ETV Bharat / international

మరోసారి కవ్వించిన ఉత్తర కొరియా.. రెండు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం

author img

By

Published : Dec 18, 2022, 5:02 PM IST

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తూర్పు తీర సముద్ర జలాల్లోకి రెండు బాలిస్టిక్‌ క్షిపణలను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.

north Korea two ballistic missiles
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా మరోమారు ఖండాతర క్షిపణులను పరీక్షించి ఉద్రిక్తతలను రాజేసింది. తూర్పు తీర సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా.. రెండు బాలిస్టిక్‌ క్షిపణలును ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఈ విషయాన్ని జపాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం సైతం ధ్రువీకరించింది.

జపాన్‌, కొరియా ద్వీపకల్పానికి మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఆ బాలిస్టిక్‌ క్షిపణి పడినట్లు జపాన్‌ ఆరోపించింది. ఉత్తరకొరియా వాయువ్య ప్రాంతంలోని టాంగ్‌చాంగ్రి నుంచి 50 నిమిషాల వ్యవధిలో ఈ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ క్షిపణులు సుమారు 500 నుంచి 550 కిలోమీటర్లు మేర ప్రయాణించినట్లు చెప్పింది. జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల పడినట్లు స్పష్టం చేసింది. తమకు వ్యతిరేకంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు ఏవైనా చర్యలకు పాల్పడితే అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామని ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు.

టాంగ్‌చాంగ్రిలో ఉత్తరకొరియాకు చెందిన సోహే శాటిలైట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ ఉంది. గతంలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన రాకెట్లు ఇక్కడ పరీక్షించింది. దీనిపై అప్పట్లో ఐరాస మండిపడింది. రాకెట్ల ముసుగులో ఖండాంతర క్షిపణి టెక్నాలజీని పరీక్షిస్తోందని ఆరోపించింది. గురువారం అత్యంత శక్తిమంతమైన ఘన ఇంధన మోటార్‌ను ఉత్తరకొరియా ఇదే కేంద్రంలో పరీక్షించింది. దీనిని తమ వ్యూహాత్మక ఆయుధంలో ఉపయోగిస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగానే తాము క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరకొరియా సమర్థించుకొంటోంది. తమ దేశాన్ని ఆక్రమించేందుకు ఆ విన్యాసాలు రిహార్సిల్స్‌ వంటివవని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.