ETV Bharat / international

సరిహద్దులో చైనా నిఘా ఏర్పాట్లు, మెరుపు ఆపరేషన్లు జరగకుండా జాగ్రత్తలు

author img

By

Published : Aug 30, 2022, 2:18 PM IST

సరిహద్దులో భారత సైన్యం మెరుపు ఆపరేషన్లకు దిగకుండా డ్రాగన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. సరిహద్దుల్లో రాడార్లను గుర్తించే డోమ్​లను ఏర్పాటు చేసుకుంటోంది. సైనిక సంపత్తిని వేగంగా తరలించేలా మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తోంది.

India China border
India China border

India China border : ఒక సారి దెబ్బతింటే.. మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చైనా జాగ్రత్త పడుతోంది. గతంలో డోక్లాం వద్ద భారత్‌తో సైనిక సంక్షోభం తలెత్తాక.. అక్కడ ఏకంగా ఒక గ్రామం, ఇతర నిర్మాణాలను చేపట్టింది. తాజాగా పాంగాంగ్‌ సరస్సు వద్ద కూడా అటువంటి వ్యూహాన్నే అమలు చేస్తోంది. గతంలో ఇక్కడ చైనా ఈ సరస్సు ఉత్తరం వైపు భారత్‌ భూభాగాల్లో చొరబడి తిష్ఠ వేయడంతో.. భారత్‌ సైన్యం మెరుపు వేగంతో ఆపరేషన్‌ నిర్వహించి దక్షిణం వైపున కైలాశ్‌ రేంజిలోని కీలక శిఖరాలు స్వాధీనం చేసుకొని మాల్డో గారిసన్‌పై గురిపెట్టింది. దీంతో డ్రాగన్‌ చర్చల్లో రాజీకొచ్చి ఉత్తరం వైపు భూభాగాలను ఖాళీ చేసింది. భారత్‌ కూడా కైలాస్‌ రేంజి నుంచి వెనక్కి తగ్గింది. మరోసారి భారత్‌ వైపు నుంచి ఇలాంటి మెరుపు ఆపరేషన్లు జరగకుండా చైనా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది.

రాడార్‌ డోమ్‌ల నిర్మాణం..!
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దళాల కదలికలు తీవ్రమయ్యాయి. తాజాగా అక్కడ నిఘా కోసం రాడోమ్‌లను నిర్మిస్తోంది. వాతావరణ మార్పుల నుంచి రాడార్లను రక్షించేందుకు నిర్మించే డోము వంటి నిర్మాణాలను రాడోమ్‌లు అంటారు. వివాదాస్పదమైన ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8 మధ్యలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపగ్రహ చిత్ర నిపుణుడు డామియన్‌ సైమన్‌ 'డెట్రెస్‌ఫా' పేరిట నిర్వహించే ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. వాతావరణం ఎంత తీవ్రంగా ఉన్నా రాడార్లు ఎలక్ట్రో మాగ్నటిక్‌ సిగ్నల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడానికి వీలుగా ఈ రాడోమ్‌ల నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న రాడారుతో సరస్సు, దాని చుట్టుపక్కల శిఖరాలపై పూర్తిగా నిఘా పెట్టవచ్చు. ఇక్కడకు సమీపంలోనే సోలార్‌ ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాడార్ల సాయంతో సరస్సు పరిసరాల్లో భారత్‌ దళాల కదలికలపై చైనా నిఘా పెట్టడానికి అవకాశం లభిస్తుంది.

India China border
డామియన్‌ సైమన్‌ పోస్టు చేసిన చిత్రం

దూరం తగ్గించేందుకు భారీ వంతెన
డ్రాగన్‌ 1958లో స్వాధీనం చేసుకొన్న ఖుర్నాక్‌ ఫోర్టు ప్రాంతాన్ని బాగా వాడుకుంటోంది. 134 కిలోమీటర్ల పొడవున్న పాంగాంగ్‌ సరస్సులోని ఉత్తర-దక్షిణ తీరాల మధ్య ఇక్కడ కేవలం 500 మీటర్ల దూరమే ఉంటుంది. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌ నుంచి యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టింది. ఆ వంతెన నిర్మాణంలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్‌, సిరిజాప్‌లలోని స్థావరాలనుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం కలుగుతుంది. వంతెన నిర్మాణంతో దళాల ప్రయాణ దూరం 180 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. భారీ సైనిక వాహనాలను దీనిపై తరలించేందుకు వీలుగా ఈ వంతెన నిర్మాణం జరుగుతోందని గత వారం ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ముఖ్యంగా శతఘ్నులు, భారీ సైనిక సామగ్రిని దక్షిణ ఒడ్డుకు చేర్చే అవకాశం చైనాకు లభిస్తుంది. ఇక్కడ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టింది.

ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌లను మోహరించిన భారత్‌..
మరోపక్క దాడికి ఉపయోగించే ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ వాహనాలను ఈ సరస్సులో భారత్‌ గత వారమే మోహరించింది. అత్యవసర సమయాల్లో వేగంగా దాడిచేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకొంది. ఈ వాహనాలను గోవాలోని అక్వేరియస్‌ షిప్‌యార్డ్‌లో నిర్మించారు.

భారత పశువుల కాపర్లను అడ్డుకొంటున్న చైనా..
భారత పశువుల కాపర్లను వాస్తవాధీన రేఖ వద్దకు వెళ్లనీయకుండా చైనా దళాలు అడ్డుకొన్నాయి. ఈ ఘటన ఆగస్టు 21వ తేదీన చోటు చేసుకొంది. దెమ్‌చోక్‌ వద్ద సీఎన్‌ఎన్‌ జంక్షన్‌లోకి భారత కాపర్లు రావడంపై పీఎల్‌ఏ దళాలు అభ్యంతరం తెలిపాయి. ఓ పక్క భారత్‌-చైనా సైనికాధికారుల స్థాయిలో విడతల వారీగా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.