ETV Bharat / international

సరిహద్దులో చైనా జలఖడ్గం.. పవర్​ పంచ్​తో భారత్​ కౌంటర్

author img

By

Published : Jan 19, 2023, 7:35 AM IST

Construction of India's new project to challenge China
చైనా జలఖడ్గానికి భారత్‌ కట్టడాలు

చైనా ప్రతిసారి కొత్తరకం సమస్యను సృష్టిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ చైనా- భారత్​ సరిహద్దులో ఏదో ఒక చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ సారి అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద భారీ ప్రాజెక్టు నిర్మించనుందని సమాచారం. దీంతో భారత్ అప్రమత్తమైంది.

ఇరు దేశాల సరిహద్దులో అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద చైనా భారీ ప్రాజెక్టు నిర్మించనుందనే సమాచారంతో భారత్‌ అప్రమత్తమైంది. పై నుంచి ఉన్నపళంగా వచ్చే వరదను అడ్డుకోడానికి ఓ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. బ్రహ్మపుత్ర నదీజలాలను ఆయుధంగా వాడుకొని అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లపై ఎక్కుపెట్టేలా చైనా పన్నిన వ్యూహానికి ఇది భారత్‌ విరుగుడుగా చెప్పవచ్చు. ఇప్పటికే భారత ఈశాన్య ప్రాంతంలోకి టిబెట్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రవహించే నదులపై బీజింగ్‌ ఆనకట్టలు కట్టింది. దీంతో కీలక సమయాల్లో వీటి నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పదు. వీటికి తోడు తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలోని 'మెడాగ్‌' వద్ద దాదాపు 60,000 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారీ డ్యామ్‌ నిర్మాణానికి చైనా ప్రణాళికలు మొదలుపెట్టింది. దీంతో భారత్‌ అప్రమత్తమై రానున్న ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమైంది. ఈ మేరకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్‌ జిల్లాలో భారీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. 11 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇది మన దేశంలో ఇప్పటికే ఉన్న అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టు కంటే అయిదు రెట్లు పెద్దది. దీని 'ప్రీ ఫీజబిలిటీ' నివేదికను ఇప్పటికే నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ సిద్ధం చేసింది.

  • బ్రహ్మపుత్రపై మెడాగ్‌ వద్ద చైనా భారీ ప్రాజెక్టు నిర్మిస్తే.. కరవు సమయంలో దిగువ ప్రాంతాలకు హఠాత్తుగా నదీప్రవాహం తగ్గించడం.. లేదా కృత్రిమ వరదలు సృష్టించే అవకాశం ఉండటం భారత్‌కు ఆందోళనకరమే. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోడానికే ఎగువ సియాంగ్‌లో డ్యామ్‌ ప్రతిపాదనను భారత్‌ ముందుకు తెచ్చింది. దీని నిర్మాణం పూర్తయితే నది ఎగువ భాగంలోని చైనా నుంచి వచ్చిపడే వరదనీటిని నిల్వ చేసేలా 'బఫర్‌ స్టోరేజీ'
  • కి కూడా ఇది ఉపయోగపడనుంది. 900 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీటిని నిల్వ చేసేలా దీన్ని డిజైన్‌ చేసినట్లు సమాచారం. బ్రహ్మపుత్రపై భారత్‌ ఇప్పటికే నిర్మించిన సుబన్‌సిరీ హైడ్రో ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభించే అవకాశం ఉంది. ఇది దాదాపు 2,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
  • టిబెట్‌ పీఠభూమిలోని 46,000 హిమనదాల నుంచి సింధు, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, మెకాంగ్‌, ఐరావతి, యాంగ్‌ ట్సే, యెల్లో నదులు పుడుతున్నాయి. 200 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే ఇవి ఆసియా ఖండానికి జీవనదులు. టిబెట్‌ పీఠభూమిలో చైనా 55కు పైగా జలాశయాలను నిర్మించింది. అయినా చైనాలో అత్యధిక రాష్ట్రాలు ఇప్పటికీ తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీరు, విద్యుత్తు అవసరాలు తీర్చడానికి బ్రహ్మపుత్రపై బృహత్తర ప్రాజెక్టు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ నదిని చైనా మళ్లిస్తే భారత్‌పై ప్రతికూల ప్రభావం అనివార్యం. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తినా.. భారీ వరద అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లను ముంచెత్తడం ఖాయం. దీన్ని నివారించడానికి చైనా ఏటా జూన్‌ - అక్టోబరు మధ్యకాలంలో నీటి విడుదలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని అందిస్తానని గతంలో భారత్‌కు మాట ఇచ్చినా.. 2017 నాటి డోక్లాం ఘర్షణల తరవాత సమాచార మార్పిడిని నిలిపివేసింది. 2018లో ఈ ప్రక్రియ మళ్లీ మొదలైనా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు.
  • ఇవీ చదవండి:
  • 'భారత్​ దౌత్య విజయం'.. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస
  • గుడ్​న్యూస్.. రంగంలోకి అమెరికా అధికారులు.. తగ్గనున్న వీసా వెయిటింగ్ టైమ్!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.