ETV Bharat / international

చైనాలో నిమ్మకాయలకు భారీ గిరాకీ.. ఎగబడుతున్న ప్రజలు.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Dec 21, 2022, 6:47 AM IST

Updated : Dec 21, 2022, 7:12 AM IST

కరోనా కేసులతో సతమతమవుతోన్న చైనాలో ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. వీటిని కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఇంతకీ చైనీయులకు వాటితో ఏం పని? అక్కడ నిమ్మకాయలకు ఎందుకంత డిమాండ్‌..?

chinese buy lemons
నిమ్మకాయలు కొంటున్న చైనీయులు

కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రజాందోళనలతో దిగొచ్చిన బీజింగ్‌ సర్కారు.. 'జీరో కొవిడ్‌' ఆంక్షలను సడలించిన తర్వాత కేసులు అమాంతం పెరిగాయి. రాబోయే మూడు నెలల్లో చైనాలో 60శాతం మంది కొవిడ్‌ బారిన పడే అవకాశముందని అటు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు గృహ వైద్యంపై దృష్టిపెట్టారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నిమ్మకాయరసాన్ని తెగ తాగేస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో చైనాలో వీటి గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

"నిమ్మకాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది" అని సిచుయాన్‌లోని అనియు కౌంటీకి చెందిన ఓ రైతు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. తాను 130 ఎకరాల్లో నిమ్మకాయలు పండిస్తున్నానని ఆయన తెలిపారు. అంతకుముందు రోజుకు కేవలం 5 నుంచి 6 టన్నుల నిమ్మకాయలు అమ్ముడయ్యేవని.. గత వారం రోజుల నుంచి 20 నుంచి 30 టన్నుల వరకు విక్రయిస్తున్నానని ఆయన చెప్పారు. చైనాలో విక్రయించే నిమ్మకాయల్లో 70 శాతం అనియు కౌంటీ నుంచే వస్తాయి. గిరాకీ పెరగడం వల్ల వీటి ధరలు కూడా కొండెక్కాయి.

బీజింగ్‌, షాంఘై వంటి నగరాల్లో నిమ్మకాయలకు గిరాకీ బాగా పెరిగిందట. మహమ్మారిని ఎదుర్కొనేలా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు 'సి' విటమిన్‌ ఉన్న ఆహార పదార్థాలు మెరుగ్గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నిమ్మకాయలను చైనీయులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు నారింజ, పియర్స్, పీచ్‌ వంటి పండ్లకు కూడా గిరాకీ పెరిగింది. వీటి కోసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

మరోవైపు, కరోనా కేసులు పెరగడం వల్ల ఫార్మా ఫ్యాక్టరీలకు కూడా తాకిడి పెరిగింది. చైనాలో గత కొన్ని రోజులుగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయినట్లు సోషల్‌మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక గత నాలుగు నెలల తర్వాత బీజింగ్‌లో 2 మరణాలు చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే అధికారిక లెక్కల కంటే ఈ మరణాల సంఖ్య చాలా ఎక్కువే అని వార్తలు వస్తున్నాయి. శ్మశాన వాటికలకు రోజూ వందలకొద్దీ మృతదేహాలు వస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Last Updated : Dec 21, 2022, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.