ETV Bharat / international

వద్దంటున్నా.. లంక వైపు వస్తున్న 'చైనా నిఘా' నౌక!

author img

By

Published : Aug 9, 2022, 9:14 PM IST

China Spy Ship: చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5.. శ్రీలంక దిశగా ప్రయాణిస్తోంది. ఇప్పటికే ఆ దేశ అధికారులు నౌక రాకను వాయిదా వేయాలని కోరినా.. చైనా వినిపించుకోవడం లేదు. అయితే ఈ యుద్ధ నౌక సాయంతో భారత్‌ క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే అవకాశం ఉంది.

China Spy Ship
China Spy Ship

China Spy Ship: చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడంలేదు. అసలు ఈ నౌకను శ్రీలంకలోని హంబన్‌ టొట రేవులో లంగర్‌ వేసేందుకు తొలుత అనుమతి ఇవ్వడంపైనే భారత్‌ తీవ్రంగా స్పందించింది. దీంతో వెనక్కి తగ్గిన లంక.. యువాన్‌ వాంగ్‌ 5 ప్రయాణం వాయిదా వేయాలని డ్రాగన్‌ను కోరింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ నౌక ఇండోనేషియాకు ఉత్తర దిశగా గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ రకంగా అయితే గురువారం ఉదయం 9.30 గంటలకు హంబన్‌టొట రేవుకు ఇది చేరుకొంటోంది.

భారత్‌ నుంచి శ్రీలంక అధికారులపై నిన్న తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో వారు నిన్న కూడా చైనా దౌత్య అధికారులను పిలిపించి ఆ నౌక ప్రయాణాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో చైనా అధికారులు భారత్‌ పేరు ప్రస్తావించకుండా ఓ ప్రకటన జారీ చేశారు. చైనా పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని కోరారు. శ్రీలంక-చైనా మధ్య సాధారణ సహకారాన్ని దెబ్బతీయవద్దని కోరారు.

ఈ యుద్ధ నౌక సాయంతో భారత్‌ క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. యువాన్‌ వాంగ్‌ 5 క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు.

ఇవీ చదవండి: రాజధానిని ముంచెత్తిన వరద.. 8 మంది బలి

ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు.. ఆ రహస్య పత్రాల కోసమే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.