ETV Bharat / international

సూయిజ్‌ కాలువలో చిక్కుకున్న నౌక.. కాసేపటికే..

author img

By

Published : Jan 9, 2023, 1:29 PM IST

Updated : Jan 9, 2023, 3:17 PM IST

సూయిజ్ కాలువలో నౌక చిక్కుకుపోవడం కాసేపు కలకలం రేపింది. అయితే ఆ నౌకను బయటకు తీసినట్లు సూయిజ్ కాలువ అధికార యంత్రాంగం తెలిపింది.

suez canal blockage ship
సూయిజ్ కెనాల్​లో చిక్కుకున్న నౌక

సూయిజ్​ కాలువలో మరో నౌక చిక్కుకుపోవడం కాసేపు కలకలం రేపింది. సరకు రవాణాకు అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కాసేపటికే సూయిజ్​ కాలువలో చిక్కుకున్న నౌకను బయటకు తీసినట్లు కెనాల్​ అథారిటీ తెలిపింది. ఈజిప్ట్​లోని​ ఇస్మాలియాలోని క్వాంటారా సమీపంలో జరిగిందీ ఘటన. ప్రమాదానికి గురైన ఎంవీ గ్లోరీ అనే కార్గో నౌక లెత్​ ఏజెన్సీకి చెందిందని అధికారులు తెలిపారు.

"ఎంవీ గ్లోరీ అనే నౌక సూయిజ్​ కాలువలో చిక్కుకుపోయింది. మూడు టగ్​బోట్​లతో శ్రమించి ఎంవీ గ్లోరీ నౌకను బయటకు తీశాం. నౌక చిక్కుకుపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియలేదు. ఈజిప్ట్​లోని ఉత్తర ప్రావిన్స్​ సహా మరి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. శాటిలైట్ ట్రాకింగ్​లో ఎంవీ గ్లోరీ సూయిజ్​ కాలువకు దక్షిణం వైపు కనిపించింది. గ్లోరీ నౌక పొడవు 738 అడుగులు."

--లెత్​ ఏజెన్సీస్

suez canal blockage ship
నౌక ఇరుక్కుపోయిన ప్రదేశం

అంతకుముందు 2021 మార్చిలో ప్రపంచంలోనే అతి పెద్ద సరకు రవాణా నౌకల్లో ఒకటైన కంటెయినర్‌ నౌక ఎంవీ ఎవర్‌గివెన్‌.. సూయిజ్‌ కాలువలో అనూహ్యంగా చిక్కుకుపోయింది. దీంతో ఆరు రోజుల పాటు జల రవాణా నిలిచిపోయింది. దాదాపు రోజుకు 9 బిలియన్‌ డాలర్ల వ్యాపారం స్తంభించింది. పనామాకు చెందిన ఈ నౌక చాలా ఎత్తుగా ఉంటుంది. కాలువలో ఉత్తరం వైపు మళ్లేందుకు ఇది ప్రయత్నించగా ప్రమాదం జరిగింది. అనుకోకుండా ఇది ఎందుకు ఉత్తరం వైపు మళ్లాల్సి వచ్చిందో కారణాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సూయిజ్‌ జలమార్గం కీలకమైనది. ప్రపంచ వాణిజ్యంలో పది శాతం ఈ కాలువ మీదుగానే జరుగుతుంది.

Last Updated :Jan 9, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.