ETV Bharat / international

క్రిమియా తీరంలో అలజడి.. రష్యా నౌకాదళంపై డ్రోన్‌ దాడి.. ఉక్రెయిన్​ పనేనా?

author img

By

Published : Oct 29, 2022, 4:46 PM IST

ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల వేళ క్రిమియా తీరంలో మాస్కో నౌకాదళంపై డ్రోన్‌ దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడులను తిప్పికొట్టినట్లు రష్యా అధికారులు చెబుతుండగా.. యుద్ధ నౌకలు దగ్ధమైన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

drone attack on russian navy in crimea bay
drone attack on russian navy

రష్యా ఆక్రమిత క్రిమియాలో విధులు నిర్వహిస్తున్న మాస్కో దళాలపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడిని క్రెమ్లిన్ నౌకాదళం సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు శనివారం వెల్లడించారు. కెర్చ్‌ వంతెన పేలుడుతో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ.. ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

క్రిమియాలోని సెవాస్టోపోల్‌ పోర్ట్‌ వద్ద విధుల్లో ఉన్న మాస్కో నల్లసముద్రం నౌకాదళం లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సెవాస్టోపోల్‌ గవర్నర్‌ మైఖెల్‌ రజ్వోజయెవ్‌ టెలిగ్రామ్‌లో వెల్లడించారు. కొన్ని గంటల పాటు మాస్కో ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఈ దాడులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు. అన్ని మానవరహిత వాహనాలను రష్యా నేవీ కాల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు.

drone attack on russian navy in crimea bay
డ్రోన్​ దాడి

అయితే ఈ దాడుల్లో రష్యాకు చెందిన పలు యుద్ధ నౌకలు దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తీర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్మేసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఘటన నేపథ్యంలో హార్బర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా.. ఈ దాడి ఉక్రెయిన్‌ సైన్యం జరిపి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సెవాస్టోపోల్‌ సమీపంలోని ఓ థర్మల్‌ విద్యుత్ కేంద్రంపై డ్రోన్‌ దాడి జరిగింది.

ఇటీవల క్రిమియా-రష్యాను కలిపే కెర్చ్‌ వంతెనపై పేలుడు సంభవించి బ్రిడ్జి తీవ్రంగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ పేలుడుకు ఉక్రెయిన్‌ కారణమని ఆరోపించిన మాస్కో.. ఆ దేశంపై దాడులు మరింత పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో రష్యా ఆక్రమిత క్రిమియాలోని మాస్కో సేనలపై డ్రోన్‌ దాడులు జరగడం.. ఉద్రిక్తతలను మరింత పెంచే ఆస్కారముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: 'నేల విడిచి సాము'.. నింగికి చేరిన రష్యా- ఉక్రెయిన్ పోరు.. టార్గెట్ అవే!

ఫిలిప్పీన్స్​లో​ తుపాను భీభత్సం 47 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.