ETV Bharat / international

అర్ధంతరంగా ముగిసిన రిషి, ట్రస్ టీవీ డిబేట్​.. కారణం ఇదే..

author img

By

Published : Jul 28, 2022, 7:40 AM IST

Rishi Sunak Liz Truss debate: బ్రిటన్​ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్​, లిజ్​ ట్రస్ మంగళవారం టాక్‌టీవీ చేపట్టిన డిబేట్​లో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేట్ మెకాన్ అనారోగ్యంగా కారణంగా కిందపడిపోయారు. దీంతో టాక్​టీవీ యాజమాన్య సంస్థ ఈ డిబేట్​ను ఇక్కడితో ఆపేస్తున్నామని ప్రకటించింది. మరోవైపు రిషి సునాక్ ప్రచారంలో వ్యూహం మార్చారు. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు గృహ ఇంధన బిల్లులపై విలువ ఆధారిత పన్నును 5% తగ్గిస్తానని అన్నారు.

liz truss rishi sunak
రిషి సునాక్ లిజ్ ట్రస్ టీవీ చర్చ

Rishi Sunak Liz Truss debate: బ్రిటన్‌ ప్రధాని రేసులో కీలక ఘట్టంగా భావించే 'అభ్యర్థుల టీవీ చర్చ' సందర్భంగా అనుకోని సంఘటన జరిగింది. మంగళవారం పొద్దుపోయాక 'టాక్‌టీవీ' చేపట్టిన చర్చలో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ప్రధానమంత్రి అభ్యర్థులు రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌లు పాల్గొన్నారు. తాను ప్రధానిగా ఎన్నికైతే, తన ఆర్థిక ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ట్రస్‌ వివరిస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేట్‌ మెకాన్‌ అనారోగ్యం కారణంగా కిందపడిపోయారు. దీంతో పక్కనే ఉన్న రిషి వెంటనే ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ట్రస్‌ కూడా మాట్లాడటం ఆపేసి, కేట్‌కు ఏమైందోనని ఆత్రుతగా పరిశీలించారు. అభ్యర్థులిద్దరూ వంగి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేట్‌ ప్రస్తుతం బాగానే ఉన్నారని, వైద్యుల సూచన మేరకు చర్చా కార్యక్రమాన్ని కొనసాగించలేకపోతున్నామని, ఇందుకు క్షమించాలని టాక్‌టీవీ యాజమాన్య సంస్థ న్యూస్‌ యూకే ప్రేక్షకులను అభ్యర్థించింది. అక్కడితో కార్యక్రమాన్ని నిలిపివేసింది.

వ్యూహం మార్చిన సునాక్‌..: పన్నుల తగ్గింపుపై సునాక్‌, ట్రస్‌ల మధ్య తీవ్రస్థాయి చర్చ నడుస్తున్న క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకొంది. ట్రస్‌ ప్రతిపాదిస్తున్న పన్నుల తగ్గింపు నైతికంగా సరికాదంటూ ఇప్పటివరకూ ప్రచారం చేపట్టిన సునాక్‌.. ఉన్నట్టుండి తన వ్యూహాన్ని మార్చారు. కన్జర్వేటివ్‌ పార్టీలో మెజార్టీ సభ్యుల మద్దతు ట్రస్‌కే ఉందన్న సర్వేల నేపథ్యంలో- వారిని ప్రసన్నం చేసుకునేందుకు సునాక్‌ తన గొంతు సవరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. "మన పిల్లలు, మనుమలకు వారసత్వాన్ని అందివ్వాలే తప్ప, చెల్లించాల్సిన బిల్లులను కాదు. నేను ప్రధానిగా బాధ్యలు చేపడితే, పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు గృహ ఇంధన బిల్లులపై విలువ ఆధారిత పన్నును 5% తగ్గిస్తా. ద్రవ్యోల్బణాన్నీ గణనీయంగా నియంత్రిస్తా. తద్వారా జీవన వ్యయం తగ్గుతుంది. తాత్కాలిక, లక్ష్యాత్మక పన్ను తగ్గింపు ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 160 పౌండ్ల మేర లాభం చేకూరుతుంది" అని పేర్కొన్నారు. దీంతో సునాక్‌ యూ-టర్న్‌ తీసుకున్నారంటూ ట్రస్‌ శిబిరం విమర్శలు గుప్పిస్తోంది. తాను ప్రధాని పగ్గాలు చేపడితే.. హింస, హత్యల నియంత్రణకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తానని ట్రస్‌ చెబుతున్నారు. 'టోరీ మెంబర్స్‌'గా పిలిచే కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులకు వచ్చే మంగళవారం నుంచి బ్యాలెట్లను బట్వాడా చేస్తారు. సెప్టెంబరు 2వ తేదీతో ఓటింగ్‌ ముగుస్తుంది. అదేనెల 5న ఫలితాలు వెలువడతాయి.

ఇవీ చదవండి: పుతిన్​కు తీవ్ర అస్వస్థత.. వైద్యుల్లో టెన్షన్​ టెన్షన్​!

లాక్​డౌన్​లో బోర్ కొట్టి విమానం తయార్.. ఫ్యామిలీతో ప్రపంచమంతా టూర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.