిత బుద్ధితో విస్తరణవాదానికే గట్టిగా ఓటేస్తోంది. తద్వారా విద్వేషాల చిచ్చు రగిలించడానికే అలవాటుగా తెగబడుతోంది.

గల్వాన్‌ లోయ తనదేనంటూ గత సంవత్సరం సరిహద్దులు మీరిన చైనా తెంపరితనం 20 మంది భారత వీర జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఈ పదిహేడు నెలలుగా- ఒకవైపు చర్చల ప్రస్తావన, మరోపక్క డ్రాగన్‌ కుహకాల బాగోతం.. రెండు నాల్కల ప్రతీపధోరణిని కళ్లకు కట్టింది. గల్వాన్‌ గాయం పచ్చిగా ఉండగానే 'రెడ్‌ ఎకో' పేరిట హ్యాకర్ల బృందమొకటి భారత విద్యుత్‌ రంగ వ్యవస్థలకు, నౌకాశ్రయాలకు గురిపెట్టి విధ్వంస సృష్టికి తెగబడింది.పెద్దయెత్తున సైబర్‌ దాడులతో దేశాన్ని అల్లకల్లోలం చేయగల సామర్థ్యం చైనాకుందంటూ, యావత్‌ యంత్రాంగం ఎంత అప్రమత్తంగా మెలగాలో రక్షణ బలగాల సారథి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆరు నెలల క్రితమే ఉద్బోధించారు.

ఎదురన్నదే లేని ప్రబల శక్తిగా చలాయించుకోవాలని కలలు కంటున్న చైనా కొన్నాళ్లుగా సైబర్‌ దాడుల్ని ముమ్మరం చేస్తోంది. దేశీయ సంస్థల్ని, ప్రజానీకాన్ని సంరక్షించుకోవడంతోపాటు పొరుగు దేశం కుయుక్తుల్ని నీరుకార్చడానికి- 'డిజిటల్‌ ఇండియా'ను చురుగ్గా బలోపేతం చేయడమే శరణ్యమన్న నిపుణుల సూచనలకు ప్రభుత్వం ఇకనైనా చెవొగ్గాలి. చైనా సరిహద్దులోని భారతీయ భూభాగాల్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తే- కొత్తగా పుట్టుకొచ్చిన గ్రామాల రూపేణా ముప్పును చాలావరకు నిరోధించగల వీలుందన్న సూచనల లోతుపాతుల్నీ కేంద్రం పరిశీలించాలి.

చైనా దుందుడుగ్గా నిర్మిస్తున్న జలవిద్యుత్‌ కేంద్రాలు, సొరంగాలు, నీటి మళ్ళింపు ప్రాజెక్టులు తదితరాల వెనకా ఇండియాను ఇక్కట్ల పాల్జేసే పన్నాగాలే ప్రస్ఫుటమవుతున్నాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆభిజాత్య వైఖరుల నియంత్రణే- ఇండియా, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమి (క్వాడ్‌) ప్రధాన లక్ష్యం. క్వాడ్‌ బలీయమైన దన్నుతో డ్రాగన్‌ కుహకాల కట్టడి వ్యూహాల్ని పదును తేల్చడంలో భారత్‌ ఒడుపూవేగాలే- ఆ ధూర్త దేశాన్ని అదుపు చేయగలిగేది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.