ETV Bharat / international

ఇరాన్​లో ప్రభుత్వ అణచివేతపై నిరసనగళం.. 'ఆస్కార్‌' సినిమా నటి అరెస్ట్

author img

By

Published : Dec 18, 2022, 1:23 PM IST

ఇరాన్‌లో కొనసాగుతోన్న ఆందోళనలకు మద్దతు పలికిన ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. 2016లో ఆస్కార్ సాధించిన 'ది సేల్స్‌మన్‌' చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

oscar winning movie iran actress who supported protests arrested
ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తి

ఇరాన్‌లో మూడు నెలల నుంచి కొనసాగుతోన్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఇద్దరికి ఉరి శిక్ష అమలు చేసిన ప్రభుత్వం.. అనేక మందికి జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తిని అరెస్టు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఆమె సంఘీభావం తెలపడమే దానికి కారణం. హిజాబ్‌ ఆందోళనల విషయంలో అబద్ధాలను వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై పోలీసు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

టెహ్రాన్‌లో నిరసనల్లో పాల్గొన్న మొహసెన్‌ షెకారీ అనే యువకుడిని ఇరాన్‌ ఇటీవల ఉరి తీసింది. అలీదూస్తీ దీన్ని తీవ్రంగా ఖండించారు. దీంతోపాటు అతని ఉరిశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడంపై అంతర్జాతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. 'ఈ రక్తపాతాన్ని చూస్తూ స్పందించని ప్రతి అంతర్జాతీయ సంస్థ.. మానవత్వానికే మాయని మచ్చ' అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విమర్శించారు. అయితే, 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇటీవల తొలగించడం గమనార్హం.

38 ఏళ్ల అలీదూస్తి ఇరాన్‌లో పేరొందిన నటీమణుల్లో ఒకరు. 2016లో ఆస్కార్ పురస్కారం సాధించిన 'ది సేల్స్‌మన్‌' చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించారు. దేశవ్యాప్త నిరసనలను అణచివేసేందుకు ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలను మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహ్సా అమీని మరణంతో దేశంలో ఆందోళనలు ఎగసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.