ETV Bharat / international

చారిత్రక 'జీవవైవిధ్య' ఒప్పందానికి పచ్చజెండా.. ఆ దేశాలకు భారీగా ఆర్థిక సాయం

author img

By

Published : Dec 19, 2022, 3:49 PM IST

జీవవైవిధ్య పరిరక్షణ దిశగా కీలక ముందడుగు పడింది. ఐరాస జీవవైవిధ్య సదస్సులో కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడే పేద దేశాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లభించేలా ఒప్పందాన్ని రూపొందించారు.

UN BIODIVERSITY AGREEMENT
UN BIODIVERSITY AGREEMENT

ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోని భూములు, సముద్రాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన గ్లోబల్ ఫ్రేమ్​వర్క్​కు ప్రపంచదేశాల ఆమోదం లభించింది. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక సహకారం అందించేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. చైనా అధ్యక్షతన కెనడాలోని మోంట్రియల్​లో జరుగుతున్న ఐరాస జీవ వైవిధ్య సదస్సు(కాప్15)లో ఈ ఒప్పందానికి గ్రీన్​సిగ్నల్ లభించింది.

ఈ ఒప్పందానికి సంబంధించి కీలక ముసాయిదాను సోమవారం విడుదల చేశారు. ఒప్పందంలోని అంశాల ప్రకారం.. భూగోళంపై జీవవైవిధ్యం అధికంగా ఉన్న 30 శాతం భూభాగాన్ని, 17 శాతం అడవులను, సముద్రంలోని 10 శాతం ప్రాంతాన్ని సంరక్షించాలి. ఈ లక్ష్యాలను 2030నాటికి అందుకోవాలి. ఇందుకోసం 2030 నాటికి 200 బిలియన్ డాలర్లు వివిధ మార్గాల నుంచి సేకరిస్తారు. జీవవైవిధ్యానికి హాని కలిగించే సబ్సిడీలను గుర్తించి, తగ్గించాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. సబ్సిడీలను నియంత్రించడం ద్వారా జీవవైవిధ్యానికి 500 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం కలిగించవచ్చని అంచనా వేస్తున్నారు.

పేద దేశాలకు అందించే ఆర్థిక సహకారాన్ని 2025నాటికి 20 బిలియన్ డాలర్లకు పెంచాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఈ ఆర్థిక సాయాన్ని 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు పెంచనున్నారు. జీవవైవిధ్య సంరక్షణ విషయంలో ఇది అతిపెద్ద లక్ష్యమని పర్యావరణ పరిరక్షకులు చెబుతున్నారు. జీవవైవిధ్యం పూర్తిగా నశించకుండా చేసే అవకాశం దీనివల్ల లభించిందని 'క్యాంపెయిన్ ఫర్ నేచర్' డైరెక్టర్ బ్రియాన్ ఒడొనెల్ పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాల లక్ష్యాల గురించి ప్రస్తావించడంలో ఈ ఒప్పందం విఫలమైందని 'ది నేచర్ కన్సర్వెన్సీ' సంస్థ డైరెక్టర్ ఆండ్రూ డూష్ ఆక్షేపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.