ETV Bharat / international

బ్రిటన్ ప్రధాని రాజీనామా- పదవి చేపట్టిన 45 రోజులకే..

author img

By

Published : Oct 20, 2022, 6:13 PM IST

Updated : Oct 20, 2022, 7:00 PM IST

Liz Truss Resign : బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆమె ఇటీవల తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు.

britain prime minister resigns
బ్రిటన్ ప్రధాని రాజీనామా

Liz Truss Resign : బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ దేశ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముదిరిన నేపథ్యంలో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఇప్పటికే లిజ్‌ట్రస్‌ కేబినెట్‌లో పలువురు మంత్రులు రాజీనామా చేయగా ఆమె కూడా వారి బాటలోనే పయనించారు. 45 రోజుల పాటు మాత్రమే ఆమె బ్రిటన్‌ ప్రధాని పదవిలో కొనసాగారు. బ్రిటన్‌ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తి ఆమెనే కావడం గమనార్హం. గతంలో ఎప్పుడూ బ్రిటన్‌లో ఇలాంటి రాజకీయ సంక్షోభం తలెత్తలేదని నిపుణులు చెబుతున్నారు. మార్గరెట్‌ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన మూడో మహిళ లిజ్‌ ట్రస్‌ కావడం గమనార్హం.

బ్రిటన్‌లో గొప్ప ఆర్థిక, అంతర్జాతీయ అస్థిరత నెలకొని ఉన్నప్పుడు తాను ప్రధానమంత్రి పదవిలోకి వచ్చానని, తనను ఏ ప్రాతిపదికపై టోరీ సభ్యులు ఎన్నుకున్నారో దాన్ని నెరవేర్చలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని లిజ్ ట్రస్‌ వెల్లడించారు. కన్జర్వేటివ్‌ పార్టీ లీడర్‌గా రాజీనామా చేస్తున్న విషయాన్ని కింగ్‌ చార్లెస్‌కు తెలిపినట్లు వివరించారు.

"ఆర్థిక ఒడుదొడుకులు, అంతర్జాతీయంగా అస్థిరత ఉన్న సమయంలో నేను బాధ్యతలు చేపట్టాను. బిల్లులు చెల్లించడానికి కూడా చాలా కుటుంబాలు, వ్యాపార సంస్థలు ఆందోళన చెందాయి. పుతిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడం.. భద్రతాపరంగా యావత్‌ ఖండానికి సవాలుగా మారింది. ఇదే సమయంలో మన దేశం ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం నన్ను కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. జాతీయ బీమా మొత్తాన్ని తగ్గించి.. బిల్లుల చెల్లింపును సులభతరం చేశాం. బ్రెగ్జిట్‌ను అనుకూలంగా మార్చుకొని పన్నుల భారం తగ్గించి అధిక వృద్ధిరేటు సాధించేందుకు విజన్‌ను సిద్ధం చేశాం. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే కన్జర్వేటివ్‌ పార్టీ నాకు ఇచ్చిన మెజార్టీని నిలబెట్టుకోలేనని గుర్తించాను. అందుకే పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజుకు తెలియజేశాను."

--లిజ్‌ ట్రస్, రాజీనామా చేసిన బ్రిటన్‌ ప్రధాని

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తో పోటీపడిన లిజ్‌ ట్రస్‌ ఇటీవలే బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే పన్నులు తగ్గిస్తూ ఆమె తీసుకున్న నిర్ణయాలు బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచాయి. దీంతో పార్టీలో ఆమెపై తిరుగుబాటు మొదలైంది. చివరకు ఆ నిర్ణయాలను ఆమె వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్‌ హోంమంత్రి, ఆర్థిక మంత్రులు ఇటీవలే తమ పదవుల నుంచి వైదొలిగారు. ఆఖరికి లిజ్‌ ట్రస్‌ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. 47 ఏళ్ల లిజ్ ట్రస్‌ తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

కన్జర్వేటివ్‌ పార్టీకి వేగంగా నాయకత్వ ఎన్నిక నిర్వహించి వచ్చే వారంలోగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని టోరీ సభ్యులు భావిస్తున్నారు. రిషి సునాక్‌ ఈ రేసులో ముందున్నట్లు అంచనా. ఐతే బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అనుకూల వర్గం మాత్రం తిరిగి జాన్సన్‌ను ప్రధానిని చేయాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మాత్రం వెంటనే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇవీ చదవండి: తప్పులు చేశాం.. క్షమించండి : బ్రిటన్ ప్రధాని

'ట్రస్​ను ఎన్నుకొని తప్పుచేశాం'.. బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం.. సునాక్​కు మరో ఛాన్స్!

Last Updated :Oct 20, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.