ETV Bharat / opinion

పదునైన తీర్పు... ప్రబల సంకేతాలు.. పార్టీలు ఆత్మపరిశీలన చేసుకుంటేనే..

author img

By

Published : Dec 12, 2022, 6:54 AM IST

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, దిల్లీ నగరపాలక సంస్థ పోరులో ప్రజా తీర్పు అన్ని పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా తమ పనితీరుపై అన్ని పక్షాలు మదింపు వేసుకోవాలి. సరైన అడుగులు వేస్తే ప్రతీ పక్షమూ తన బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది.

2022 election results analysis
Election results hold lessons for every party

భారతీయ జనతా పార్టీ (భాజపా) తాజా ఎన్నికల ఫలితాల్లో గుజరాత్‌ను గెలుచుకొంది. కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దిల్లీ నగర పాలక సంస్థ (ఎంసీడీ) ఎన్నికల్లో విజయం సాధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కొన్ని స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు కొన్ని చోట్ల భాజపాను ఓడించగలిగాయి. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌కు నూతన శక్తి అందిస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. గుజరాత్‌ విజయాన్ని భాజపా ఘనంగా చాటుకొంటున్నా, హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం 2019 పార్లమెంటు ఎన్నికలకన్నా చాలా తక్కువ ఓట్లను ఈసారి ఆ పార్టీ అక్కడ సాధించింది. దిల్లీ నగర పాలక సంస్థను చేజిక్కించుకోలేకపోయింది.

దిల్లీలో రెండింజన్ల వృద్ధి నమూనా
రాష్ట్ర అసెంబ్లీ, నగర పాలక సంస్థ ఎన్నికలను ఒకే గాటన కట్టలేం. భాజపా ఆ రెండింటినీ ఒకే తీరున పరిగణించిందని చెప్పాలి. దిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలవడానికి భాజపా నరేంద్ర మోదీ నామాన్ని జపించింది. దేశ రాజధాని అంతటా మోదీ కటౌట్లే దర్శనమిచ్చాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు భాజపా అగ్రనాయకులను ఎంసీడీ ఎన్నికల్లో మోహరించారు. దీన్నిబట్టి భాజపా ఈ ఎన్నికలనూ అసెంబ్లీ పోరు మాదిరిగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులంతా జాతీయ సమస్యలపైనే అధికంగా దృష్టి సారించారు. రాజధానిలో దెబ్బతిన్న రోడ్లు, పెరుగుతున్న వాయు కాలుష్యం, పడిపోతున్న జీవన నాణ్యత వంటి స్థానిక సమస్యలను వారు పట్టించుకోలేదు. ఆప్‌ మాత్రం దిల్లీ నగర శివారుల్లో కొండల్లా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చింది. భాజపా మాదిరిగా ఆప్‌ సైతం రెండు ఇంజన్ల అభివృద్ధి నమూనాను ముందుకు తెచ్చింది. ఇప్పటికే దిల్లీ శాసనసభలో ఆధిక్యంలో ఉన్న ఆప్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ తనకు మెజారిటీ కట్టబెడితే అభివృద్ధి ఊపందుకొంటుందని ప్రచారం చేసింది. ఈ క్రమంలో స్వల్ప మెజారిటీతో ఎంసీడీ ఎన్నికల్లో విజయం సాధించింది. మరోవైపు భాజపా తన బలాన్ని కాపాడుకోగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అసలు ఊసులోనే లేకుండా పోయింది. దిల్లీలో అటు భాజపాను, ఇటు ఆప్‌ను నమ్మని మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకోగలిగింది.

హిమాచల్‌ ఓటర్లు తనను గుర్తుపెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అయినా, భాజపా అక్కడ గెలవలేకపోయింది. గతంలో మోదీ రాజకీయ ప్రవాసంలో ఉన్నప్పుడు హిమాచల్‌లో కొంతకాలం గడిపారు. 2014లో కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరవాత హిమాచల్‌పై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. హిమాచల్‌లో అగ్రకులాల జనాభా అధిక సంఖ్యలో ఉంది. భాజపా హిందుత్వ అజెండాకు అన్నివిధాలా సరిపోయే రాష్ట్రం అది. కానీ, సాయుధ దళాల్లో హిమాచల్‌ వాసులకు ఉపాధి అవకాశాలను పెంచకపోగా అగ్నిపథ్‌ పథకం ద్వారా వాటిని తెగ్గోసిందని అగ్రకుల ఓటర్లు భాజపాపై ఆగ్రహించారు. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న రిటైర్డు ప్రభుత్వోద్యోగులు కొత్త పింఛన్‌ విధానాన్ని నిరసించారు. పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తానంటూ కాంగ్రెస్‌ హిమాచల్‌ ఓటర్లను ఆకట్టుకొంది. కాంగ్రెస్‌ తరఫున ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో నిమగ్నమై హిమాచల్‌లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు హిమాచల్‌లో ఆప్‌ తన ఉనికిని ఏమాత్రం చాటుకోలేకపోయింది.

ఆప్‌ సైంధవ పాత్ర
ఆప్‌ నిజానికి భారతీయ జనతా పార్టీ ఏజెంటు అని కాంగ్రెస్‌ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడుతున్నారు. గుజరాత్‌లో తమ విజయావకాశాలు ఆప్‌ వల్లే దెబ్బతిన్నాయని వారు వాపోతున్నారు. చీపురు గుర్తు పార్టీ వల్ల ప్రతిపక్ష ఓట్లు చీలడంవల్లే 2017 ఎన్నికలతో పోలిస్తే ఇటీవలి పోరులో తాము ఘోరంగా దెబ్బతిన్నామని వారు చెబుతున్నారు. పైగా స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తే గుజరాత్‌ ఓటర్ల ఆదరణ పొందగలుగుతామని కాంగ్రెస్‌ వేసుకున్న అంచనా సైతం తారుమారైంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ప్రతిష్ఠపై దృష్టి కేంద్రీకరించిన భాజపా, గుజరాత్‌లో ఓటర్లు మరో పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకోకుండా చూడగలిగింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత మాధవ్‌ సింగ్‌ సోలంకి గుజరాత్‌లో 55శాతం ఓట్లతో 149 సీట్లను సాధించారు. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇటీవలి గుజరాత్‌ ఎన్నికల్లో సోలంకికన్నా ఏడు సీట్లు అధికంగా దక్కించుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.

నిరుద్యోగ సమస్యకు ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లను నిలబెట్టుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన మైన్‌పురి లోక్‌సభ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ మళ్ళీ కైవసం చేసుకుంది. బిహార్‌లో నీతీశ్‌, తేజస్వీ యాదవ్‌ల మధ్య విభేదాల వల్ల అక్కడి ఉప ఎన్నికలో ఒక స్థానంలో భాజపా పైచేయి సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్ల మనోగతాన్ని చూస్తే వారు నిరుద్యోగ సమస్య నివారణపై హామీ ఇచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్లు అవగతమవుతోంది. మెజారిటీ వర్గాల ప్రజల ఆదరణ భాజపాకు ఉన్నప్పటికీ, గట్టి సవాలు ఎదురైతే ఆ పక్షం తడబడుతున్నట్లు తాజా ఎన్నికలు తెలియజెబుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన వ్యూహాలు రూపొందించుకోవాలని ఇటీవలి ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.

-సంజయ్‌ కపూర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.