ETV Bharat / international

Canada Nazi Ukraine : క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని ట్రూడో.. అది చాలా పెద్ద తప్పిదం అంటూ..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 3:08 PM IST

Canada Nazi Ukraine : నాజీల తరఫున పోరాడిన వ్యక్తిని.. దేశ పార్లమెంటులో హీరోగా అభివర్ణించినందుకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో క్షమాపణలు చెప్పారు. ఆ వ్యక్తిని గుర్తించడంలో.. ఘోర తప్పిదం జరిగిందని.. నాజీ పాలనలో నష్టపోయిన వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లు అయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు కెనడా పార్లమెంటులో ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి దౌత్యమార్గాల్లో క్షమాపణలు చెప్పినట్లు వివరించారు.

Canada Nazi Ukraine
Canada Nazi Ukraine

Canada Nazi Ukraine : ఖలిస్థాన్‌ నేత నిజ్జర్‌ హత్య వివాదంలో భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలోనే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోను.. నాజీల అంశం ఉక్కిరిబిక్కిరి చేసింది. సొంత దేశంతో పాటు అంతర్జాతీయంగా కెనడా వైఖరిపై విమర్శలతో ట్రుడో స్వయంగా దిగివచ్చి క్షమాపణ చెప్పారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించారు. గత శుక్రవారం కెనడా పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా.. ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాను ఆహ్వానించారు.

పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్‌ రోటా స్వయంగా యారోస్లోవ్‌ హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి.. పోరాడిన యోధుడిగా కీర్తించారు. వెంటనే ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొట్టారు. అయితే.. కెనడా పార్లమెంట్‌ గౌరవించిన హంకా రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ పక్షాన పోరాడిన.. 14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌కు చెందిన వ్యక్తి అని తర్వాత తెలిసింది.

హిట్లర్‌ తరఫున పోరాడిన 14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌.. అప్పట్లో పోలిష్, యూదులను చిత్ర హింసలు పెట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే.. రష్యా విమర్శలు ఎక్కుపెట్టింది. ఉక్రెయిన్‌లోని తమ శత్రువులను.. నియో నాజీలుగా పేర్కొంది. నాజీని పార్లమెంటుకు తీసుకురావడంపై కెనడా ప్రతిపక్షాలు సహా వివిధ దేశాలు ట్రుడో ప్రభుత్వంపై.. విమర్శలు గుప్పించాయి. అన్ని వైపుల నుంచి విమర్శలతో రోటా స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. యూదులకు.. ప్రధాని ట్రుడో స్వయంగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షనేతలు పట్టుబట్టారు. హంకాను పార్లమెంటుకు తీసుకురావడం.. కెనడా చరిత్రలోనే దౌత్యపరంగా అతిపెద్ద ఇబ్బందికర పరిణామమని.. కెనడా ప్రతిపక్ష నేత పోయిలివ్రే విమర్శించారు.

ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడో.. బహిరంగ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం జరిగిన ఘటనకు సభ తరఫున.. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని.. దౌత్యమార్గాల ద్వారా సంప్రదించామన్నారు. ఆ రోజున పార్లమెంట్‌కు వచ్చిన వ్యక్తిని గుర్తించడంలో ఘోర తప్పిదం జరిగిందని.. ట్రుడో వివరించారు. నాజీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లయిందని విచారం వ్యక్తం చేశారు.

"శుక్రవారం జరిగిన ఘటనకు కెనడా ప్రజలు, యూదులు, ఉక్రెయిన్ ప్రజలకు పార్లమెంటు తరఫున బేషరతు క్షమాపణ చెబుతున్నాను. ఆ వ్యక్తి(నాజీ)ని గుర్తించడం, ఆహ్వానించడంలో పూర్తి బాధ్యత స్పీకర్‌దే. ఆయన అందుకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. ఇది పార్లమెంటును, కెనడాను తీవ్రంగా ఇబ్బంది పెట్టే పొరపాటు. అతడి గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా శుక్రవారం సభలో ఉన్నవారంతా ఆ వ్యక్తికి లేచి నిలబడి, చప్పట్లు కొట్టినందుకు మేము చింతిస్తున్నాం" అని అన్నారు ప్రధాని.

పుతిన్‌ నిరంకుశత్వంపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేందుకే శుక్రవారం.. పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు ట్రూడో తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛ కోసం, భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం.. ఉక్రెయిన్‌ చేస్తున్న త్యాగాలకు గుర్తింపుగా ఆ సమావేశం నిర్వహించామన్నారు.

Justin Trudeaus Popularity : పడిపోయిన ట్రూడో పాపులారిటీ.. కెనడా నెక్స్ట్​​ ప్రధాని ఆయనే!

Canada Hindu Threat : 'కెనడాలోని హిందువులకు బెదిరింపులు'.. భారత్​ సహకరించాలని విజ్ఞప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.