ETV Bharat / international

టీవీ డిబేట్​లో రిషి, ట్రస్‌ మాటల యుద్ధం.. ఆర్థిక అంశాలు, పన్నులపై వాగ్వాదం!

author img

By

Published : Jul 27, 2022, 5:41 AM IST

Updated : Jul 27, 2022, 6:51 AM IST

rishi sunak lizz turss
rishi sunak lizz turss

Rishi Sunak Liz Truss: బ్రిటన్​ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్​, లిజి ట్రస్​ మధ్య ఓ టీవీ డిబేట్​లో మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక అంశాలు, పన్ను ప్రణాళికపై ఇద్దరి మధ్య వాగ్వాదం హోరాహోరీగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎవరూ బాగా మాట్లాడారన్నదానిపై 'ఒపీనియం' సంస్థ నిర్వహించిన పోల్​లో.. సునాక్‌కు 39 శాతం ఓట్లు రాగా ట్రస్‌ వైపు 38 శాతం మంది మొగ్గారు.

Rishi Sunak Liz Truss Tv Debate: బ్రిటన్‌లో ప్రధాన మంత్రి పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మధ్య తొలిసారిగా జరిగిన టీవీ చర్చ హోరాహోరీగా సాగింది. ఆర్థిక విధానాలు, పన్ను ప్రణాళికలపై ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరూ బాగా మాట్లాడారన్నదానిపై 'ఒపీనియం' సంస్థ ఒక పోల్‌ నిర్వహించింది. అందులో సునాక్‌కు 39 శాతం ఓట్లు రాగా.. ట్రస్‌ వైపు 38 శాతం మంది మొగ్గారు. మొత్తం మీద చూసినప్పుడు ఓటర్లు విస్పష్టంగా ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. సర్వేలో పాల్గొన్న కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లలో 47 శాతం మంది మాత్రం.. ట్రస్‌ బాగా మాట్లాడారని పేర్కొన్నారు. 38 శాతం మంది సునాక్‌ వైపు మొగ్గు చూపారు.

టీవీ చర్చలో రిషి, ట్రస్‌ల మాటల యుద్ధం

ఆర్థిక అంశాలపై మాటల తూటాలు
"40 బిలియన్‌ పౌండ్ల మేర పన్నుల కోతకు మీరు హామీ ఇచ్చారు. అదనంగా 40 బిలియన్‌ పౌండ్ల అప్పులు తెస్తామన్నారు. అది దేశానికి భారమవుతుంది. భవిష్యత్‌తరాలు ఆ రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది" అంటూ ట్రస్‌పై సునాక్‌ విమర్శలు గుప్పించారు. కొవిడ్‌-19 కారణంగానే బ్రిటన్‌లో ప్రస్తుతం పన్ను భారం పెరిగిందన్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ట్రస్‌ ప్రతిపాదిస్తున్న పన్ను కోతల వల్ల లక్షల మంది ఇబ్బందిపడతారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో దీనికి కన్జర్వేటివ్‌ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఏ దేశమూ పన్నులు పెంచడంలేదని ట్రస్‌ వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి సునాక్‌ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు.

"ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో సునాక్‌ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో పన్నులను పెంచారు. ఇప్పుడు మాంద్యం ముంచుకొస్తోంది. వాస్తవాలేంటో గణాంకాలే చెబుతున్నాయి" అని ఆమె విమర్శించారు. చైనాపై కఠిన వైఖరి అనుసరించే అంశంపై కూడా ఇద్దరు నేతల మధ్య విభేదాలు వ్యక్తమయ్యాయి. ఆహార్యంపైనా విమర్శలు రువ్వుకున్నారు. ఈ సందర్భంగా సునాక్‌ తన నేపథ్యం గురించి ప్రస్తావించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివించారని తెలిపారు. ట్రస్‌ ప్రధాన మంత్రిగా ఎంపికైతే ఆమె కేబినెట్‌లో మీరు పనిచేస్తారా అన్న ప్రశ్నకు సునాక్‌ సానుకూలంగా స్పందించారు. మరోవైపు బ్రిటన్‌ ప్రధానిగా ట్రస్‌ ఎంపిక కావడానికి 75 శాతం ఆస్కారం ఎక్కువగా ఉందని బెట్టింగ్‌ అంచనాల సంస్థ 'ఆడ్స్‌చెకర్‌' పేర్కొంది. యువ్‌గవ్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వే కూడా ట్రస్‌ వైపే మొగ్గింది.

ఇవీ చదవండి: కేవలం స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌ వ్యాపిస్తుందా? అందులో నిజమెంత?

చైనా దారిలోనే రష్యా... అంతరిక్ష కేంద్రానికి గుడ్​బై!

Last Updated :Jul 27, 2022, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.